Share News

అంతా.. కల్తీమయం!

ABN , Publish Date - Apr 29 , 2024 | 11:59 PM

బియ్యం పిండికి రంగు కలిపితే అది పసుపు... పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు.. అరటి కాడ గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్టు, రసాయనాలు రుద్దితే నిగనిగలాడే పండ్లు, నాణ్యతలేని నూనెతో బిర్యానీ, నూడిల్స్‌.. నాన్‌వెజ్‌ వేపుళ్లు అబ్బో.. ఇలా చెప్పుకుంటే పోతే కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది.

అంతా.. కల్తీమయం!

హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో కల్తీ సరుకుల వినియోగం

విషతుల్యమవుతున్న నిత్యావసర వస్తువులు

నూనె, పండ్లు, పాలు కూడా నాసిరకమే

సిద్దిపేటలో పెరిగిన హోటల్‌ కల్చర్‌

కనుమరుగైన ఆహార సలహా సంఘాలు!?

సిద్దిపేటరూరల్‌, ఏప్రిల్‌ 29: బియ్యం పిండికి రంగు కలిపితే అది పసుపు... పాల పొడిలో నీళ్లు కలిపితే చిక్కటి పాలు.. అరటి కాడ గుజ్జుతో అల్లం వెల్లుల్లి పేస్టు, రసాయనాలు రుద్దితే నిగనిగలాడే పండ్లు, నాణ్యతలేని నూనెతో బిర్యానీ, నూడిల్స్‌.. నాన్‌వెజ్‌ వేపుళ్లు అబ్బో.. ఇలా చెప్పుకుంటే పోతే కాదేదీ కల్తీకి అనర్హం అన్నట్లుగా ఉంది. ఇదంతా సిద్దిపేట జిల్లాలో చాలాచోట్ల జరుగుతున్న కల్తీ వ్యవహారం. కొందరు వ్యాపారులు అత్యాశకు పోయి కల్తీ సరుకులు తయారు చేస్తు జేబులు నింపుకునే ప్రయత్నం చేస్తున్నారు. ఆకర్షణీయమైన ప్యాకింగ్‌తో కల్తీవస్తువులను ప్రజలకు అంటగడుతున్నారు. నిత్యవసర సరుకుల ధరల పెరుగుదల కూడా ఇందుకు కారణం.

కానరాని తనిఖీలు.. నమూనాల సేకరణ

ఫుడ్‌ ఇన్‌స్పెక్టర్లు మార్కెట్‌లో విక్రయించే నిత్యావసర వస్తువులను తరుచూ తనిఖీలు చేపట్టి నమూనాలను సేకరించాల్సి ఉంటుంది. ప్రతీ వస్తువు నాణ్యతా ప్రమాణాలను పరిశీలించాల్సి ఉంటుంది. ఈ క్రమంలో నెలకు కనీసం ఆరు నమూనాలు తీసి ఎఫ్‌ఎ్‌సఎల్‌ (ఫుడ్‌ సేఫ్టీ ల్యాబొరేటరీకి) పంపించాల్సి ఉంటుంది. అక్కడి నుంచి వచ్చే నివేదిక ఆధారంగా చర్యలు తీసుకోవాలి. ఫిర్యాదులు వెల్లువెత్తిన సమయంలో మినహా అధికారులు ఆ దిశగా ఎలాంటి చర్యలు తీసుకోవడం లేదనే ఆరోపణలున్నాయి. నామమాత్రంగా నమూనాలు సేకరించినా.. వాటి ఫలితాలు వచ్చేసరికి కేసు నీరుగారిపోతుంది.

పెరిగిన హోటల్‌ కల్చర్‌

జిల్లా కేంద్రంగా మారిన తర్వాత సిద్దిపేటలో హోటల్‌ కల్చర్‌ బాగా పెరిగింది. ఏ చిన్న సందర్భమైనా హోటల్‌లో విందు చేసుకోవడం అధికమైంది. ఇదే అదనుగా భావించిన కొందరు వ్యాపారులు కల్తీకి పాల్పడుతున్నారు. ఇక మారుతున్న కాలానుసారం మనుషుల జీవన విధానంలోనూ అనేక మార్పులు చోటుచేసుకుంటున్నాయి. ఉద్యోగులు మొదులు కొని రోజువారి కూలీల వరకు వివిధ పనులపై బయటకు వెళ్లినపుడు అవసరాన్ని బట్టి టీ, టిఫిన్‌, భోజనం కోసం హోటళ్లు, ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లు, బేకరీలు, రెస్టారెంట్లను ఆశ్రయిస్తుంటారు. ఎక్కువగా ఫాస్ట్‌ఫుడ్‌ సెంటర్లలో రద్దీగా కనిపిస్తుంటాయి. అయితే పెరుగుతున్న నిత్యావసర సరుకుల ధరలతో వ్యాపారులు కల్తీ వైపు మొగ్గుచూపుతున్నారు. చాలాచోట్ల నాణ్యతాప్రమాణాలను పాటించడం లేదు. నిబంధనలకు విరుద్ధంగా రంగులను కలుపుతూ క్యాన్సర్‌, గుండె జబ్బుల వంటి ప్రాణాంతకమైన రోగాలకు కారణమవుతున్నారు. మరికొంత మంది అయితే మాంసం విక్రయించే వారితో భేరం కుదుర్చుకుని రోగంతో చనిపోయిన, గాయాలపాలైన వాటిని సైతం తక్కువ ధరకు కోనుగోలు చేసి వంటకాలు చేస్తున్నారు. పలువురు హోటల్‌ నిర్వాహకులు, వ్యాపారులు తక్కువ ధరకు లభిస్తుందని కల్తీ పదార్థాలతోనే వంటలు చేసి ప్రజలకు అంటగడుతున్నారు. సిద్దిపేట పట్టణంలో రోడ్డుకు ఇరువైపులా ఎలాంటి జాగ్రత్తలు లేకుండానే ఆహార పదార్థాలు విక్రయిస్తున్నారు. అలాగే ప్లాస్టిక్‌రహిత జిల్లాగా మార్చాలని నాయకులు, అధికారులు చెబుతున్నా... ఎక్కడా కూడా అమలు కావడం లేదు.

ఆహార సలహా సంఘాల ఊసేలేదు

ప్రజలు మోసాల బారిన పడకుండా వారిని చైతన్యం చేస్తూ ఎప్పటికప్పుడు అవగాహన కల్పించేందుకు మండల, జిల్లాస్థాయి ఆహార సలహా సంఘాలను గతంలో ప్రభుత్వం ఏర్పాటు చేసేది. ఈ సంఘాల సభ్యులు కల్తీ, మోసాలను అరికట్టేందుకు మూడు నెలలకొకసార అధికారులతో సమావేశమై తగిన చర్యలు తీసుకోవాల్సి ఉంటుంది. అయితే కొన్నేళ్లుగా ఈ ఆహార సలహా సంఘాల నియామకం లేక నిర్వీర్యమయ్యాయి. ఇక అధికారుల నిఘా కూడా కొరవడి, వీటి ఏర్పాటును సైతం పట్టించుకోకపోవడంతో వ్యాపారులు ఆడిందే ఆటగా మారిందన్న విమర్శలు వ్యక్తమవుతున్నాయి. వినియోగదారులు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఆహార సలహా సంఘాలు ఏర్పాటు చేయాలని వినియోగదారులు కోరుతున్నారు.

ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు

- శ్రీనివాస్‌, సిద్దిపేట

జిల్లాలో ఏదో ఒక సందర్భంలో తనిఖీలు చేపట్టి నమూనాలను సేకరించి పరీక్షల నిమిత్తం ల్యాబోరేటరీకి పంపుతున్నారు. కానీ ఫలితాలు మాత్రం వెల్లడించడం లేదు. నాసిరకం, కల్తీ పదార్థాల వల్ల ప్రజలు రోగాల బారిన పడుతున్నారు. ఆసుపత్రుల్లో రూ.వేలల్లో బిల్లులు చెల్లించాల్సిన పరిస్థితి. అనేకసార్లు అధికారులకు ఫిర్యాదు చేసినా పట్టించుకోవడం లేదు. కమిటీ ఉంటేనే అధికారుల పర్యవేక్షణ సరిగా ఉంటుంది. హోటల్‌ నిర్వహకులు, వ్యాపారులు కూడా నాణ్యమైన సరుకులనే వాడాలి.

Updated Date - Apr 29 , 2024 | 11:59 PM