Share News

మెదక్‌ అభివృద్ధికి కాంగ్రెస్సే అడ్డు

ABN , Publish Date - May 01 , 2024 | 12:02 AM

ఉమ్మడి మెదక్‌ జిల్లాను ఎంతగా అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నించినా.. రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు.

మెదక్‌ అభివృద్ధికి కాంగ్రెస్సే అడ్డు

సిద్దిపేట-మనోహరాబాద్‌ రైల్వేలైన్‌కు స్థలమివ్వని రాష్ట్ర ప్రభుత్వం

ఇదీ రేవంత్‌కు ఈ ప్రాంతంపై ఉన్న ప్రేమ..

సంగారెడ్డి-అకోలా, మెదక్‌-భైంసా హైవేలు వేసింది మేమే

జాతీయ రహదారితో అందోలు, నారాయణఖేడ్‌, జుక్కల్‌ సెగ్మెంట్లకు మహర్దశ

‘అమృత్‌ స్టేషన్‌’గా జహీరాబాద్‌ రైల్వేస్టేషన్‌ : ప్రధానమంత్రి నరేంద్ర మోదీ

జోగిపేట, ఏప్రిల్‌ 30: ఉమ్మడి మెదక్‌ జిల్లాను ఎంతగా అభివృద్ధి చేయాలని తాము ప్రయత్నించినా.. రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ ప్రభుత్వం మోకాలడ్డుతోందని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ విమర్శించారు. అందోలు సెగ్మెంట్‌ పరిధిలోని అల్లాదుర్గం మండలం చిల్వర్‌ చౌరస్తా వద్ద మంగళవారం నిర్వహించిన బీజేపీ ప్రచార (విశాల్‌ జన) సభలో ఆయన ప్రసంగించారు. అభివృద్ధిపై తమకు చిత్తశుద్ధి ఉండడంతోనే సంగారెడ్డి-అకోలా హైవేను అభివృద్ధి చేశామని పేర్కొన్నారు. దీంతో రహదారి సౌకర్యం మెరుగుపడి సంగారెడ్డి, అందోలు, నారాయణఖేడ్‌, జుక్కల్‌ సెగ్మెంట్లు అభివృద్ధి చెందుతున్నాయని తెలిపారు. ఇప్పటికే పూర్తిచేసిన హైదరాబాద్‌-మెదక్‌ జాతీయ రహదారికి అనుసంధానంగా మెదక్‌-ఎల్లారెడ్డి-బోధన్‌-భైంసా రోడ్డును కూడా జాతీయ రహదారిగా గుర్తించి విస్తరిస్తున్నామని తెలియజేశారు. ఈ రోడ్డు అభివృద్ధితో మెదక్‌, కామారెడ్డి, నిర్మల్‌ జిల్లాలు అభివృద్ధి చెందుతాయని పేర్కొన్నారు. లోక్‌సభ నియోజకవర్గ కేంద్రమైన జహీరాబాద్‌లోని రైల్వేస్టేషన్‌ను అమృత్‌ రైల్వే స్టేషన్‌గా గుర్తించి తీర్చిదిద్దామని అన్నారు. కేంద్ర ప్రభుత్వం ఈ ప్రాంత అభివృద్ధి కోసం నిరంతరం కృషి చేస్తుంటే.. కాంగ్రెస్‌ మాత్రం సహకరించడం లేదని విమర్శించారు. రాష్ట్ర ప్రభుత్వానికి ఉమ్మడి జిల్లా అభివృద్ధిపై చిత్తశుద్ధి లేదని ఆరోపించారు. అందుకే ఈప్రాంతాన్ని అభివృద్ధి చేసే పనులను రేవంత్‌ నేతృత్వంలోని కాంగ్రెస్‌ సర్కారు అడ్డుకుంటున్నదని మోదీ మండిపడ్డారు. మనోహరాబాద్‌-సిద్దిపేట-సిరిసిల్ల-కొత్తపల్లి రైల్వేలైన్‌ ఏర్పాటుకు కేంద్ర ప్రభుత్వం సిద్ధంగా ఉన్నా రాష్ట్ర ప్రభుత్వం సహకరించడం లేదని ఆరోపించారు. రైల్వేస్టేషన్లకు స్థలం ఇవ్వడం లేదన్నారు. అలాగే, పొరుగున ఉమ్మడి వరంగల్‌ జిల్లాలో వనదేవతలైన సమ్మక్క-సారక్కల పేరిట గిరిజన యూనివర్సిటీ ఏర్పాటు చేస్తామన్నా రేవంత్‌ ప్రభుత్వం అడ్డుకుంటున్నదని ఆగ్రహం వ్యక్తంచేశారు. యూనివర్సిటీకి రాష్ట్ర ప్రభుత్వం స్థలం కేటాయించడం లేదని ప్రధాని ఆరోపించారు. ఈ ప్రాంతం అభివృద్ధి చెందాలంటే లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీ జహీరాబాద్‌ అభ్యర్థి బీబీపాటిల్‌, మెదక్‌లో పోటీ చేస్తున్న రఘునందన్‌ రావులను భారీ మెజారిటీతో గెలిపించి పార్లమెంట్‌కు పంపించాలని కోరారు. కార్యక్రమంలో బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు జి.కిషన్‌రెడ్డి, ఎంపీ అభ్యర్థులు బీబీ పాటిల్‌, రఘునందన్‌రావు, కామారెడ్డి ఎమ్మెల్యే వెంకటరమణారెడ్డి, సంగారెడ్డి జిల్లా బీజేపీ అధ్యక్షురాలు గోదావరి అంజిరెడ్డి, ఉపాధ్యక్షుడు ఆర్‌.ప్రభాకర్‌గౌడ్‌, ప్రధాన కార్యదర్శి అనంతరావు కులకర్ణి, నాయకులు ప్రభాత్‌, జగదీశ్వర్‌, గంగా జోగినాథ్‌, రవిశంకర్‌, గాజుల నవీన్‌, సత్యం, జగన్నాథం, పులుగు గోపి, గాజుల అనిల్‌, ఉల్వల వెంకటేశం తదితరులు పాల్గొన్నారు.

జోర్దార్‌గా బీజేపీ సభ

అందోలు సెగ్మెంట్‌ పరిధిలోని అల్లాదుర్గం మండలం చిల్వర్‌ చౌరస్తా వద్ద మంగళవారం నిర్వహించిన విశాల్‌ జనసభ బీజేపీ శ్రేణుల్లో జోష్‌ నింపింది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ హాజరైన ఈసభకు కార్యకర్తలు, అభిమానులు భారీగా తరలివచ్చారు. సాయంత్రం 4:53 నిమిషాలకు చిల్వెర చౌరస్తా వద్ద ఏర్పాటు చేసిన హెలిప్యాడ్‌ వద్ద హెలికాప్టర్‌ దిగిన ప్రధానమంత్రి నరేంద్రమోదీ రెండు నిమిషాల్లో వేదిక పైకి చేరుకున్నారు. ఎండ తీవ్రత, ఉక్కపోతను కూడా లెక్క చేయకుండా వేలాదిగా జనం తరలిరావడంతో మోదీ సంతోషం వ్యక్తం చేశారు. వేదికపై ప్రధానిని బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు కిషన్‌రెడ్డి, జహీరాబాద్‌ ఎంపీ అభ్యర్థి బీబీపాటిల్‌ సత్కరించి జ్ఞాపిక అందజేశారు. మోదీ ప్రసంగించేందుకు సిద్ధమవడంతో మోదీ.. మోదీ.. అంటూ నినాదాలతో సభ దద్దరిల్లింది. మోదీ ప్రసంగాన్ని రాజ్యసభ సభ్యుడు డాక్టర్‌ లక్ష్మణ్‌ తెలుగులోకి అనువదించారు. 45 నిమిషాలు కొనసాగిన ప్రధానమంత్రి ప్రసంగానికి అడుగడుగున జనం హర్షధ్వానాలు, జైశ్రీరాం.. జై మోదీ అంటూ నినాదాలతో హోరెత్తించారు.

Updated Date - May 01 , 2024 | 12:02 AM