Share News

సిద్దిపేటను అవమానించిన సీఎం రేవంత్‌

ABN , Publish Date - May 01 , 2024 | 11:20 PM

చిన్నకోడూరు, మే 1: సిద్దిపేట అంటే సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి చిన్న చూపేనని, తెలంగాణ తెచ్చింది మన సిద్దిపేట బిడ్డ కేసీఆర్‌ అని, అలాంటి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన తిడుతున్నాడని, కేసీఆర్‌ను తిట్టడం అంటే మన సిద్దిపేట ప్రజలను అవమాన పర్చినట్లేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు.

సిద్దిపేటను అవమానించిన సీఎం రేవంత్‌
రోడ్‌షోలో మాట్లాడుతున్న మాజీ మంత్రి హరీశ్‌రావు, పక్కన ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి

ఈ ఎన్నిక తెలంగాణ భవిష్యత్‌ కోసం జరిగే ఎన్నిక

రైతుబంధు, రైతుబీమా పథకాలతో కేసీఆర్‌ రైతుల గౌరవం పెంచారు

అబద్ధాల కాంగ్రె్‌సకు ప్రజలు ఓటుతో బుద్ధి చెప్పాలి

చిన్నకోడూరు రోడ్‌షోలో మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు

చిన్నకోడూరు, మే 1: సిద్దిపేట అంటే సీఎం రేవంత్‌రెడ్డికి మొదటి నుంచి చిన్న చూపేనని, తెలంగాణ తెచ్చింది మన సిద్దిపేట బిడ్డ కేసీఆర్‌ అని, అలాంటి కేసీఆర్‌ను సీఎం రేవంత్‌రెడ్డి ఇష్టారీతిన తిడుతున్నాడని, కేసీఆర్‌ను తిట్టడం అంటే మన సిద్దిపేట ప్రజలను అవమాన పర్చినట్లేనని మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు పేర్కొన్నారు. బుధవారం రాత్రి సిద్దిపేట జిల్లా చిన్నకోడూరులో నిర్వహించిన రోడ్‌షోలో బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి, జడ్పీ చైర్‌పర్సన్‌ రోజాశర్మతో కలిసి పాల్గొన్నారు. స్థానిక ఎల్లమ్మ ఆలయం నుంచి వివేకానంద విగ్రహం వరకు ర్యాలీ తీశారు. ఈ సందర్భంగా హరీశ్‌రావు మాట్లాడారు. ఈనెల 13న జరిగే ఎన్నిక ఓట్లు, సీట్లు, అధికారం కోసం జరిగేది కాదని తెలంగాణ భవిష్యత్‌ కోసం జరిగే ఎన్నిక అన్నారు. సీఎం రేవంత్‌రెడ్డివి అయితే తిట్లు లేకపోతే దేవుని మీద ఓట్లు అని విమర్శించారు. మోసపూరిత హామీలతో గద్దెనెక్కిన కాంగ్రె్‌సకు ప్రజలు ఓటుతో తగిన బుద్ధి చెప్పాలన్నారు. కేసీఆర్‌ రైతుల సంక్షేమం కోసం రైతుబంధు, రైతుబీమా పథకాలు ప్రవేశపెట్టి అమలుచేసి రైతుల గౌరవం పెంచాడని తెలిపారు. కల్లాలకు ధాన్యం వచ్చినా.. రైతు ఖాతాల్లో రైతుబంధు పడలేదని ఆయన ఆరోపించారు. బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో తడిసిన ధాన్యాన్ని సైతం కొనుగోలు చేసి రెండురోజుల్లో రైతుల ఖాతాల్లో డబ్బులు జమచేశామని గుర్తు చేశారు. ప్రస్తుతం రోజుల తరబడి కొనుగోలు కేంద్రాల వద్ద రైతులు పడిగాపులు కాస్తున్నా వడ్లు కొనే దిక్కులేదని ఆరోపించారు. పొరపాటున బీజేపీకి ఓటు వేస్తే ‘పెనం మీద నుంచి వెళ్లి పొయ్యిల పడ్డట్టేనని’ ప్రజలకు సూచించారు. బీఆర్‌ఎస్‌ మెదక్‌ ఎంపీ అభ్యర్థి వెంకట్రామారెడ్డి మాట్లాడుతూ.. పెందింటి విద్యార్థుల చదువుల కోసం రూ.100 కోట్లతో పీవీఆర్‌ ట్రస్ట్‌ ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. పోటీ పరీక్షల కోసం సిద్దిపేటలో ఉచిత కోచింగ్‌ సెంటర్లను ఏర్పాటు చేస్తానని హామీఇచ్చారు. ఈ నెల 13న జరిగే పార్లమెంట్‌ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటువేసి తనను ఆశీర్వదించాలని ప్రజలను కోరారు. అంతకుమందు కాంగ్రెస్‌, బీజేపీ నాయకులు ఇచ్చిన హామీలను హరీశ్‌రావు ఎల్‌ఈడీ స్ర్కీన్‌ ద్వారా ప్రజలకు వివరించారు. ఈ కార్యక్రమంలో ఎంపీపీ మాణిక్యరెడ్డి, బీఆర్‌ఎస్‌ రాష్ట్ర కార్యదర్శి రాధాకృష్ణశర్మ, మండల అధ్యక్షుడు శ్రీనివాస్‌, వైస్‌ ఎంపీపీ పాపయ్య, పీఏసీఎస్‌ చైర్మన్లు సదానందం, కనకరాజు, ఎంపీటీసీలు, తాజా, మాజీ సర్పంచులు, బీఆర్‌ఎస్‌ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:20 PM