Share News

45.9

ABN , Publish Date - May 01 , 2024 | 11:46 PM

దూళిమిట్టలో గరిష్ఠ ఉష్ణోగ్రత

45.9
సంగారెడ్డి లో నిర్మానుష్యం

ఈ ఏడాది ఇదే అత్యధికం

సిద్దిపేట జిల్లాకు రెడ్‌ అలర్ట్‌ జారీ

ఉమ్మడి జిల్లాలో 43 నుంచి 45 డిగ్రీలు నమోదు

భానుడి భగభగలతో ఉక్కిరిబిక్కిరి

ఆరెంజ్‌ అలర్ట్‌లో సంగారెడ్డి, మెదక్‌ జిల్లాలు

మెదక్‌ అర్బన్‌, మే 1: ఉమ్మడి మెదక్‌ జిల్లాలో భానుడు నిప్పులు కురిపిస్తున్నాడు. ఉదయం నుంచి ఎండలు మండుతుండడంతో జనం ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. రోజురోజుకూ ఉష్ణోగ్రతలు రికార్డుస్థాయికి పెరుగుతున్నాయి. ఎండలకు తోడు వడగాలులు వీస్తుండడంతో ఇంటి నుంచి బయటకు వచ్చేందుకు ప్రజలు జంకుతున్నారు. ఉమ్మడి జిల్లాలో పలుచోట్ల 43 నుంచి 45 డిగ్రీలకుపైగా అత్యధిక ఉష్ణోగ్రతలు నమోదవుతున్నాయి. సిద్దిపేట జిల్లా దూళిమిట్టలో గరిష్ఠంగా 45.9 డిగ్రీల ఉష్ణోగ్రత నమోదైంది. ఈ ఏడాది నమోదైన ఉష్ణోగ్రతల్లో ఇదే అత్యధికం. సంగారెడ్డి జిల్లా సదాశివపేటలో 44.6 డిగ్రీలు, మెదక్‌ జిల్లా చేగుంటలో 43.5 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి. వాతావరణశాఖ సిద్దిపేట జిల్లాలోని కొన్ని ప్రాంతాలకు రెడ్‌ అలర్ట్‌ జారీ చేయగా, సంగారెడ్డి, మెదక్‌ జిల్లాకు ఆరెంజ్‌ అలర్ట్‌ జారీ చేసింది. మధ్యాహ్న సమయంలో ఉమ్మడి జిల్లాలోని ముఖ్య కూడళ్లు నిర్మానుష్యంగా మారుతున్నాయి. నిత్యం ప్రయాణికులతో కిటకిటలాడే బస్టాండ్లు, ప్రధాన కూడళ్లు బోసిపోతున్నాయి. రాత్రి 10 దాటినా వేడి తగ్గడం లేదు. రాత్రిపూట వేడి వాతావరణం నెలకొని ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.

గడప దాటలేక.. ఉక్కపోత తట్టుకోలేక

ఉమ్మడి జిల్లాలోని పలు ప్రాంతాలు నిప్పులకుంపటిగా తయారయ్యాయి. ఇంట్లో ఉన్నా ఎండ వేడిమికి ఉక్కపోతను భరించలేకపోతున్నారు. ఫ్యాన్‌ కింద కూర్చున్నా ఉపశమనం లభించడం లేదు. మధ్యాహ్నం 12 నుంచి సాయంత్రం 4 గంటల వరకు అసలు బయటకు వెళ్లలేని పరిస్థితి. ఈ సమయంలో గాలిలో తేమ శాతం తగ్గి ఉక్కపోత పెరుగుతోంది. రానున్న రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశం ఉందని వాతావరణ శాఖ అధికారులు పేర్కొన్నారు.

గరిష్ఠ ఉష్ణోగ్రతలిలా...

సిద్దిపేట జిల్లాలో

దూళిమిట్టలో అత్యధికంగా 45.9 డిగ్రీల సెల్సియ్‌సగా నమోదు కాగా... చిట్యాల 45.4, లక్డారం 45.1, రేంబర్తి 44.8, సిద్దిపేట 44.6, తుక్కాపూర్‌ 44.3, ఆంగడికిష్టాపూర్‌ 43.9 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదైంది.

సంగారెడ్డి జిల్లాలో

సదాశివపేట 44.6, కొండాపూర్‌ 44.1, కల్హేర్‌లో 44.0, కిష్టారెడ్డిపేట 43.7 డిగ్రీల ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

మెదక్‌ జిల్లాలో

చేగుంట 43.5, పాతూర్‌ 43.4, కౌడిపల్లి 43.2, రేగోడ్‌ 43.1 డిగ్రీల గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయి.

జాగ్రత్తలు పాటించాలి

తప్పని పరిస్థితుల్లో బయటకు వెళ్లే వారు రక్షణ చర్యల్ని తీసుకోవాలి. ముఖ్యంగా పిల్లల విషయంలో జాగ్రత్త. వృద్ధులు, చిన్నారులు, క్రీడాకారులు, గర్భిణులు, బాలింతలపై ఎండ ప్రభావం ఎక్కువగా ఉంటుంది. దీర్ఘకాలిక వ్యాధులు, స్థూలకాయం ఉన్నవారు జాగ్రత్తగా ఉండాలి.

- డా.శివదయాల్‌, సివిల్‌ సర్జన్‌

Updated Date - May 01 , 2024 | 11:46 PM