Share News

ఇంకా 10 రోజులే

ABN , Publish Date - May 01 , 2024 | 11:43 PM

నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా పదిరోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

ఇంకా 10 రోజులే

లోక్‌సభ ఎన్నికల ప్రచారంలో అభ్యర్థుల దూకుడు

బీఆర్‌ఎ్‌సలో అన్నీతానైన హరీశ్‌రావు

సుడిగాలిలా పర్యటిస్తున్న వెంకట్రామారెడ్డి

ప్రచారంలో పట్టువదలని రఘునందన్‌

కాంగ్రెస్‌లో జోష్‌ నింపేందుకు నేడు సిద్దిపేటకు రేవంత్‌

ప్రచారంపై ఎండల ప్రభావం!

ఆంధ్రజ్యోతి ప్రతినిధి, సిద్దిపేట, మే1: నామినేషన్ల ఉపసంహరణ ఘట్టం ముగియడంతో అభ్యర్థుల ప్రచారం ఒక్కసారిగా ఉధృతమైంది. ప్రచారానికి ఇంకా పదిరోజులే మిగలడంతో అభ్యర్థులు హోరాహోరీగా పర్యటిస్తున్నారు. ఓ వైపు ఎండలు మండుతున్నప్పటికీ సమయం తక్కువగా ఉండడంతో ప్రచారంపైనే దృష్టిసారిస్తున్నారు. ప్రత్యక్షంగా ప్రజలను కలుస్తూ తమను గెలిపించాలని అభ్యర్థిస్తున్నారు.

బీఆర్‌ఎస్‌ పార్టీకి కంచుకోటగా ఉన్న మెదక్‌ పార్లమెంట్‌ స్థానంలో పాగా వేయాలని ఇటు బీజేపీ అటు కాంగ్రెస్‌ పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అయితే తమ స్థానాన్ని పదిలంగా ఉంచుకోవడానికి బీఆర్‌ఎస్‌ సైతం సర్వత్రా ముందుకెళ్తోంది. ఒకరికి స్థానికంగా బలం ఉండగా, మరో ఇద్దరికి కేంద్రంలో, రాష్ట్రంలో అధికారమే బలమైంది. ఆ ధీమాతోనే ఎవరికివారు ప్రచారంలో దూకుడు పెంచుతున్నారు.

వెంకట్రామారెడ్డి వెన్నంటే హరీశ్‌..

బీఆర్‌ఎస్‌ అభ్యర్థిగా వెంకట్రామారెడ్డిని ప్రకటించిన క్షణం నుంచి ఇప్పటిదాకా మాజీ మంత్రి, సిద్దిపేట ఎమ్మెల్యే హరీశ్‌రావు ఆయన వెన్నంటే ఉంటున్నారు. మెదక్‌ స్థానాన్ని నిలబెట్టుకోవాలని హరీశ్‌ ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. గత అసెంబ్లీ ఎన్నికల్లో రాష్ట్ర వ్యాప్తంగా ప్రతికూల పరిస్థితి ఎదురుకావడంతో మునుపటి జోష్‌ను రేకెత్తించేలా విజయం కోసం ప్రయత్నిస్తున్నారు. మెదక్‌ లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో ఆరింట్లోనూ బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యేలే ఉండడం ఆ పార్టీకి లాభించే విషయంగా భావిస్తున్నారు. ఈ ప్రాంతంపై పూర్తిగా పట్టున్న హరీశ్‌రావు తనదైన శైలిలో ప్రణాళిక సిద్ధం చేయడంతో వెంకట్రామారెడ్డి ప్రచారం సులభతరమవుతోంది. అంతేగాకుండా మండల కేంద్రాల్లో రోడ్‌షోలు, ఉదయం వేళలో మార్నింగ్‌ వాక్‌ కార్యక్రమాలు, మధ్యాహ్న సమయాల్లో పలు వర్గాల వారీగా సమావేశాలు నిర్వహిస్తూ ముందుకెళ్తున్నారు. జనసమీకరణకు తగిన ప్రాధాన్యత ఇస్తున్నారు. ఈనెల 10న సిద్దిపేటలో కేసీఆర్‌ హాజరయ్యే సభకు పెద్ద ఎత్తున ప్రజలను సమీకరించాలని కసరత్తు చేస్తున్నారు.

రఘునందన్‌రావు విస్తృతంగా...

గత పార్లమెంటు ఎన్నికల్లోనూ ఎంపీగా పోటీచేసి ఓడిపోయిన బీజేపీ అభ్యర్థి రఘునందన్‌రావు సైతం విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. లోక్‌సభ నియోజకవర్గంపై పూర్తిగా పట్టున్న నేపథ్యంలో ప్రణాళిక బద్ధమైన ప్రచారం చేస్తున్నారు. తాను అభ్యర్థిగా ఎంపికైన నాటి నుంచి ఒక షెడ్యూల్‌ ప్రకారం సమావేశాలు, రోడ్‌షోలు, అంతర్గత మీటింగ్‌లు, కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తున్నారు. మెదక్‌లో తన నామినేషన్‌ కార్యక్రమానికి గోవా ముఖ్యమంత్రి ప్రమోద్‌ సావంత్‌ను తీసుకొచ్చారు. ఇటీవల సిద్దిపేటలో అమిత్‌షాతో బహిరంగ సభ నిర్వహింపజేశారు. తాజాగా అల్లాదుర్గంలో ప్రధాని మోదీ సభకు మెదక్‌ లోక్‌సభ కార్యకర్తలు, ప్రజలను తరలించారు. వీటితోపాటు క్షేత్రస్థాయిలో కాషాయదళాన్ని అప్రమత్తం చేస్తున్నారు. ఇంటింటి ప్రచారం నిర్వహించేలా వెంటపడుతున్నారు. తాను కూడా ఈ కాస్త సమయాన్ని వినియోగించుకునేలా దృష్టి పెట్టినట్లుగా తెలుస్తోంది. ఈ ఒక్కసారితనకు అవకాశం కల్పించాలని వేడుకుంటున్నారు. కేంద్రంలోని మోదీ చరీష్మా తనకు కలిసి వస్తుందని భావిస్తున్నారు.

రేవంత్‌పైనే కాంగ్రెస్‌ అభ్యర్థి ఆశలు..

ప్రచారంలో బీఆర్‌ఎస్‌, బీజేపీతో పోల్చితే కాంగ్రెస్‌ అభ్యర్థి నీలం మధు నెమ్మదిగా పుంజుకుంటున్నారు. క్షేత్రస్థాయి ప్రచారంలో ఇప్పుడిప్పుడే నిమగ్నమయ్యారు. మెదక్‌లో ఒకసారి రేవంత్‌రెడ్డి రోడ్‌షోను నిర్వహించగా ఆ ఉత్సాహాన్ని కాపాడుకోలేకపోయారనే విమర్శలు ఉన్నాయి. తాజాగా నేడు సిద్దిపేటలో రేవంత్‌రెడ్డి రోడ్‌షో జరగనున్నది. మెదక్‌ పార్లమెంటు పరిధిలో రేవంత్‌ది ఇదే చివరి సభ అయ్యే అవకాశం కూడా లేకపోలేదు. కనీసం ఇప్పుడైనా రేవంత్‌ క్రేజ్‌ను ప్రజల్లోకి తీసుకెళ్లే విధంగా శ్రమించాలని ఆ పార్టీ నేతలే అంటున్నారు. దీనికితోడు పలు నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పార్టీలో అసంతృప్తుల గళం వినిపిస్తోంది. ఎంపీ అభ్యర్థి తమను పట్టించుకోవడం లేదని చెబుతున్నారు. లోక్‌సభ పరిధిలోని ఏడు నియోజకవర్గాల్లో పలుచోట్లా నీలం మధుకు సొంత పార్టీలోనే ఆశించిన మద్దతు దక్కడం లేదనే అభిప్రాయాలున్నాయి. ఇటు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ఉన్న రేవంత్‌రెడ్డి చరిష్మాతోపాటు తన బీసీ కార్డును ఉపయోగిస్తూ పలు సమావేశాల్లో మాట్లాడుతున్నారు. ప్రధానంగా బీఆర్‌ఎ్‌సకు కంచుకోటలుగా ఉన్న సిద్దిపేట, గజ్వేల్‌, దుబ్బాక నియోజకవర్గాల్లో కాంగ్రెస్‌ పట్టుకోసం ప్రయత్నిస్తున్నా సత్ఫలితాలు రావడం లేదనే చర్చ జరుగుతోంది.

Updated Date - May 01 , 2024 | 11:43 PM