Share News

‘పది’ ఫలితాల్లో జిల్లాకు 32వ స్థానం

ABN , Publish Date - Apr 30 , 2024 | 11:34 PM

పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గత ఏడాది రాష్ట్రంలో 27వ స్థానంలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా, ఈ ఏడాది 32వ స్థానానికి పడిపోయింది.

‘పది’ ఫలితాల్లో జిల్లాకు 32వ స్థానం
10/10 జీపీఏ సాధించిన విద్యార్థులు, పాఠశాల ఉపాధ్యాయులను అభినందిస్తున్న అదనపు కలెక్టర్‌

- గత ఏడాదితో పోల్చితే తగ్గిన ఉత్తీర్ణత

- 83.97 శాతం ఉత్తీర్ణతతో బాలికలదే పైచేయి

- బాలురు 78.67 శాతం పాస్‌

- 25 పాఠశాలల్లో వంద శాతం పాస్‌

గద్వాల టౌన్‌, ఏప్రిల్‌ 30 : పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో గత ఏడాది రాష్ట్రంలో 27వ స్థానంలో ఉన్న జోగుళాంబ గద్వాల జిల్లా, ఈ ఏడాది 32వ స్థానానికి పడిపోయింది. జిల్లాలోని వివిధ యాజమాన్యాల పరిధిలోని మొత్తం 25 పాఠశాలు వంద శాతం ఉత్తీర్ణత సాధించగా, 34 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. మార్చి 18వ తేదీ నుంచి ఏప్రిల్‌ రెండవ తేదీ వరకు నిర్వహించిన పదవ తరగతి పరీక్ష ఫలితా లను మంగళవారం వెల్లడించారు. జిల్లా వ్యాప్తంగా మొత్తం 7,175 మంది విద్యార్థులు పరీక్షలు రాశారు. వారిలో 5,839 మంది (81.38 శాతం) మంది విద్యార్థులు ఉత్తీర్ణత సాధించారు. మిగిలిన 1,336 మంది ఫెయిల్‌ అయ్యారు. బాలుర విభాగంలో 3,512 మందికి గాను 2,763 (78.67 శాతం), బాలికల విభాగంలో 3,663 మందికి, 3,017 (83.97 శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. గత ఏడాదితో పోలిస్తే జిల్లాలో ఉత్తీర్ణత శాతం తగ్గినట్లు అధికారులు వెల్లడించారు.

34 మందికి 10/10 జీపీఏ

జిల్లా వ్యాప్తంగా 34 మంది విద్యార్థులు 10/10 జీపీఏ సాధించారు. గద్వాల పట్టణంలోని ప్రభుత్వ అభ్యసన ఉన్నత పాఠశాలకు చెందిన విద్యార్థి మదన్‌, కేటీదొడ్డిలోని మహాత్మా జ్యోతిబాపూలే బాలికల గురుకుల విద్యార్థులు నలుగురు, పుల్లూరు బాలికల గురుకులాల్లో ముగ్గురు, బిజ్వారం బాలికక గురుకులాల్లో ఒకరు 10/10 జీపీఏ సాధించారు. పట్టణంలోని విశ్వభారతి హైస్కూలుకు చెందిన విద్యార్థులు అత్యధికంగా ఎనిమది మంది 10/10 జీపీఏ సాధించగా, దయానంద విద్యామందిర్‌, నోబుల్‌ హైస్కూల్‌, శ్రీచైతన్య హైస్కూలు విద్యార్థులు ఇద్దరు చొప్పున 10/10 జీపీఏ దక్కించుకున్నారు. మిగతా 10/10 జీపీఏ సాధించిన వారిలో పట్టణంలోని ఆగస్త్య పబ్లిక్‌ స్కూల్‌, ఇండో ఇంగ్లీష్‌ హైస్కూల్‌, కాకతీయ హైస్కూల్‌, ప్రగతి విద్యానికేతన్‌, శ్రీ సరస్వతి, సత్యసాయి, విశ్వేశ్వరయ్య మెమోరియల్‌ హైస్కూల్‌తో పాటు అయిజలోని బ్రైట్‌స్టార్‌ హైస్కూల్‌, లయోలా ఉన్నత పాఠశాల, అలంపూర్‌లోని గురుదేవ్‌ హైస్కూల్‌, శాంతి నగర్‌లో శ్రీరాఘవేంద్ర ఉన్నత పాఠశాలల్లో ఒక్కొక్కరు 10/10 జీపీఏ సాధించారు.

మండలాల వారీగా ఫలితాలు

పదవ తరగతి పబ్లిక్‌ పరీక్షల్లో 90.89 శాతంలో ఉండవల్లి మండలం అగ్రస్థానంలో నిలిచింది. 68.80 శాతంతో కేటీదొడ్డి మండలం చివరి స్థానంలో నిలిచింది. ఉండవల్లి మండలంలో 417 మందికిగాను 379 మంది విద్యార్థులు ఉత్తీర్ణులు కాగా, 38 మంది ఫెయిల్‌ అయ్యారు. కేటీదొడ్డిలో 391 మందికి, 269 మంది ఉత్తీర్ణులు కాగా, 122 మంది పాస్‌ కాలేదు. మల్దకల్‌లో 466 మందికి గాను, 329 మంది (70.60 శాతం) ఉత్తీర్ణులు కాగా, 137 మంది ఫెయిల్‌ అయ్యారు. ధరూరులో 562 మందికి, 404 మంది (71.89శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 158 మంది ఫెయిల్‌ అయ్యారు. గద్వాలలో 1,797 మందికి గాను 1,454 మంది (80.91శాతం) మంది ఉత్తీర్ణులయ్యారు. 343 మంది ఫెయిల్‌ అయ్యారు. అలంపూల్‌లో 462 మందికి గాను 402 మంది (87.01శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 60 మంది ఫెయిల్‌ అయ్యారు. గట్టులో 502 మందికి గాను 422 మంది (84.06శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 80 మంది ఫెయిల్‌ అయ్యారు. అయిజలో 1,049 మందికి గాను 882 మంది (84.08శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 167 మంది ఫెయిల్‌ అయ్యారు. ఇటిక్యాలలో 541 మందికి గాను 486 మంది (89.83శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 55 మంది ఫెయిల్‌ అయ్యారు. మల్దకల్‌లో 466 మందికి గాను 329 మంది (70.60 శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 137 మంది ఫెయిల్‌ అయ్యారు. మానవపాడులో 213 మందికి గాను 180 మంది (84.51శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 33 మంది పాస్‌ కాలేదు. రాజోలిలో 200 మందికి గాను 148 మంది (74శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 42 మంది పరీక్ష తప్పారు. వడ్డేపల్లిలో 575 మందికి గాను 484 మంది (84.17శాతం) మంది ఉత్తీర్ణులు కాగా, 91 మంది ఫెయిల్‌ అయ్యారు.

Updated Date - Apr 30 , 2024 | 11:34 PM