Share News

ఆర్యవైశ్యులను ఆదుకునేందుకే కార్పొరేషన్‌

ABN , Publish Date - May 01 , 2024 | 10:58 PM

పేద ఆర్యవైశ్యులను ఆదుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే వాటికి శ్రీహరి అన్నారు.

ఆర్యవైశ్యులను ఆదుకునేందుకే కార్పొరేషన్‌
ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాతను సన్మానిస్తున్న ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

- ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి

మక్తల్‌, మే 1 : పేద ఆర్యవైశ్యులను ఆదుకునేందుకే తెలంగాణ ప్రభుత్వం ఆర్యవైశ్య కార్పొరేషన్‌ను ఏర్పాటు చేసిందని ఎమ్మెల్యే వాటికి శ్రీహరి అన్నారు. బుధవారం మక్తల్‌ పట్టణంలోని ఏఆర్‌ఎం ఫంక్షన్‌హాల్‌లో నిర్వహించిన సన్మాన కార్యక్రమానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరు కాగా, తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ పేద ఆర్యవైశ్యులను కార్పొరేష్‌ ద్వారా ఆదుకునేందుకు కాంగ్రెస్‌ ప్రభుత్వం కృషి చేస్తుందన్నారు. తన రాజకీయ జీవితం ప్రారంభం నుంచి ఆర్యవైశ్యులతో అవినాభావ సంబంధం ఉందన్నారు. ప్రతీ ఆర్యవైశ్యుడికి తమ ప్రభుత్వం అండగా ఉంటుందన్నారు. పార్లమెంటు ఎన్నికల్లో ఆర్యవైశ్యులు కాంగ్రెస్‌కు అండగా నిలవాలన్నారు. తెలంగాణ ఆర్యవైశ్య కార్పొరేషన్‌ చైర్మన్‌ కల్వ సుజాత మాట్లాడుతూ పదేళ్ల నుంచి కార్పొరేషన్‌ ఏర్పాటు చేయకుండా అప్పటి బీఆర్‌ఎస్‌ ప్రభుత్వం ఆర్యవైశ్యులను మోసం చేసిందన్నారు. కార్పొరేషన్‌ ఏర్పాటు చేయాలని పలుమార్లు ఆందోళనలు చేసినా పట్టించుకోలేదన్నారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడిన వెంటనే సీఎం రేవంత్‌రెడ్డి వైశ్య కార్పొరేషన్‌ ఏర్పాటు చేసి తనను చైర్మన్‌గా ఎంపిక చేశారన్నారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే వాకిటి శ్రీహరి, ఆర్యవైశ్యులు కల్వ సుజాతను సన్మానించి, అభినందించారు. కార్యక్రమంలో ఆర్యవైశ్య సంఘం జిల్లా ప్రధాన కార్యదర్శి కట్ట సురేష్‌కుమార్‌, పట్టణ అధ్యక్షుడు బి.భాస్కర్‌, పొర్ల వెంకటేష్‌, నాగరాజు, సుజిత్‌, రతన్‌కుమార్‌ గుప్తా, హరికృష్ణ, శ్రీనివాస్‌, కృష్ణమూర్తి, మహిళలు కొత్త మీరాభాయ్‌, పద్మ, సుజాత, శిరీష, ప్రసన్న, త్రివేణి, వివిధ మండలాల నుంచి వచ్చిన ఆర్యవైశ్య సంఘం సభ్యులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 10:58 PM