Share News

‘పది’లో జిల్లాకు ఏడో ర్యాంకు

ABN , Publish Date - May 01 , 2024 | 12:40 AM

పది’ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 96.65 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకులో నిలిచింది. గత ఏడాది జిల్లా నాలుగో ర్యాంకులో నిలువగా ఈసారి ఏడో ర్యాంకుకు పడిపోయింది. గత ఏడాది 95 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా ఈసారి 96.65 శాతానికి పెరిగింది.

‘పది’లో జిల్లాకు ఏడో ర్యాంకు

కరీంనగర్‌ టౌన్‌, ఏప్రిల్‌ 30: ‘పది’ ఫలితాల్లో జిల్లా విద్యార్థులు 96.65 శాతం ఉత్తీర్ణత సాధించి రాష్ట్రస్థాయిలో ఏడో ర్యాంకులో నిలిచింది. గత ఏడాది జిల్లా నాలుగో ర్యాంకులో నిలువగా ఈసారి ఏడో ర్యాంకుకు పడిపోయింది. గత ఏడాది 95 శాతం మంది విద్యార్థులు మాత్రమే పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించగా ఈసారి 96.65 శాతానికి పెరిగింది. గత ఏడాదితో పోలిస్తే 1.65 శాతం పెరిగింది. ఇది కొంత ఊరట కలిగిస్తున్నా గత ఏడాది రాష్ట్రస్థాయిలో నాలుగో ర్యాంకులో నిలిచిన జిల్లా ఈసారి ఏడో ర్యాంకుకు పడిపోవడం అసంతృప్తిని మిగిలిచింది. జిల్లాలో మొత్తం 12,555 మంది విద్యార్థులు పరీక్షలు రాయగా వారిలో 12,134 మంది ఉత్తీర్ణులు కాగా 421 మంది విద్యార్థులు పెయిల్‌ అయ్యారు. ఉత్తీర్ణత సాధించిన రెగ్యులర్‌ విద్యార్థుల్లో 6,677 బాలురు పరీక్షలకు హాజరుకాగా 6,400 మంది ఉత్తీర్ణులయ్యారు. 5,878 మంది బాలికలు పరీక్షలు రాయగా వారిలో 5,734 మంది ఉత్తీర్ణులయ్యారు. జిల్లాలో 96.65శాతం మంది బాలికలు ఉత్తీర్ణులు కాగా, 95.85శాతం బాలురు పాస్‌ అయ్యారు. ప్రైవేట్‌ విద్యార్థులు 95 మంది పరీక్షకు హాజరు కాగా 72 మంది ఉత్తీర్ణులు కావడంతో 75.78 పాస్‌ శాతం నమోదైంది.

172 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణత

జిల్లాలో 192 ప్రభుత్వ, 150 ప్రైవేట్‌, మొత్తం 342 పాఠశాలలు ఉన్నాయి. 192 ప్రభుత్వ పాఠశాలల్లో 84 పాఠశాలల్లో వంద శాతం, 150 పాఠశాలల్లో 88 పాఠశాలల్లో వంద శాతం ఉత్తీర్ణులయ్యారు. ఎప్పటిలాగే ఈఫలితాల్లో బాలురకంటే బాలికల ఉత్తీర్ణత శాతం ఎక్కువగా ఉంది.

- పదో తరగతి ఫలితాల్లో జిల్లాలోని ప్రభుత్వ, ప్రైవేట్‌ పాఠశాలతోపాటు మోడల్‌, కేజీబీవీ, సోషల్‌ వెల్ఫేర్‌ పాఠశాలల విద్యార్థులు అత్యుత్తమ ప్రతిభతో ప్రభంజనం సృష్టించారు.

జూన్‌ 3 నుంచి సప్లిమెంటరీ పరీక్షలు

పదో తరగతి సప్లిమెంటరీ పరీక్షలు జూన్‌ 3 నుంచి 13వ తేదీ వరకు ఉంటాయని విద్యాశాఖ ముఖ్యకార్యదర్శి బుర్రా వెంకటేశం ప్రకటించారు. సప్లిమెంటరీ పరీక్షలు ప్రతిరోజు ఉదయం 9.30నుంచి మధ్యాహ్నం 12.30 గంటల వరకు నిర్వహిస్తారు. రీకౌంటింగ్‌కు 15 రోజుల వరకు అవకాశం కల్పించారు. సబ్జెక్టుకు 500 రూపాయల చొప్పున ఫీజు చెల్లించాల్సి ఉంటుంది. ఆన్సర్‌షీట్‌ ఫొటో కాపీ కోసం సబ్జెక్టుకు వెయ్యి రూపాయలు చెల్లించాలి. సప్లమెంటరీ పరీక్షలకు అపరాధ రుసుము లేకుండా మే 17 వరకు ఫీజు చెల్లించవచ్చు. 50 రూపాయల అపరాధ రుసుముతో పరీక్షకు రెండురోజుల ముందుకు వరకు ఫీజు చెల్లించే అవకాశముంది. ఫీజులు చలానా రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. రీకౌంటింగ్‌, రీ వెరిఫికేషన్‌ ఫీజులను చలానా రూపంలో చెల్లించి దరఖాస్తు ఫారాలను డీఈవో కార్యాలయంలో సమర్పించాలి.

Updated Date - May 01 , 2024 | 12:40 AM