Share News

చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి

ABN , Publish Date - May 01 , 2024 | 12:35 AM

కరీంనగర్‌ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండని ప్రజలను బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బి వినోద్‌కుమార్‌ కోరారు. మంగళవారం ఆయన కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు.

చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండి

కరీంనగర్‌ రూరల్‌, ఏప్రిల్‌ 30: కరీంనగర్‌ నియోజకవర్గంలో చేసిన అభివృద్ధిని చూసి ఓటేయండని ప్రజలను బీఆర్‌ఎస్‌ కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి బి వినోద్‌కుమార్‌ కోరారు. మంగళవారం ఆయన కరీంనగర్‌ రూరల్‌ మండలం చామనపల్లి గ్రామంలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ 2014 నుంచి 2019 వరకు కరీంనగర్‌కు వెయ్యికోట్లతో స్మార్ట్‌ సిటీ తెచ్చి అభివృద్ధి చేశానన్నారు. రైతుకు పెట్టుబడి ఇచ్చే ప్రభుత్వం దేశంలో ఎక్కడాలేదని, కేసీఆర్‌ సర్కార్‌ మాత్రమే ఇచ్చిందని అన్నారు. రైతులకు నార్లు పోసేటప్పుడు ఇవ్వాల్సిన డబ్బులు వరి కోతల సమయంలో కాంగ్రెస్‌ ప్రభుత్వం ఇస్తుందని మండిపడ్డారు. రైతు బీమా కూడా ఇవ్వడం లేదన్నారు. నాలుగు నెలల కాంగ్రెస్‌ పాలనలో ప్రాజెక్టులు, చెరువులు ఎండాయని, కాంగ్రెస్‌ అసమర్థతతోనే రాష్ట్రంలో కరువు వచ్చిదని అన్నారు. ఐదుగురు ఎంపీలు గెలిచి 2004లో పార్లమెంట్‌ లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు కోసం కొట్లాడామని గుర్తు చేశారు. ఆంధ్రాలో చంద్రబాబు, తెలంగాణలో రేవంత్‌రెడ్డి కలిసి మళ్లీ తెలంగాణను ఆంధ్రలో కలిపే కుట్ర చేస్తారని అన్నారు. మరో రెండేళ్లలో ఉమ్మడి రాజధానిగా ఉన్న హైదరాబాద్‌ను కేంద్ర పాలిత ప్రాంతంగా చేసే కుట్రలు చేస్తున్నారని, అది జరగనివ్వబోమన్నారు. నదుల అనుసంధానం పేరుతో కేంద్రం కుట్ర రాజకీయాల చేస్తున్నారని, బండి సంజయ్‌ ఎప్పుడైన తెలంగాణ కోసం పార్లమెంట్‌లో మాట్లాడలేదన్నారు. బండి సంజయ్‌ ఒక్క గుడి, బడి తేలేదన్నారు. కరీంనగర్‌ పార్లమెంట్‌ నియోజకవవర్గం పరిధిలో జాతీయ రహదారులు తెచ్చానని అన్నారు. నలుగురు బీజేపి ఎంపీలు, ముగ్గురు కాంగ్రెస్‌ ఎంపీలు గెలిచి ఒక్కసారి కూడా నవోదయ పాఠశాల కోసం మాట్లాడలేదన్నారు. బండి సంజయ్‌ ఒక్కసారి కూడా ప్రదాని నరేంద్ర మోదీ, కేంద్ర మంత్రుల వద్దకు వెళ్లి సమస్యలు చెప్పలేదని విమర్శించారు. కరీంనగర్‌లో 50 కోట్లతో తిరుమల తిరుపతి దేవస్థానం కడుతున్నామన్నారు.

గులాబీ జెండాతోనే తెలంగాణ అభివృద్ధి

- మాజీ మంత్రి, ఎమ్మెల్యే గంగుల కమలాకర్‌

గులాబీ జెండా ఎంపీలు గెలిస్తేనే తెలంగాణ అభివృద్ది సాధ్యమవుతుందని మాజీ మంత్రి, కరీంనగర్‌ ఎమ్మెల్యేగంగుల కమలాకర్‌ అన్నారు. పదేళ్ల బీఆర్‌ఎస్‌ పాలనలో రాష్ట్రం పచ్చగా ఉండేదని, కాంగ్రెస్‌ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తరువాత కరెంటు, సాగు, తాగు నీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారన్నారు.

వ్యవసాయం కుంటుపడిందని ఆవేదన వ్యక్తం చేశారు. 2023 సార్వత్రిక ఎన్నికల్లో తనను ఎమ్మెల్యేగా గెలిపించారని, ఎంపీగా వినోద్‌కుమార్‌ని గెలిపస్తే అభివృద్ధి కొనసాగుతుందని అన్నారు. మూడునెలల కాంగ్రెస్‌ పాలనలో కష్టాలు మొదలయ్యాయని, కేసీఆర్‌ లేని లోటు స్పష్టంగా కనబడుతుందన్నారు. పార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ బీజేపీలకు ఓటు వేసే పరిస్థితి లేదన్నారు. ఇప్పటికే తను ఎమ్మెల్యేగా ఉన్నానని, ఎంపీగా వినోద్‌ కుమార్‌ గెలిస్తే కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల మెడలు వంచి నిధులు తీసుకువచ్చి అభివృద్ది చేస్తామన్నారు. కార్యక్రమంలో కరీంనగర్‌ రూరల్‌ మండల శాఖ అధ్యక్షుడు పెండ్యాల శ్యాంసుందర్‌రెడ్డి, ఎంపీపీ తిప్పర్తి లక్ష్మయ్య, వైస్‌ ఎంపీపీ వేల్పుల నారాయణ, సర్పంచ్‌ బోగోండ లక్ష్మి ఐలయ్య, రైతు సహకార సంఘం అధ్యక్షుడు తిరుపతి, మాజీ సర్పంచ్‌లు రుద్ర రాము, శ్రీధర్‌, మారుతి, ఎంపీటీసీలు మారుతి, నాయకులు సుంకిశాల సంపత్‌రావు, జువ్వాడి రాజేశ్వర్‌ రావు, సర్వర్‌, నెక్‌ పాషా, జక్కం నర్సయ్య, మల్లారెడ్డి పాల్గొన్నారు.

పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుకనవుతా..

జమ్మికుంట రూరల్‌: ప్రజలు ఆదరించి భారీ మెజార్టీతో గెలిపిస్తే పార్లమెంట్‌లో తెలంగాణ ప్రజల గొంతుకను అవుతానని బీఆరెస్‌ ఎంపీ అభ్యర్థి బోయినపల్లి వినోద్‌కుమార్‌ అన్నారు. మంగళవారం మండలంలోని వావిలాల లో ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి, గెల్లు శ్రీనివాస్‌తో కలిసి ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ రాష్ట్రాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి చేసిన ఘనత మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్‌కు దక్కుతుందన్నారు. గత ఎన్నికల్లో హుజూరాబాద్‌ నుంచి అత్యధిక ఓట్లు వేశారని, ఈ సారి అంతకన్న ఎక్కువ ఓట్లు వేసి గెలిపించాలని కోరారు. ఎమ్మెల్యే పాడి కౌశిక్‌రెడ్డి మాట్లాడుతూ కాంగ్రెస్‌ ప్రభుత్వం వంద రోజుల్లో ఇచ్చిన హామీలు అన్ని నెరవేరుస్తామని ప్రజలను మభ్య పెట్టారని, ఇప్పటి వరకు ఎందుకు నెరవేర్చలేదో ప్రజలకు చెప్పాలన్నారు. బండి సంజయ్‌ను ఎంపీగా గెలిపిస్తే ఏమైన అభివృద్ధి చేశారా ప్రజలు ఆలోచించాలన్నారు. భారీ మెజార్టీతో వినోద్‌కుమార్‌ను గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో కెడిసిసి వైస్‌ చైర్మన్‌ పింగిలి రమేష్‌, ఎంపిటిసి మర్రి మల్లేషం, తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 12:35 AM