Share News

రాజన్న సాక్షిగా ఆగస్టు 15లోగా రూ. రెండు లక్షల రుణమాఫీ..

ABN , Publish Date - May 01 , 2024 | 01:00 AM

వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు.

రాజన్న సాక్షిగా  ఆగస్టు 15లోగా రూ. రెండు లక్షల రుణమాఫీ..

కరీంనగర్‌, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి ప్రతినిధి): వేములవాడ రాజన్న సాక్షిగా చెబుతున్నా.. ఆగస్టు 15లోగా రైతులకు రూ. 2లక్షల రుణమాఫీ చేసి తీరుతామని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి ప్రకటించారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ చీకటి ఒప్పందం కుదుర్చుకుని కాంగ్రెస్‌ను ఓడించేందుకు కుట్రలు పన్నుతున్నాయని విమర్శించారు. బీజేపీని గెలిపిస్తే ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు రద్దవుతాయని, ఈ ఎన్నికల్లో ప్రజలు ఓడుతారో... బీజేపీని ఓడిస్తారో ఆలోచించుకోవాలన్నారు. మంగళవారం జమ్మికుంటలో డీసీసీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే కవ్వంపల్లి సత్యనారాయణ అధ్యక్షతన నిర్వహించిన జనజాతర సభకు వివిధ ప్రాంతాల నుంచి పెద్ద ఎత్తున జనం తరలివచ్చారు. మధ్యాహ్నం రెండు గంటలకు రావాల్సిన రేవంత్‌రెడ్డి సాయంత్రం నాలుగు గంటలకు సభ ప్రాంగణానికి చేరుకున్నారు. ఆయన 26 నిమిషాల పాటు ప్రసంగించి బీజేపీ, బీఆర్‌ఎస్‌ పార్టీలు అనుసరిస్తున్న వైఖరిపై ధ్వజమెత్తారు. కరీంనగర్‌ జిల్లా చైతన్యవంతమైన జిల్లా అని, ఇక్కడి ప్రజలు కేసీఆర్‌ను గల్లీ నుంచి ఢిల్లీ వరకు పంపించారని గుర్తు చేశారు. మొన్న డిసెంబరులో జరిగిన ఎన్నికల్లో అదే కేసీఆర్‌ను చిత్తుచిత్తుగా ఓడించి ఇందిరమ్మ రాజ్యాన్ని తీసుకువచ్చారన్నారు. ఆ ఎన్నికలు సెమీఫైనల్‌ మాత్రమేనని, ఇప్పుడు జరిగే ఎన్నికలు ఫైనల్స్‌ అన్నారు. ఈ ఎన్నికల్లో తెలంగాణ పౌరుషాన్ని గుజరాత్‌కు చేరే విధంగా చాటాలని, బీజేపీ వాళ్లు సూరత్‌కు పారిపోయే విధంగా తీర్పు ఇవ్వాల్సిన అవసరం ఉందన్నారు.

ఫ మోదీ, బండి సంజయ్‌ చేసిందేమీ లేదు..

పదేళ్ల మోదీ పాలనలో తెలంగాణ కోసం రాష్ట్రానికి ఇచ్చింది ఏం లేదని, ఇక్కడి ఎంపీ బండి సంజయ్‌ తెచ్చింది ఏం లేదన్నారు. పదేళ్లలో మోదీ, ఐదేళ్లలో బండి సంజయ్‌ చేసింది ఏమీ లేదని విమర్శించారు. ఆనాడు పేదోళ్ల బిడ్డ అని, గుండో, అరగుండో అని బండికి ఓటేశారని, నిజామాబాద్‌ గుండు, కరీంనగర్‌ అరగుండు గాని తెలంగాణకు తెచ్చింది ఏమి లేదని విమర్శించారు. మోదీ జాతీయ ప్రాజెక్టు ఇవ్వలేదని, ఐటీఐఆర్‌, కారిడార్‌ ఇవ్వలేదని, ఈ రాష్ట్రానికి ఇచ్చింది మాత్రం గాడిద గుడ్డు అని విమర్శించారు. కర్ణాటకుకు చెంబు, ఆంధ్రప్రదేశ్‌కు మట్టి, చెంబడు నీళ్లు ఇచ్చి తెలంగాణకు గాడిద గుడ్డు ఇచ్చారని ఎద్దేవా చేశారు. ఈ గుండు, అరగుండుకు ఎందుకు ఓటు వేయాలని ప్రశ్నించారు. తాను గతంలోనే చెప్పానని బీజేపీ, బీఆర్‌ఎస్‌కు మద్య చీకటి ఒప్పందం ఉందన్నారు. మహబూబ్‌నగర్‌, చెవేళ్ల, మల్కాజిగిరి, భువనగిరి, జహీరాబాద్‌, కరీంనగర్‌, నిజామాబాద్‌ సీట్లను బీజేపీకి ఓట్లు వేసి గెలిపించాలని అంతర్గతంగా ఒప్పందం చేసుకున్నారని, ఖమ్మం, నల్గొండ, మెదక్‌ స్థానాల్లో బీఆర్‌ఎస్‌ను గెలిపించాలని కేసీఆర్‌ మాటలను బట్టి తెలుస్తుందన్నారు. బీజేపీ, బీఆర్‌ఎస్‌ వ్యూహాత్మాకంగా ఒకరి మీద ఒకరూ పోటీ చేసినట్లే చేసి కాంగ్రెస్‌పై కుట్రలు పన్నుతున్నారని, దీనిని తిప్పి కొట్టాలని ఆయన పిలుపునిచ్చారు. ఈ ఎన్నికల్లో కరీంనగర్‌ ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావును లక్ష మెజార్టీతో గెలిపించాలని ఆయన కోరారు. సభలో రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌, ఎంపీ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు, ప్రభుత్వ విప్‌ ఆది శ్రీనివాస్‌, ఎమ్మెల్యేలు డాక్టర్‌ కవ్వంపల్లి సత్యనారాయణ, మేడిపల్లి సత్యం, నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌, సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి, సీపీఎం జిల్లా కార్యదర్శి వాసుదేవరెడ్డి, మర్రి వెంకటస్వామి తదితరులు పాల్గొన్నారు.

జమ్మికుంట/జమ్మికుంట రూరల్‌: సభలో రాష్ట్ర రవాణా, బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్‌ మాట్లాడుతూ కాంగ్రెస్‌ పార్టీ మాట ఇచ్చిన ప్రకారం ఆరు గ్యారంటీల్లో ఐదు గ్యారంటీలు అమలు చేసిందని, ఈ ఎన్నికల్లో తమ అభ్యర్థిని గెలిపించాలని కోరారు. సీపీఐ జాతీయ కార్యవర్గ సభ్యుడు చాడ వెంకట్‌రెడ్డి మాట్లాడుతూపార్లమెంట్‌ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీని గెలిపించాలని కోరారు. కాంగ్రెస్‌ అభ్యర్థి వెలిచాల రాజేందర్‌రావు మాట్లాడుతూ కేంద్రంలో కాంగ్రెస్‌ అధికారంలోని వస్తుందని, తనను భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. నియోజకవర్గ ఇన్‌చార్జి వొడితెల ప్రణవ్‌ మాట్లాడుతూ ఇల్లందకుంట సీతారామచంద్రస్వామి ఆలయ అభివృద్ధికి నిధులు ఇవ్వాలని ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డిని కోరారు. కార్యక్రమంలో ప్రభుత్వ విప్‌, వేములవాడ ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్‌, మాజీ ఎమ్మెల్యే ఆరెపల్లి మోహన్‌, రాజన్న సిరిసిల్ల జిల్లా ఇన్‌చార్జి కేకేమహేందర్‌రెడ్డి, దాసరి భూమయ్య, మిల్కూరి వాసుదేవరెడ్డి, మర్రి వెంకటస్వామి, తుమ్మేటి సమ్మిరెడ్డి, పత్తి కృష్ణారెడ్డి, దేశిని కోటి, సాయిని రవి, పూదరి రేణుక శివకుమార్‌, పొనగంటి మల్లయ్య, మొలుగూరి సదయ్య, దొంత రమేష్‌ పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 01:00 AM