Share News

Kumaram Bheem Asifabad: సరైన వైద్యం.. అందని ద్రాక్షే

ABN , Publish Date - Apr 29 , 2024 | 10:57 PM

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 29: నియోజకవర్గంలో ప్రజలకు సరైన వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. కాగజ్‌నగర్‌ పట్టణంలో కొంతమంది ప్రయివేటు వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి.

Kumaram Bheem Asifabad: సరైన వైద్యం.. అందని ద్రాక్షే

- నిర్లక్ష్యం కారణంగా నిండు ప్రాణాలు బలి

- రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్న వైద్యులు

- వరుస ఘటనలతో ప్రజల్లో ఆందోళన

- అడపాదడపా ఉన్నతాధికారుల తనిఖీలు

కాగజ్‌నగర్‌, ఏప్రిల్‌ 29: నియోజకవర్గంలో ప్రజలకు సరైన వైద్యం అందని ద్రాక్షే అవుతోంది. కాగజ్‌నగర్‌ పట్టణంలో కొంతమంది ప్రయివేటు వైద్యుల నిర్లక్ష్యంగా కారణంగా రోగుల ప్రాణాలు హరీమంటున్నాయి. అనుభవ మున్న వైద్యులు లేకనో మరే కారణమో తెలియదు కానీ అత్యవసర పరిస్థితుల్లో ప్రైవేటు ఆసుపత్రుల్లో చేరితే డాక్టర్లు తెలిసిన వైద్యంచేసి చేతులు దులుపుకుంటున్నారు. పరిస్థితి విషమిస్తే తమతో కాదని పెద్దాసుపత్రికి వెళ్లాలని పేర్కొంటున్నారు. రెండ్రోజుల క్రితం ఓ ప్రైవేటు ఆసుపత్రిలో జరిగిన సంఘటననే దీనికి నిదర్శనం. కాగజ్‌నగర్‌ నవ్‌గాం బస్తీకి చెందిన బాలింత(27)కు ఆదివారం ఉదయం పురిటి నొప్పులు రావటంతో పెట్రోలు పంపు ఏరియాలోని ప్రయివేటు ఆసుపత్రిలో చేర్పించారు. అక్కడి వైద్యులు పరీక్షలు నిర్వహించి గర్భంలో శిశువు చనిపోయినట్టు నిర్ధారించారు. సాయంత్రం ఆపరేషన్‌ చేసి మృతశిశువును బయటికి తీశారు. అయితే శ్వేత పరిస్థితి విషమించటంతో ఆసుపత్రిలోని వైద్యులు చేతులెత్తేశారు. మెరుగైనవైద్యం కోసం మంచిర్యాలకు తరలించాలని కుటుంబీకులకు సూచించారు. అనంతరం ఆసుపత్రికి తాళం వేశారు. మంచిర్యాలకు తరలించగా.. బాలింత అప్పటికే మృతిచెందినట్టు వైద్యులు తెలిపారు. ఇదే విధంగా ఎనిమిది నెలల క్రితం కూడా మరో ఆసుపత్రిలో ఒక బాలుడికి వ్యాధితో సంబంధం లేకుండా వైద్యుడు చికిత్స చేశాడు. పరిస్థితి విషమించటంతో సంబంఽధిత డాక్టర్‌ బాలుడిని మంచిర్యాలకు తరలించారు. మంచిర్యాల వెళ్లిన తర్వాత అక్కడి డాక్టర్లు పరీక్షించి బాలుడు మృతిచెందినట్టు నిర్ధారించారు. రెండేళ్ల క్రితం కూడా ఆపరేషన్‌ చేసిన బాలింత కుట్ల నుంచి ఆగకుండా రక్తం వస్తుండటంతో కూడా అత్యవసరంగా మంచిర్యాలకు తరలించారు. ఈసంఘటనలో కూడా బాలింత మృతి చెందింది. ఇటువంటి వైద్యుల నిర్వాకంతో పట్టణ ప్రజలు ఆందోళన చెందుతున్నారు.

అనుభవజ్ఞులైన సిబ్బంది ఉండాలి..

వాస్తవంగా ప్రయివేటు క్లినిక్‌ నడపాలంటే ఖచ్చితంగా అర్హత, అనుభవం గల జీఎన్‌ఎం, ఏఎన్‌ఎం, ట్యాబ్‌టెక్నీషియన్‌, ఆపరేషన్‌ టెక్నీషియన్‌ స్టాఫ్‌ సిబ్బంది ఉండాలి. వీరి వివరాలు కూడా జిల్లా కేంద్రంలోని అధికారులకు ఆసు పత్రి యాజమాన్యం అందజేయాల్సి ఉంటుంది. అయితే పట్టణంలోని ప్రయివేటు ఆసుపత్రుల్లో పూర్తి వసతులు లేకున్నా కూడా అడ్డగోలుగా ఫీజులు వసూలు చేసి లక్షల్లో సంపాదిస్తున్నారని పలువురు బాహాటంగా ఆరోపిస్తున్నారు. ఇప్పటికైనా జిల్లా అధికారులు స్పందించి ప్రయివేటు ఆసుపత్రులపై ప్రత్యేకనిఘా పెట్టి వసతులు, రోగులకు చేస్తున్న పరీక్షలు, ఫీజుల వివరాలను పరిశీలించాలని డిమాండ్‌ చేస్తున్నారు.

నిబంధనల ప్రకారం నిర్వహించాలి..

-సీతారం, జిల్లా వైద్యాధికారి

ప్రయివేటు ఆసుపత్రులను నిబంధనల ప్రకారం నిర్వహించాల్సి ఉంటుంది. ఫిర్యాదులు వచ్చిన వాటిపై క్షేత్ర స్థాయిలో విచారణ జరుపుతున్నాం. రెండ్రోజుల క్రితం జరిగిన సంఘటన విషయంలో కూడా అన్ని కోణాల్లో విచారణ జరుపుతున్నాం. ఎవరినీ ఉపేక్షించేది లేదు.

Updated Date - Apr 29 , 2024 | 10:57 PM