Share News

తొలి అంకం నేడే

ABN , Publish Date - Apr 19 , 2024 | 05:08 AM

సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి అంకానికి తెరలేవనుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌కు గాను శుక్రవారం మొదటి విడత జరుగనుంది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు

తొలి అంకం నేడే

21 రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ సీట్లలో పోలింగ్‌

తొలి దశ స్వరూపం ఇలా

బరిలో ఉన్న అభ్యర్థులు: 1,625 (1,491 మంది పురుషులు, 134 మంది మహిళలు)

ఓటు వేయనున్న ప్రజలు: 16.63 కోట్లు (పురుషులు 8.4 కోట్లు, మహిళలు 8.23 కోట్లు)

తొలిసారి ఓటు వేయనున్నవారు: 35.67 లక్షలు

20-29 ఏళ్ల మధ్య వయసువారు: 3.51 కోట్లు

విధులు నిర్వర్తించనున్న సిబ్బంది: 18 లక్షలు

మొత్తం మహిళా సిబ్బంది ఉన్న కేంద్రాలు: 5,000

న్యూఢిల్లీ, ఏప్రిల్‌ 18(ఆంధ్రజ్యోతి): సార్వత్రిక ఎన్నికల సమరంలో తొలి అంకానికి తెరలేవనుంది. మొత్తం ఏడు దశల పోలింగ్‌కు గాను శుక్రవారం మొదటి విడత జరుగనుంది. 21 రాష్ట్రాలు/కేంద్ర పాలిత ప్రాంతాల్లోని 102 ఎంపీ స్థానాలకు ఉదయం ఏడు గంటల నుంచి సాయంత్రం 6 వరకు ఓటింగ్‌ నిర్వహించనున్నారు. సిక్కిం, అరుణాచల్‌ప్రదేశ్‌ శాసనసభలకు కూడా ఈ దశలోనే పోలింగ్‌ జరుగనుంది. రెండు రాష్ట్రాల్లో 92 సీట్లున్నాయి. 543 లోక్‌సభ స్థానాలకు ఏడు దశల్లో ఎన్నికలు చేపడుతుండగా.. అత్యధికంగా తొలి దశలోనే సీట్లున్నాయిు. వీటిలో 73 జనరల్‌, 18 ఎస్సీ, 11 ఎస్టీ రిజర్వుడు స్థానాలు. పోలింగ్‌ సజావుగా సాగేందుకు కేంద్ర ఎన్నికల సంఘం (సీఈసీ) అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. అందరికీ ఓటరు స్లిప్పులను అధికారులు ఇప్పటికే పంపిణీ చేశారు. ఓటరు ఐడీ లేకపోతే 12 ఇతర గుర్తింపు కార్డులలో దేనినైనా చూపించి ఓటు హక్కును వినియోగించుకోవచ్చని ఈసీ తెలిపింది. 85 ఏళ్లకు పైబడిన 14.14 లక్షల మంది వృద్ధులు, 13.89 లక్షలమంది దివ్యాంగులు ఇంటి దగ్గరే ఓటు వేయనున్నారు. పోలింగ్‌ స్టేషన్‌కు వచ్చే వృద్ధులు, దివ్యాంగులకూ తగిన ఏర్పాట్లు చేసినట్లు ఈసీ పేర్కొంది. కాగా, 1.87 లక్షల పోలింగ్‌ స్టేషన్లను ఈసీ ఏర్పాటు చేసింది. ఐదు వేల స్టేషన్లలో భద్రతా సిబ్బంది సహా మొత్తం మహిళలే విధులు నిర్వర్తించనున్నారు. వెయ్యి కంటే ఎక్కువ స్టేషన్లల్లో దివ్యాంగులు ఈ బాధ్యతలు చూడనున్నారు. అన్ని పోలింగ్‌ స్టేషన్లలో సూక్ష్మ పరిశీలకులను నియమించారు. 50శాతానికి పైగా స్టేషన్లలో వెబ్‌ కాస్టింగ్‌ చేయనున్నారు. పోలింగ్‌, భద్రతా సిబ్బంది తరలింపునకు 41 హెలికాప్టర్లు, 84 ప్రత్యేక రైళ్లు, దాదాపు లక్ష వాహనాలను ఎన్నికల సంఘం ఏర్పాటు చేసింది. పరిశీలకులుగా 361 మందిని పంపించింది. వీరిలో 127 మంది సాధారణ, 67 మంది పోలీసు, 167 మంది వ్యయ పరిశీలకులు ఉన్నారు. ప్రత్యేక పరిశీలకులను సైతం నియమించింది. 4,627 ఫ్లయింగ్‌ స్క్వాడ్‌, 5,208 స్టాటిటిక్స్‌ సర్వేలైన్స్‌, 2,028 వీడియో సర్వేలైన్స్‌ బృందాలు, 1,255 వీడియో వ్యూయింగ్‌ టీంలను ఏర్పాటు చేసింది. మద్యం, మాదక ద్రవ్యాలు, నగదు, ఉచితాలను తరలించకుండా అడ్డుకునేందుకు 1,374 అంతర్రాష్ట్ర, 162 అంతర్జాతీయ చెక్‌పోస్టుల వద్ద గట్టి నిఘా ఉంచింది. వాయు, సముద్ర మార్గాల్లోనూ నిఘా ఏర్పాట్లు చేసింది.

Updated Date - Apr 19 , 2024 | 05:08 AM