Share News

తాగునీరివ్వకుంటే ఎన్నికల బహిష్కారం

ABN , Publish Date - May 02 , 2024 | 12:57 AM

మండలంలోని రమణక్కపేట ఎస్సీ కాలనీ వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పది రోజులుగా తాగు నీరులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ పాలకులు, అధికారులు సైతం పట్టించున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

తాగునీరివ్వకుంటే ఎన్నికల బహిష్కారం
రమణక్కపేట ఎస్సీకాలనీలో ఖాళీ బిందెలతో ఆందోళన

10 రోజులుగా అల్లాడుతున్నామని ఖాళీ బిందెలతో ఆందోళన

పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదని ఆగ్రహం

ముసునూరు, మే 1: మండలంలోని రమణక్కపేట ఎస్సీ కాలనీ వాసులు తాగునీటి కోసం అల్లాడుతున్నారు. పది రోజులుగా తాగు నీరులేక తీవ్ర ఇబ్బందులు పడుతున్నా పంచాయతీ పాలకులు, అధికారులు సైతం పట్టించున్న దాఖలాలు లేవని కాలనీ వాసులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. బుధవారం మహిళలు ఖాళీ బిందెలతో ఆందోళన చేశారు. గుక్కెడు నీటి కోసం అలమ టిస్తున్నా సర్పంచ్‌ కనీసం ఎస్సీ కాలనీ వైపు తొంగి చూడలేదని, కనీస మౌలిక సదుపాయాలను కూడా ఈ వైసీపీ ప్రభుత్వం కల్పించలేని దుస్థితిలో ఉందని వారు ప్రభుత్వం, పాలకుల పనితీరుపై అసహనం వ్యక్తం చేశారు. కనీసం ట్యాంకర్ల ద్వారా కూడా నీటి సరఫరా లేయడం లేదని, ఒక్క ట్యాంక్‌ నీటిని వందలాది రూపాయలతో కొనుగోలు చేసి నీటి అవసరాలు తీర్చుకుంటున్నామని మహిళలు ఆవేదన వ్యక్తం చేశారు. రెండు వార్డుల్లో సుమా రు 400 కుటుం బాలు ఉన్న ఈ ఎస్సీ కాలనీపై సర్పంచ్‌ వివక్ష చూపుతున్నాడని, ఎస్సీ లంటే అంత చులకనా అని వారు మండిపడ్డారు. ఇప్పటికైనా తాగునీటి సమస్యలను పరిష్కరించకపోతే నూజివీడు ఆర్డీవో కార్యాలయం వద్ద ఖాళీ బిందెలతో ఆందోళన చేస్తామని మహిళలు హెచ్చరించారు.

ఎన్నికలు బహిష్కరిస్తాం...

గత పది రోజులుగా కాలనీలో తాగునీరు రాక నానా ఇబ్బందులు పడుతున్నాం. వాడుకనీరు కోసం వ్యవసాయ బోర్లు వద్దకు కిలోమీటర్ల దూరం వెళ్ళి తెచ్చుకోవాల్సిన పరిస్థితి. ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్యను తక్షణమే పరిష్కరించకపోతే ఎన్నికలను బహిష్కరిస్తాం.

– ఆముదాల శిరీష, ఎస్సీ కాలనీ వాసి, రమణక్కపేట

ట్యాంకు నీరు రూ. 600

ప్రతి వేసవిలోను ఎస్సీ కాలనీలో ఇదే పరిస్థితి నెలకొన్నా పాలకులు, అధికారులు పట్టించుకోవడం లేదు. తాగునీరు కోసం ఇటీవల ఎన్నికల ప్రచారానికి వచ్చిన స్థానిక ఎమ్మెల్యేను అడ్డుకున్నాం. అయినా సమస్య తీరలేదు. రూ. 600లకు ప్రైవేట్‌ ట్యాంకర్ల ద్వారా నీటిని కొనుగోలు చేసుకుంటున్నాం.

– నందిపాము సత్యరాజు, వార్డు సభ్యుడు, రమణక్కపేట.

సమస్య పరిష్కరిస్తాం..

రమణక్కపేట ఎస్సీ కాలనీలో తాగునీటి సమస్య ఉంది. కాలనీకి నీటి సరఫరా చేసే బోరును కొన్ని అడుగులు లోతు తీయించి, మోటారును బిగించి చూస్తాం. అయినా నీటి సామర్ధ్యం పెరగకపోతే 3 రోజుల్లో కొత్త బోరు వేస్తాం. అప్పటి వరకు ట్యాంకర్లతో నీటిని అందిస్తాం.

–వై.ప్రసాద్‌, పంచాయతీ కార్యదర్శి, రమణక్కపేట

Updated Date - May 02 , 2024 | 12:57 AM