Share News

వైసీపీ మేనిఫెస్టో.. కొత్త సీసాలో పాత సారా

ABN , Publish Date - May 02 , 2024 | 12:55 AM

వైసీపీ మేనిఫెస్టో కొత్తసీసాలో పాత సారా మాదిరిగా ఉందని చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ విమర్శించారు.

వైసీపీ మేనిఫెస్టో.. కొత్త సీసాలో పాత సారా
నాగిరెడ్డిగూడెం ప్రచారంలో మాట్లాడుతున్న రోషన్‌కుమార్‌

చింతలపూడి, మే 1: వైసీపీ మేనిఫెస్టో కొత్తసీసాలో పాత సారా మాదిరిగా ఉందని చింతలపూడి కూటమి అభ్యర్థి సొంగా రోషన్‌కుమార్‌ విమర్శించారు. చింతలపూడి నగర పంచాయతీలోని నాగిరెడ్డిగూడెం, మోడల్‌కాలనీ, కొవ్వూరిగూడెం, నందమూరి విద్యానగర్‌ కాలనీల్లో ఆయన ప్రచారం చేశారు. ఇంటింటికి తిరిగి ఓట్లు అభ్యర్థించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అమ్మఒడి పథకంతో నాన్నబుడ్డి పేరుతో సొమ్ములు గుంజుతున్నారని, మద్యపాన నిషేధం చేసిన తరువాతే ఓట్లు అడుగుతానని చెప్పి నిషేధించకుండానే ఓట్లు అడుగుతున్నారంటూ ప్రశ్నించారు. మెగా డీఎస్సీ పేరుతో దగా డీఎస్సీ చేసి నిరుద్యోగులను మోసం చేశారన్నారు. మూడు రాజధానుల అని చెప్పి ఒక్క రాజధాని కూడా నిర్మాణం చేయలేదన్నారు. చంద్రబాబు కట్టించిన కార్యాలయాల్లోనే జగన్‌ పరిపాలన సాగిస్తున్నారని, అభివృద్ధి ఏంచేశారని ప్రశ్నించారు. తాను కష్టపడి సంపాదించుకున్న సొమ్ముతోనే రాజకీయాల్లోకి వచ్చానని గత పదేళ్ళుగా.. కరోనా సమయంలోనూ పేదలకు సొంత డబ్బులతోనే సేవా కార్యక్రమాలు చేపట్టానన్నారు. చింతలపూడి అభివృద్ధి సాధించాలంటే కూటమికి ఓటు వేయాలన్నారు. చింతలపూడి ఎత్తిపోతల పథకం రెండేళ్ళలో పూర్తి చేస్తామన్నారు. చింతలపూడి పట్టణ రూపురేఖలు మార్చి అభివృద్ధి పథంలో నడిపిస్తామ న్నారు. ప్రచారంలో బీజేపీ నాయకులు తోటా వెంకటనారాయణ, జనసేన నాయకులు పి.నాగవిజయ్‌కుమార్‌, టీడీపీ పట్టణ అధ్యక్షులు పక్కాల వెంకటేశ్వరరావు, బోడా అనిష్‌కుమార్‌, గుమ్మి భారతి, బాణావత్‌ ఉమాశంకర్‌, పలువురు కార్యకర్తలు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:55 AM