Share News

వైసీపీ పాలనలో వైద్యానికే రోగం!

ABN , Publish Date - May 02 , 2024 | 12:45 AM

ప్రతిపక్ష నాయకుడిగా పాలకొల్లు నియోజకవర్గంలో పాదయాత్రలో జగన్‌ ఘనమైన హామీలు ఇచ్చారు. సీఎంగా జగన్‌ పాలనలో వైద్యానికే రోగమొచ్చింది.!

వైసీపీ పాలనలో వైద్యానికే రోగం!
దగ్గులూరు వద్ద వైద్య కళాశాలకు కేటాయించిన స్థలం

వైద్య కళాశాల నిర్మాణ పనులు చేపట్టలేదు

ఏరియా ఆస్పత్రి వంద పడకల స్థాయికి పెరగలేదు

పట్టణ ప్రజల దాహార్తికి గోదావరి జలాలు ఇవ్వలేదు

కొబ్బరి రైతులకు గిట్టుబాటు ధర హామీ చెట్టెక్కింది

టిడ్కో ఇళ్లు ఇవ్వలేదు.. రుణాలు అప్పగించారు

ప్రతిపక్ష నాయకుడిగా పాలకొల్లు నియోజకవర్గంలో పాదయాత్రలో జగన్‌ ఘనమైన హామీలు ఇచ్చారు. సీఎంగా జగన్‌ పాలనలో వైద్యానికే రోగమొచ్చింది.! పాలకొల్లు ఏరియా ఆస్పత్రిని వంద పడకల ఆస్పత్రిగా అభివృద్ధి చేస్తామని హామీ ఇచ్చారు. ఆస్పత్రి హామీకి మతిమరుపు రోగం. సీఎంగా పాలకొల్లులో ప్రభుత్వ వైద్య కళాశాల నిర్మిస్తామన్నారు. వైద్య కళాశాలకు నిర్లక్ష్యం రోగం అంటుకుంది. ఐదేళ్లు గడిచిపోయాయి. అదే రోగాలతో నియోజకవర్గం వైద్యం కోసం ఎదురుచూస్తోంది. టిడ్కో ఇళ్ల నిర్మాణం పూర్తి చేసి లబ్ధిదారులకు ఉచితంగా అందిస్తామన్నారు. కనీస సౌకర్యాలు లేకుండా కొందరికి మాత్రమే ఇళ్లు అప్పగించారు. లబ్ధిదారులందరికీ రుణాలు అప్పగించారు. పట్టణ ప్రజల తాగునీటి అవసరాలకు గోదావరి జలాల తరలింపు హామీ గోదారిలో కొట్టుకుపోయింది. కొబ్బరికి గిట్టుబాటు ధర హామీ ఐదేళ్లుగా చెట్టెక్కి కూర్చుంది.

– పాలకొల్లు అర్బన్‌

పాలకొల్లు నియోజకవర్గ అభివృద్ధిని వైసీపీ ప్రభుత్వం పూర్తిగా నిర్లక్ష్యం చేసింది. నియోజకవర్గ కేంద్రమైన పాలకొల్లు పట్టణంలో డంపింగ్‌ యార్డ్‌ సమస్య పరిష్కరించలేదు. శంభునిపేటలో అబ్దుల్‌ కలాం పార్కు, రామగుండం పార్కు, 27వ వార్డులో నిర్మాణంలో ఉన్న బీసీ కమ్యూనిటీ భవనం పూర్తి చేయలేదు. ఎన్‌టిఆర్‌, బివిరాజు కళాక్షేత్రం (ఓపెన్‌ ఎయిర్‌ థియేటర్‌), రహదారి బంగ్లా నిర్మాణం పూర్తి చేయలేదు. రూరల్‌ మండలం లంకలకోడేరు – వెలివెల రహదారిలో వంతెన నిర్మాణం పూర్తి చేయలేదు. లంకలకోడేరు నుంచి 27 గ్రామాలకు మంచి నీటి సరఫరా పథకాన్ని పూర్తి చేయలేదు. యలమంచిలి మండలంలో ఏటిగట్టు నిర్మాణం, డ్రెయిన్లపై అవుట్‌ ఫాల్స్‌ స్లూయిజ్‌ల నిర్మాణం, కుదేలైన ఆక్వా రంగానికి ప్రోత్సాహకాలను నిర్లక్ష్యం చేశారు. పోడూరు మండలం వద్దిపర్రులో నక్కల డ్రెయిన్‌కు సైడ్‌ వాల్స్‌ నిర్మాణం చేపట్టలేదు. పంట పొలాలు వరదల సమయంలో నీట మునుగుతున్నాయి. జిన్నూరు వంతెన నిర్మాణం పూర్తయినా అప్రోచ్‌ నిర్మాణం కాకపోవడంతో రాకపోకలకు ఇబ్బందులు పడుతున్నారు.

వైద్య కళాశాల ఎక్కడ జగనన్నా..

జిల్లాకో వైద్య కళాశాల అంటూ పాలకొల్లు సమీపంలోని దగ్గులూరులో కళాశాల ఏర్పాటు చేస్తున్నట్లు హడావుడి చేశారు. 60 ఎకరాల వ్యవసాయ భూమి సేకరించారు. సంబంధిత రైతులకు సొమ్ము చెల్లించడంలోనే ఏడాది జాప్యం చేశారు. భవనాల నిర్మాణానికి రూ.475 కోట్లు కేటాయించామన్నారు. కనీసం పనులు ప్రారంభించకుండానే పదవీ కాలం ముగిసింది. పట్టణంలో వంద పడకల ఆస్పత్రి హామీ అమలు చేయలేదు. తాగునీటికి గోదావరి జిల్లాలు తీసుకురాలేదు.

పడకేసిన వంద పడకల ఆస్పత్రి

వంద పడకల ఆసుపత్రి నిర్మాణం పూర్తి చేయలేదు. భవన నిర్మాణాలు అరకొరగానే జరిగాయి. పూర్తిస్థాయిలో సిబ్బంది లేక వైద్య సేవలందకపోవడంతో రోగులు ప్రైవేటు ఆసుపత్రులకు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించవలసి వస్తోంది. వంద పడకల ఆసుపత్రి నిర్మాణం కాకపోవడంతో సామాన్య, మధ్య తరగతి ప్రజలకు తీవ్ర నిరాశ మిగిలింది.

పునాది రాయి పడని వైద్య కళాశాల

పాలకొల్లు రూరల్‌ మండలం దగ్గులూరు వద్ద మెడికల్‌ కళాశాల పనులు జరుగుతున్నాయంటూ ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌ రెడ్డి ఏడాదిన్నర క్రితం నర్సాపురం సభలో ప్రకటించారు. వాస్తవానికి ఇప్పటికీ పునాది రాయి పడలేదు. వైద్య కళాశాల నిర్మాణం నిమిత్తం దగ్గులూరు వద్ద 63 ఎకరాలను సేకరించారు. ఏడాది వరకు సంబంధిత రైతులకు సొమ్ము చెల్లించలేదు. నిర్మాణ ఏజెన్సీ ఖరారు చేయడంలో జాప్యం చేశారు. కళాశాల నిర్మాణం కోసం రూ.475 కోట్లు కేటాయించారు. తర్వాత మెగా ఏజన్సీకి పనులు అప్పగించినట్లు చెప్పిన పనులు ఒక్క అడుగు కూడా ముందుకు సాగలేదు. కనీసం స్థలం పూడిక కూడా చేయలేదు. ప్రభుత్వం వద్ద నిధులు లేకపోవడం వల్లే కళాశాల నిర్మాణంలో జాప్యం జరుగుతోంది.

టిడ్కో లబ్ధిదారులకు రుణాల మోసం

టీడీపీ ప్రభుత్వం 90 శాతం పూర్తి చేసిన టిడ్కో గృహాలను కేటాయించడంలో లబ్ధిదారులను వైసీపీ ప్రభుత్వం మోసం చేసింది. పట్టణంలో టీడీపీ ప్రభుత్వం సుమారు 7 వేల గృహాలు నిర్మించగా వాటికి వైసీపీ రంగులు వేసుకోవడం తప్ప చేసింది శూన్యం. 2 వేల ఇళ్లను అరకొర సౌకర్యాలతో లబ్ధిదారులకు స్వాధీనం చేశారు. తర్వాత మరో 1800 మందికి అందజేశారు. మిగిలిన ఇళ్లను అందజేయకపోగా రుణం చెల్లించాలని బ్యాంకుల నుంచి నోటీసులు రావడంతో లబ్ధిదారులు అవాక్కయ్యారు. ప్రభుత్వం రుణం తీసుకుని తమను మోసం చేసిందని లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఇళ్లను స్వాధీనం చేయకుండా రుణాలు ఏవిధంగా చెల్లించాలని, ఉచితంగా అందిస్తానని జగన్‌ ఇచ్చిన హామీ ఏమైందని ప్రశ్నిస్తున్నారు.

కొబ్బరి గిట్టుబాటు చెట్టెక్కింది

కొబ్బరి పంటకు గిట్టుబాటు ధర కల్పిస్తామంటూ గత ఎన్నికల ముందు జగన్‌ హామీ ఇచ్చారు. కేరళలో ఫుడ్‌ ప్రోసెసింగ్‌ యూనిట్‌లు నెలకొల్పారు. కొబ్బరి వ్యర్థాలతో ఎరువులు తయారు చేస్తున్నారు. ఇక్కడ మాత్రం ప్రభుత్వపరంగా ఎటువంటి సహకారం లేదు. కొబ్బరికి సరైన ధర లేదు. ప్రభుత్వ ప్రోత్సాహం లేదు. ఉత్పత్తి కూడా తగ్గిపోయింది. కొబ్బరి ఆధారిత పరిశ్రమలకు చేయూతనిస్తామంటూ చెప్పుకొచ్చిన జగన్‌మోహన్‌ రెడ్డి ఆచరణలో తుస్సుమనిపించారు. ఒకప్పుడు జిల్లాలో కొబ్బరి మంచి ప్రసిద్ధిగా ఉండేది. ఇక్కడ నుంచి ఉత్తరాది రాష్ట్రాలకు గణనీయంగా ఎగుమతి అయ్యేవి. ఇటీవల కాలంలో కొబ్బరి తోటలను రైతులు తొలగించేస్తున్నారు. ప్రభుత్వ ప్రోత్సాహం లేకపోవడంతో కొబ్బరి రైతు నీరుగారిపోతునాడు.

నెరవేరని హామీలు

ప్రతిపక్ష నాయకుడిగా గత ఎన్నికల ముందు పాదయాత్రగా ప్రజల ముందుకు వచ్చిన జగన్‌ హామీలు గుప్పించారు. అధికారంలో వచ్చిన తర్వాత ఒక్క హామీ కూడా అమలు చేయలేదు.

వైసీపీ అధికారంలోకి రాగానే లబ్ధిదారులకు టిడ్కో గృహాలను ఉచితంగా ఇస్తామన్నారు. అందరినీ రుణాల్లో ముంచారు.

కొబ్బరికి మద్దతు ధర ప్రకటించి రైతులకు అండగా ఉంటామని హామీలతో మురిపించి వదిలేశారు.

పట్టణంలో వంద పడకల ఆసుపత్రి నిర్మాణం గాలికొదిలేశారు.

దమ్మయ్యపర్తి డ్రైయినేజీ పూర్తిస్థాయిలో నిర్మించి సమస్య పరిష్కరిస్తామన్నారు. తర్వాత పట్టించుకోలేదు.

పాలకొల్లు పట్టణంలో ప్రధాన సమస్యల డంపింగ్‌ యార్డు ఏర్పాటు చేస్తామన్నారు. ఐదేళ్లుగా సమస్య అలాగే ఉంది.

పాలకొల్లు ప్రజల తాగునీటి సమస్య తీర్చడానికి విజ్జేశ్వరం నుంచి పైపులైన్‌ ద్వారా మంచినీరు సరఫరా హామీ అమలు చేయలేదు.

Updated Date - May 02 , 2024 | 12:45 AM