Share News

డీఏలేవి జగనన్నా ?

ABN , Publish Date - May 02 , 2024 | 12:44 AM

ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. న్యాయబద్దంగా ఇవ్వాల్సిన కరువు భత్యం బకాయిలు ఇప్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా పట్టించుకున్న పాపానపోలేదు.

డీఏలేవి జగనన్నా ?

ఐదేళ్లుగా ఉద్యోగుల అవస్థలు

ఉద్యోగుల సంక్షేమం పట్టని సర్కారు

పెరుగుతున్న ధరలతో పెనుభారం

ఐదేళ్లక్రితం నాటి జీతాలే దిక్కు

1వ తేదీ జీతం పడితే చాలనే పరిస్థితి

డీఆర్‌ కోసం పెన్షనర్ల ఎదరుచూపులు

(నిడమర్రు)

ప్రభుత్వం ఉద్యోగుల గురించి ఇసుమంతైనా పట్టించుకోవడం లేదు. న్యాయబద్దంగా ఇవ్వాల్సిన కరువు భత్యం బకాయిలు ఇప్పించాలని ఎన్నిసార్లు మొరపెట్టుకొన్నా పట్టించుకున్న పాపానపోలేదు. ఉద్యోగులను కేవలం తమ సేవకులుగా మాత్రమే చూస్తున్నారని వాపోతున్నారు. ప్రతి ఆరు నెలలకు అందాల్సిన కరువు భత్యం ఇవ్వడంలో ప్రభుత్వం మీనమేషాలు లెక్క పెడుతోందని ఆవేదన చెందుతున్నారు. ‘‘అన్ని వస్తువుల ధరలు పెరిగి పోయాయి.. నానాటికి పెరుగుతున్న ఖర్చులు తట్టుకోలేక అప్పులు పాలవుతున్నామంటూ’’ ఒక ఉద్యోగి ఆవేదన వ్యక్తం చేశారు. ఏ ప్రభుత్వం ఇంత కసాయిగా వ్యవహరించలేదని ఉద్యోగులు వాపోతున్నారు.

1వ తారీఖున జీతం పడితే చాలనే పరిస్థితి

ప్రతి నెల 1వతారీఖున జీతం పడితే చాలనే పరిస్థితిలో ఉద్యోగులు ఉన్నారు. రెండేళ్లుగా రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగు లకు ముఖ్యంగా ఉపాధ్యాయులకు ప్రతి నెల 10 నుంచి 15వ తారీఖులోపు జీతం పడుతోంది. ఉద్యోగులకు ప్రతి నెల జీతం సొమ్ము నుంచి గృహం, వాహన,వ్యక్తిగత బుణాలకు సంబంధించి ఈఎంఐలు కట్‌ అవుతాంుు. ఇటీవల ప్రభుత్వం జీతాలు ఆలస్యంగా వేయడంతో అపరాధ రుసుముతో పాటు సిబిల్‌ స్కోరు కోల్పోవలసి వస్తోంది, అందుకే ఇటీవల ప్రభుత్వంతో జరిపిన చర్చల్లో ఉద్యోగుల మొదటి డిమాండ్‌ 1వ తారీఖునే జీతాలు ఇప్పించాలని కోరారు.

మూడు డీఏలకు మంగళం

ఈ ఐదేళ్లలో జగన్‌ ప్రభుత్వం ఉద్యోగులకు 10 డీఏలు ఇవ్వాల్సి ఉంది. రెండేళ్ల క్రితం విజయవాడలో ఉద్యోగులు ఆందోళన చేపట్టిన నాటికి ఆరు డీఏలు ఇవ్వాల్సి ఉంది. ఆ సమయంలో ఉద్యోగ వర్గాలతో రాష్ట్ర ప్రభుత్వం జరిపిన చర్చల్లో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి దృష్ట్యా మూడు డీఏలు మాత్రమే ఇస్తామని మిగిలిన మూడు డీఏలు ఇవ్వలేమని చేతెలెత్తేసింది. ఈ పరిస్థితుల్లో ఉద్యోగవర్గాలు చేసేది లేక కనీసం మూడు డీఏలు అయినా వస్తాయని ఎదురు చూశారు. ఈ మూడు డీఏలు కూడా 2024 మే నెలలో ఒక డీఏకు సంబంధించి సొమ్ము, జూలైలో కొంత, అక్టోబరులో కొంత ఇస్తామని ప్రభుత్వం హామీ ఇచ్చింది. హామీ ఇచ్చిన డీఏలతో పాటు మరో నాలుగు డీఏలు ప్రభుత్వం చెల్లించాల్సి ఉంది. .

డీఆర్‌ కోసం పెన్షనర్ల అవస్థలు

రాష్ట్ర ప్రభుత్వం రిటైర్డ్‌ ఉద్యోగులకు అందించే డియర్‌నెస్‌ రిలీఫ్‌ (డీఆర్‌) కూడా పెండింగ్‌లో పెట్టింది. 2018 నుంచి పెన్షనర్లుకు రావల్సిన డీఆర్‌ బకాయిలు ప్రభుత్వం ఇప్పటివరకు చెల్లించేదని మలివిడతలో ప్రవేశించిన పెన్షనర్లు కన్నీటి పర్యంతమవుతున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:44 AM