Share News

మళ్లీ అవే ఇబ్బందులు..!

ABN , Publish Date - May 02 , 2024 | 01:01 AM

సామాజిక పింఛన్‌ పంపిణీ విషయంలో వైసీపీ సర్కార్‌ మరో ఎత్తుగడకు తెరతీసింది. బ్యాంకుల్లో సొమ్ము జమ చేస్తామని ప్రకటించింది.

 మళ్లీ అవే ఇబ్బందులు..!

పింఛన్‌దారులను అవస్థలకు గురి చేసేలా వైసీపీ ప్రభుత్వ చర్యలు

మంచంపై ఉన్న వయో వృద్ధులకు ఇంటి వద్ద అందని పెన్షన్‌

సచివాలయ, ఇతర సిబ్బందితో ఇంటింటికి పంపిణీ చేయాలని లబ్ధిదారుల డిమాండ్‌

ఏలూరు రూరల్‌, మే 1 : సామాజిక పింఛన్‌ పంపిణీ విషయంలో వైసీపీ సర్కార్‌ మరో ఎత్తుగడకు తెరతీసింది. బ్యాంకుల్లో సొమ్ము జమ చేస్తామని ప్రకటించింది. ఎక్కడో దూరంగా ఉండే బ్యాంకుల వద్దకు వెళ్లి మండుటెండలో పింఛన్‌దారులు పడిగాపులు కాసేలా చేసింది. మొత్తంగా మళ్లీ పింఛన్‌దారులను ఇబ్బందులకు గురిచేసి ఆ నెపాన్ని విపక్షాలపై వేసేందుకు ప్రయత్నిస్తోందని రాజకీయ పార్టీలు, ప్రజా సంఘాల నాయకులు మండిపడుతున్నారు. ఈ నిర్ణయంపై లబ్ధిదారుల్లో అసంతృప్తి వ్యక్తమౌతోంది. గత నెల సచివాలయాల వద్ద పెన్షన్లు పంపిణీ చేస్తే లబ్ధిదారులు తీవ్ర ఇబ్బందులు పడ్డారు. ఈనెల బ్యాంక్‌ ఖాతాల్లో నగదు వేసే ప్రక్రియను ప్రభుత్వం చేపట్టడంతో పెన్షన్‌దారులు ప్రభుత్వ పనితీరుపై తీవ్ర అసహనం వ్యక్తం చేస్తున్నారు. ఇంటి వద్దకు వచ్చి పెన్షన్‌ ఇస్తామని చెప్పిన ఈ ప్రభుత్వం నూతన విధానాలను చేపట్టి లబ్ధిదారులను తీవ్ర ఇబ్బందులకు గురి చేస్తోందని లబ్ధిదారులు వాపోతున్నారు. సచివాలయ, ఇతర సిబ్బంది ద్వారా ఇళ్ల వద్దకు వెళ్లి పింఛన్‌ ఇస్తే నష్టం ఏమిటంటూ ధ్వజమెత్తుతున్నారు. బ్యాంకులకు వెళ్లలేని వారు ఉంటే వారి ఇళ్లకు వెళ్లి పింఛన్‌ ఇస్తామనడం వెనుక అసలు కారణాలు ఏమిటంటూ మండిపడుతున్నారు. ప్రస్తుతం పగటి ఉష్ణోగ్రతలు 42 డిగ్రీలు నమోదవుతున్న నేపఽథ్యంలో దూరప్రాంతాల్లో ఉన్న బ్యాంకులకు పింఛన్‌దారులు వెళ్ళి పింఛన్‌ తీసుకోవాలంటే ఇబ్బందులు ఎదుర్కొవాల్సి వస్తుంది. ఈ విధానం వల్ల బ్యాంకుల్లో గంటల తరబడి పడిగాపులు పడాల్సి ఉంటుంది. మండుటెండలో వృద్ధులు బ్యాంకులకు వెళ్లగలరా..? క్యూలో నిలబడగలరా? విత్‌డ్రా ఫామ్‌లను పూర్తి చేయగలరా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. పింఛన్‌దారులు అధిక సంఖ్యలో బ్యాంకుల వద్దకు వెళ్లడం వల్ల రద్దీ పెరుగుతుంది. వందల సంఖ్యలో వచ్చే వృద్ధులకు తగిన ఏర్పాట్లు చేసే పరిస్థితి బ్యాంకుల వద్ద లేదు. ఎండల్లో వృద్ధులకు ఏదైనా జరిగితే బాధ్యత ఎవరిది అనేది వాదన వినిపిస్తోంది. ఎండలను దృష్టిలో పెట్టుకుని ఇంటివద్దే పింఛన్‌ ఇచ్చేలా చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేస్తున్నారు.

జమ కాని సొమ్ము

నిడమర్రు : మండలంలో దివ్యాంగులకు, 85 ఏళ్లు దాటిన కొందరు వృద్ధులకు సచివాలయ ఉద్యోగులు ఇంటింటి వెళ్లి పంపిణీ చేశారు. మండలంలో 6,387 సామాజిక పింఛన్లు ఉండగా 1,840 పింఛన్లను ఇంటింటికి వెళ్లి పంపిణీ చేశారు. డీపీటీ ద్వారా 4,547 పింఛన్ల సొమ్ము ఆయా పింఛన్‌దారుల అకౌంట్‌లో జమవుతాయని అధికారులు తెలిపినా బుధవారం సాయంత్రం వరకు డీపీటీ ద్వారా ఖాతాలకు జమ కాలేదు.

ఐదు కిలోమీటర్లు రావాల్సిందే..

ముసునూరు : మండలంలో 8,053 మంది పెన్షన్‌దారులు ఉండగా 1,852 మందికి ఇంటివద్దే పెన్షన్‌ ఇవ్వాల్సి ఉంది. ముసునూరు, చెక్కపల్లి, గోపవరం, వేల్పుచర్ల గ్రామాల్లో మాత్రమే బ్యాంక్‌లు ఉన్నాయి. చుట్టుపక్కల గ్రామాల పెన్షన్‌ దారులు ఈ బ్యాంక్‌ల వద్దకు రావాలంటే మూడు నుంచి ఐదు కిలోమీటర్ల దూరం ప్రయాణం చేయాల్సి ఉంటుంది.

51,081 మందికి ఇంటివద్దనే పింఛన్‌ : పీడీ

ఏలూరుసిటీ, మే 1: జిల్లాలో డీబీటీ ద్వారా కవర్‌ చేయ బడని (బ్యాంకు ఖాతాలు లేని), దివ్యాంగులు, తీవ్ర వ్యాధులు కేటగిరి కింద గుర్తించిన 64,338కి బుధవారం 51,081 మందికి సచివాలయాల సిబ్బంది ద్వారా ఇంటివద్దనే పింఛన్‌ పంపిణీ చేసినట్టు డీఆర్‌డీఏ పీడీ విజయరాజు తెలిపారు.

వీరు బ్యాంకుకు వెళ్లేదెలా..

ముదినేపల్లి : ఇంటి వద్దే పెన్షన్‌ను పొందే వారి జాబితాల్లో అర్హులైన పలువురు వృద్ధుల పేర్లు చోటు చేసుకోలేదు. మంచం మీదే లేచి కూర్చునే స్థితిలో లేని వృద్ధులు బ్యాంకులకు వెళ్లి పెన్షన్‌ ఎలా తీసుకోగలరో అర్థం కావడం లేదు. మండలంలో 2,250 మందికి ఇంటి వద్దే పెన్షన్లను అందజేయాలని గుర్తించి జాబితాలను రూపొందించారు. ఎన్నో ఏళ్లు గా తీవ్ర అనారోగ్యంతో మంచం మీదే ఉన్న పలువురు వృద్ధుల పేరు ఆ జాబితాల్లో చోటు చేసుకోలేదు. పెదగొన్నూరు శివారు కర్షక దళితవాడలో మద్దా ల వెంకమ్మ (86) అనే వృద్ధురాలు పైకి లేవలేని స్థితిలో మంచం పైనే ఉంది. గత నెలలో ఇంటికి వెళ్లి పెన్షన్‌ ఇచ్చారు. కానీ బెడ్‌ రెడీన్‌ జాబితా లో ఆ వృద్ధురాలి పేరు చేర్చకపోవడంతో ఈ నెల పెన్షన్‌ బ్యాంక్‌ ఖాతాలో జమ కానుంది. ఆమె ఉన్న పరిస్థితిలో బ్యాం కుకు ఎలా వెళ్లగలదు. విశ్వనాద్రిపాలెం లో యెండూరి మారెమ్మ (82) అనే వృద్ధురాలు మంచానికే పరిమితమైంది. ఆమె పేరు బెడ్‌ రిడేన్‌ జాబితాలో లేదు. చాలా గ్రామాల్లో మంచం మీదే అనారోగ్యంతో ఉన్న వయో వృద్ధుల పెన్షన్‌ బ్యాంక్‌ ఖాతాల్లో జమ అయ్యే పరిస్థితి. బ్యాంకు ఖాతాల్లో పెన్షన్‌ సొమ్ము జమ అయితే తీసుకోవడం ఎలా అన్నది ప్రశ్నార్థకంగా మారింది.

Updated Date - May 02 , 2024 | 01:01 AM