Share News

సర్వర్‌ డౌన్‌

ABN , Publish Date - May 17 , 2024 | 12:00 AM

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సర్వర్‌ డౌన్‌ సమస్య నిత్యం వేధిస్తోంది. ఎప్పుడు పనిచేస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో? తెలియని పరిస్థితి నెలకొంటుంది.

సర్వర్‌ డౌన్‌
ఖాళీగా ఉన్న డ్రైవింగ్‌ పరీక్షలు నిర్వహించే మైదానం

-రవాణాశాఖ కార్యాలయంలో నిత్యం వేధిస్తోన్న సమస్య

- ఎప్పుడు పనిచేస్తుందో.. ఆగుతుందో తెలియని పరిస్థితి

- ఇబ్బందులు పడుతున్న వాహనదారులు

(విజయనగరం క్రైం)

జిల్లా రవాణాశాఖ కార్యాలయంలో సర్వర్‌ డౌన్‌ సమస్య నిత్యం వేధిస్తోంది. ఎప్పుడు పనిచేస్తుందో? ఎప్పుడు ఆగిపోతుందో? తెలియని పరిస్థితి నెలకొంటుంది. రాష్ట్ర వ్యాప్తంగా ఒకేసారి ఈ సమస్య ఉత్పన్నమవుతోంది. విజయనగరంలో అయితే నెలలో రెండు నుంచి మూడు రోజులు ఈ సమస్య ఎదురవుతోంది. వివిధ పనుల కోసం ముందుగా స్లాట్‌ బుక్‌ చేసుకుని, అనేక వ్యయ, ప్రయాసలకోర్చి విజయనగరం చేరుకుంటున్న వాహన దారులు సర్వర్‌ డౌన్‌ సమస్యతో ఇబ్బందులు పడుతున్నారు. మళ్లీ స్లాట్‌ బుక్‌ చేసుకునే పరిస్థితి ఏర్పడుతుంది. దీంతో సమయంతో పాటు డబ్బు వృథా అవుతుందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. తాజాగా గురువారం సర్వర్‌ సమస్య తలెత్తింది. దీంతో విజయనగరం, కొత్తవలస, ఎస్‌.కోట, గజపతినగరం, బొండపల్లి, చీపురుపల్లి, బొబ్బిలి ఇలా సుదూర ప్రాంతాల నుంచి లైసెన్సులు, ఎల్‌ఎల్‌ఆర్‌ల కోసం వచ్చిన దాదాపు 60 మంది వాహనదారులకు నిరాశే మిగిలింది. ఈ నెల 18 వరకూ ఈ సమస్య ఉంటుందని, 19వ తేదీ తరువాత వాహనదారులు రావాలని కార్యాలయం వద్ద అధికారులు బోర్డును ఏర్పాటు చేశారు. దీంతో ఇప్పటికే లైసెన్సు, ఎల్‌ఎల్‌ఆర్‌ల కోసం స్లాట్‌ బుక్‌ చేసుకున్నవారు నిరాశ చెందుతున్నారు. మళ్లీ స్లాట్‌ మార్చుకోవాలంటే ఎంతో శ్రమపడాల్సి ఉంటుందని ఆవేదన చెందుతున్నారు. స్లాట్‌ బుక్‌ చేసుకుంటే తిరిగి ఎప్పుడు వస్తుందో తెలియని పరిస్థితి ఏర్పడుతుందని వాపోతున్నారు. ఇప్పటికైనా సర్వర్‌ సమస్యను పరిష్కరించాలని కోరుతున్నారు.

నిర్వహణ లోపమే కారణం

సర్వర్‌ డౌన్‌ సమస్య అప్పుడప్పుడు వస్తుంది. నిర్వహణ లోపంతో సర్వర్‌ డౌన్‌ అవుతుంటుంది. మా చేతుల్లో ఏం లేదు. సర్వర్‌ డౌన్‌ అయితే పని ఆగిపోతుంది. ఇది రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సమస్య. సుదూర ప్రాంతాల నుంచి వచ్చే వారు ఇబ్బంది పడకుండా సర్వర్‌ డౌన్‌ వంటి సమస్యలు వచ్చినప్పుడు ప్రచార సాధనాల ద్వారా, అదే విధంగా ఆర్డీవో కార్యాలయ ఆవరణలోని నోటీసు బోర్డులో సంబంధిత సమాచారాన్ని పెడుతున్నాం.

-ఎన్‌.రమేష్‌, ఆర్టీఓ, విజయనగరం

Updated Date - May 17 , 2024 | 12:00 AM