Share News

మల మల.. మాడిపోయారు

ABN , Publish Date - May 01 , 2024 | 11:43 PM

సీఎం జగన్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ జనానికి నరకమే అన్న నానుడి బొబ్బిలిలో స్పష్టంగా కనిపించింది. నాయకులు, వలంటీర్లు ఒత్తిడి చేయడంతో చేసేది లేక జగన్‌ సభకు వెళ్లిన మహిళలు, వృద్ధులు బుధవారం నరకం చూశారు.

మల మల.. మాడిపోయారు

మల మల.. మాడిపోయారు

సీఎం జగన్‌ సిద్ధం సభలో జనానికి ఇక్కట్లు

సొమ్మసిల్లిపడిపోయిన మహిళలు, వృద్ధులు

అంబులెన్స్‌లో ఆసుపత్రికి తరలింపు

ఇంటికి వెళ్లిపోతామన్నా వదలని పోలీసులు

బొబ్బిలి మెయిన్‌ రోడ్లు, జంక్షన్లన్నీ దిగ్బంధం

బొబ్బిలి/ తెర్లాం, మే 1:

సీఎం జగన్‌ ఎక్కడికి వెళ్తే అక్కడ జనానికి నరకమే అన్న నానుడి బొబ్బిలిలో స్పష్టంగా కనిపించింది. నాయకులు, వలంటీర్లు ఒత్తిడి చేయడంతో చేసేది లేక జగన్‌ సభకు వెళ్లిన మహిళలు, వృద్ధులు బుధవారం నరకం చూశారు. ఎండ వేడికి తాళలేక చాలా మంది సొమ్మసిల్లిపడిపోయారు. కొందరిని 108లో ఆస్పత్రికి తరలించారు. సభ నుంచి ఇంటికి వెళ్లిపోతామని పోలీసులను బతిమలాడినా వదలని దృశ్యాలు కనిపించాయి. ఎన్నికల ప్రచారంలో భాగంగా బుధవారం బొబ్బిలి పట్టణంలోని బలిజిపేట రోడ్డులో రాజుగారికోటకు సమీపంలో జగన్‌ సభ జరిగింది. ఉదయం పది గంటలకు సీఎం సభ ఉంటుందని చెప్పి అన్ని గ్రామాల నుంచి ఆటోలు, ఇతర వాహనాల్లో జనాలను తరలించారు. మధ్యాహ్నం 12 గంటలు దాటిన తరువాత సీఎం వచ్చారు. అంతవరకు మండుటెండలో విలవిల్లాడిపోయారు. మధ్యలో బయటకు వచ్చేస్తామంటే పోలీసులు వెళ్లనీయలేదు. ఎంతో మంది మహిళలు, వృద్ధులు వడదెబ్బ తగిలి సొమ్మసిల్లిపోయారు. సీఎం సభ ముగిసిన తరువాత 108 అంబులెన్స్‌లు వచ్చి సొమ్మసిల్లిన వారిని ఆసుపత్రికి తరలించాయి. అంతవరకు తోటి జనమే వారికి సపర్యలు చేశారు.

-- రెండు రోజుల ముందు నుంచే పట్టణంలోని అనేక ప్రాంతాలలో విద్యుత్‌ సరఫరాను నిలిపివేశారు. పగలు, రాత్రి విద్యుత్‌ లేకపోవడంతో వృద్ధులు, రోగులు, చిన్నారులు నానా అవస్థలు పడ్డారు. సీఎం కాన్వాయ్‌ వెళ్లే రహదారి పొడవునా వ్యాపార సంస్థలన్నింటినీ మూసివేయించారు. తమ రోజువారీ జీవనాధారం పోయిందని చిరువ్యాపారులు గగ్గోలు పెట్టారు.

- సీఎం సభకోసం వచ్చిన వైసీపీ కార్యకర్తలు ఆ మార్గంలో వెళుతున్న టీడీపీ ప్రచార వాహనాలను ఆసక్తిగా తిలకించడమే కాక విక్టరీ సింబల్‌ చూపి ప్రచారకర్తలను అభినందించడం గమనార్హం.

- సభకు వచ్చిన వారు ఎప్పటిలాగనే మద్యం షాపుల ముందు బారులుతీరి ఎంచక్కా జగన్‌ బ్రాండ్‌ను సేవించడం కనిపించింది.

- అన్ని కూడళ్లలో పెద్దఎత్తున బారికేడ్లు ఏర్పాటు చేశారు. దీంతో నాలుగైదు అడుగుల దూరంలో ఉన్న స్వగృహాలకు కూడా స్థానికులు చుట్టూ తిరిగి వెళ్లాల్సి వచ్చింది. నాయుడుకాలనీ, కోరాడ వీధి, జండా వీధి, బజారు జంక్షన్‌, తాండ్రపాపారాయ జంక్షన్‌, దావాలవీధి ,అంట్యాకుల వీధి, చర్చిసెంటరుకు వెళ్లాల్సిన వారు చాలా ఇబ్బందులు పడ్డారు.

- జెండా వీధి జంక్షన్‌లో నాలుగుపక్కలా పోలీసులు బారికేడ్లు వేయడంతో మహిళలు వెళ్లేదారిలేక కన్నీటిపర్యంతమయ్యారు. మధ్యాహ్నం 12 అవుతోందని, మా పిల్లలకు భోజనం పెట్టాలని, వారు ఏడుస్తారని, మమ్మల్ని వదిలేయండి అని మహిళలు ప్రాథేయపడినా పోలీసులు కనికరించలేదు.

- స్థానిక ప్రింట్‌ అండ్‌ ఎలక్ర్టానిక్‌ మీడియా వారికి ఎటువంటి అనుమతి ఇవ్వకపోవడంలో విలేకరులు బొబ్బిలి కోటలోకి వెళ్లి అక్కడ నుంచి సమాచార సేకరణ చేయాల్సి వచ్చింది.

- జగన్‌ మాటలు ఒక్క ముక్క వినపడలేదని, పైనుంచి ఎండలు, ఉక్కబోత, చెమట్లు పట్టి ఉన్నామని, ఎందుకోసం రప్పించారో తెలియదని పలువురు గగ్గోలు పెట్టారు. ఈ సమస్యను సీఎం జగన్‌కు బస్సుపై ఉన్న మంత్రి బొత్స సత్యనారాయణ, చిన్నశీనులు చెప్పారు. బారికేడ్ల నుంచి ప్రజలను బస్సు వరకు రోప్‌పార్టీతో అనుమతించాలని ఎస్‌పిని కోరారు. అయినా సీఎం బస్సు సమీపానికి ఎవరినీ అనుమతించేది లేదని పోలీసులు చెప్పడంతో వైసీపీ నాయకులు జనానికి ముఖం చాటేయకతప్పలేదు.

--

Updated Date - May 01 , 2024 | 11:43 PM