Share News

అసలు వర్సిటీ స్థాయి ఉందా?

ABN , Publish Date - May 01 , 2024 | 11:41 PM

పేరు గొప్పే కాని గురజాడ విశ్వవిద్యాలయం ఎందులోనూ ఆ స్థాయి కనిపించడం లేదు. సాధారణ సౌకర్యాల నుంచి అధ్యాపకుల వేతనాల వరకూ.. విద్యార్థులకు మౌలిక సదుపాయాల నుంచి వారు తినే ఆహారం వరకూ.. అన్నీ కొరతే. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించేసి వదిలేసింది. కీలకంగా ఉండాల్సిన అధ్యాపకులను కూడా అరకొరగా నియమించారు. కాకినాడ జేఎన్‌టీయు నుంచి ధామాషా విధానంలో రావాల్సిన నిధులు రాలేదు. హాస్టల్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, మరుగుదొడ్లు బాగాలేవని కొద్దినెలల కిందటే విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా గాడిన పడలేదు. ఈ సంస్థ కళాశాలకు ఎక్కువ.. యూనివర్సిటీకి తక్కువ అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది.

అసలు వర్సిటీ స్థాయి ఉందా?
వర్సిటీ గేట్‌ వద్ద నిరసన తెలియజేస్తున్న విద్యార్థులు(ఫైల్‌)

అసలు వర్సిటీ స్థాయి ఉందా?

మౌలిక వసతులే లేని గురజాడ విశ్వ విద్యాలయం

ఆర్భాటంగా ప్రకటించి వదిలేసిన వైనం

అత్యధికంగా అధ్యాపకులు కరువు

కాకినాడ జేఎన్‌టీయూ నుంచి రాని దామాషా నిధులు

విద్యార్థులకు సౌకర్యాలు కరువు

అనేకసార్లు ఆందోళన

అయినా పట్టని వర్సిటీ అధికారులు

పైగా నిరసన తెలిపిన వారిపై కక్ష సాధింపు చర్యలు

పేరు గొప్పే కాని గురజాడ విశ్వవిద్యాలయం ఎందులోనూ ఆ స్థాయి కనిపించడం లేదు. సాధారణ సౌకర్యాల నుంచి అధ్యాపకుల వేతనాల వరకూ.. విద్యార్థులకు మౌలిక సదుపాయాల నుంచి వారు తినే ఆహారం వరకూ.. అన్నీ కొరతే. వైసీపీ ప్రభుత్వం ఆర్భాటంగా ప్రకటించేసి వదిలేసింది. కీలకంగా ఉండాల్సిన అధ్యాపకులను కూడా అరకొరగా నియమించారు. కాకినాడ జేఎన్‌టీయు నుంచి ధామాషా విధానంలో రావాల్సిన నిధులు రాలేదు. హాస్టల్‌లో నాణ్యమైన భోజనం పెట్టడం లేదని, మరుగుదొడ్లు బాగాలేవని కొద్దినెలల కిందటే విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగారు. అయినా గాడిన పడలేదు. ఈ సంస్థ కళాశాలకు ఎక్కువ.. యూనివర్సిటీకి తక్కువ అంటూ విమర్శలు ఎదుర్కొంటోంది.

(విజయనగరం రూరల్‌)

వైఎస్‌ రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉండగా జెఎన్‌టీయు కళాశాలను విజయనగరంలో ఏర్పాటు చేశారు. జేఎన్‌టీయు కాకినాడకు అనుబంధ కళాశాలగా నడిచేది. జగన్‌ వచ్చాక 2022 జనవరి 12 న దీనిని కళాశాల నుంచి విశ్వవిద్యాలయంగా మార్చారు. అప్పటికే ఎన్నో సమస్యలు ఉన్నా.. వర్సిటీకి తగినట్టుగా మౌలిక వసతులూ లేకున్నా విశ్వవిద్యాలయంగా ప్రకటించేశారు. కాకినాడు జెఎన్‌టీయు నుంచి ధామాషా విధానంలో రావాల్సిన నిధులు రాలేదు. అనుబంధ కళాశాలల నుంచి రూ.20 కోట్ల బకాయిలు రాలేదు. ఇంజనీరింగు ప్రవేశాలు గణనీయంగా తగ్గిపోవడం తదితర కారణాలతో 20 అనుబంధ కళాశాలలు మూతపడ్దాయి. వీటి నుంచి రావల్సిన రూ.10 కోట్లు వస్తాయో? రావో తెలియదు. దీనిపై యూనివర్సిటీ అధికారులు దృష్టి పెట్టడం లేదన్న అభిప్రాయం అందరిలో ఉంది. అధ్యాపకుల కొరత తీవ్రంగా ఉంది. యూనివర్సిటీ పరిధిలో వున్న విజయనగరం, కురుపాం ఇంజనీరింగ్‌ కళాశాలలకు దాదాపు 150 మంది అధ్యాపకులు అవసరం కాగా, కేవలం 22 మందే ఉన్నారు. మిగతా 132 అధ్యాపక పోస్టుల భర్తీ ఎప్పుడు చేపడ్తార్నది విద్యార్థులను వేధిస్తున్న ప్రశ్న. ఈ విధంగా నాణ్యమైన విద్య లేకపోవడంతో గత రెండేళ్లుగా జెఎన్‌టీయు గురజాడ విశ్వవిద్యాలయం నుంచి క్యాంపస్‌ ఇంటర్వ్యూల్లో విజయం సాధించే వారి సంఖ్య కూడా గణనీయంగా తగ్గిపోయింది.

- యూనివర్సిటీ స్థాయికి ఎదిగిన నేపథ్యంలో కొత్త భవనాల నిర్మాణానికి జాతీయ ఇంజనీరింగ్‌ కౌన్సిల్‌ (ఏఐటీసీ), జేఎన్‌టీయు- కాకినాడ నుంచి రూ.24 కోట్ల 94 లక్షలు విడుదలయ్యాయి. ఈ నిధులతో అకడమిక్‌ బ్లాక్‌-3, (ఆడ్మినిస్ట్రేటివ్‌ బ్లాక్‌), బాలికల వసతి గృహం, మెటలార్జికల్‌ ఇంజనీరింగు, సివిల్‌ ఇంజనీరింగు భవనాల విస్తరణతో పాటు తాగునీటి ట్యాంకు నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి. కానీ పూర్తికాలేదు. ప్రతిపాదించిన పనుల్లో రెండు మాత్రమే అందుబాటులోకి వచ్చాయి. మిగతావి నిర్మాణం ముందుకు సాగడం లేదు. నిర్దేశించిన సమయం దాటిపోతుండడంతో అంచనా వ్యయం పెరుగుతోంది. ఇ-టెండర్ల ప్రక్రియ కొలిక్కి రావడం లేదన్న విమర్శలు ఉన్నాయి.

మౌలిక వసతులేవీ?

మంత్రి బొత్స సత్యనారాయణ, డిప్యూటీ స్పీకర్‌ కోలగట్ల వీరభద్రస్వామి తమ, తమ ఎన్నికల ప్రసంగాల్లో జెఎన్‌టీయు గురజాడ విశ్వవిద్యాలయం గురించి మాట్లాడుతూ ఉన్నారు. ఈ విశ్వవిద్యాలయాన్ని ఎన్నో విధాలుగా ప్రభుత్వం అఽబివృద్ధి చేసిందని చెబుతున్నారు. క్షేత్రస్థాయి పరిస్థితికి, వారి మాటలకు పొంతనే లేదు. యూనివర్సిటీ క్యాంపస్‌లో కనీస సౌకర్యాలు లేవు. లైటింగ్‌ వ్యవస్థ అస్తవ్యస్తంగా మారింది. హాస్టల్‌లో మరుగుదొడ్లు బాగాలేవని కొద్దినెలల కిందటే విద్యార్థులు వర్సిటీ గేటు వద్ద పెద్ద ఎత్తున ఆందోళనకు దిగిన విషయం తెలిసిందే. లైబ్రరీలో ఇంటర్నేట్‌ సౌకర్యం అంతంతమాత్రం. ఈ సమస్యలన్నీ పరిష్కరించాలని కోరుతూ విద్యార్థులు నిరసన తెలిపారు. వసతి గృహంలో నాణ్యమైన భోజనం పెట్టని కారణంగా హాస్టల్‌ విద్యార్థులు కొందరు ఓ రోజు ఆస్పత్రిని ఆశ్రయించాల్సి వచ్చింది. యూనివర్సిటీలో సమస్యలపై ఎప్పటికప్పుడు విద్యార్థులు ప్రజా సంఘాల దృష్టికి తీసుకువెళ్తూనే ఉన్నారు. దీనిపై స్పందించాల్సింది పోయి యూనివర్సిటీ అధికారులు నిరసన కార్యక్రమాల్లో పాల్గొన్న వారికి థియరీ, ప్రాక్టికల్‌ పరీక్షల్లో ఫెయిల్‌ చేయించారు. యూనివర్సిటీలో ప్రజాస్వామ్యయుత నిరసనకు అవకాశం లేదన్న సంకేతాలు పంపారు. దీంతో విద్యార్థులు యూనివర్సిటీలో పరిస్థితిపై లబోదిబోమంటున్నారు. ఇదే విషయమై విద్యార్థులకు సహకరించారన్న అభిప్రాయంతో యూనివర్సిటీలోని కొంత మంది ప్రొఫెసర్లపైనా కీలక అధికారి కక్ష సాధిస్తున్నారని సమాచారం.

తరచూ అందని జీతాలు

జెఎన్‌టీయు విశ్వవిద్యాలయంలో పనిచేసే సిబ్బందికి తరచుగా జీతాల సమస్య ఏర్పడుతోంది. విద్యాలయం ఉపకులపతి, అధ్యాపకులు, అధ్యాపకేతర సిబ్బంది మొత్తం 210 మంది పనిచేస్తున్నారు. వీరిలో కేవలం ఎనిమిది మందికి మాత్రమే జెఎన్‌టీయు కాకినాడ జీతాలు చెల్లిస్తోంది. మిగిలిన 202 మందిలో 74 మంది సీఎంఎఫ్‌ఎస్‌ నుంచి జీతాలు వస్తాయి. వీరి బడ్జెట్‌ దాదాపు రూ.50 లక్షలు.. వీరి విషయంలో ప్రతి నెలా రిజిస్ట్రార్‌ బిల్లులను ఆన్‌లైన్‌లో పెట్టాలి. వీరికి ప్రతి నెల 25 నుంచి 30వ తేదీలోపున జీతాలు పడతాయి. మిగిలిన బోధనేతర సిబ్బంది, కాంట్రాక్టు, అవుట్‌సోర్సింగు, సెక్యూరిటీకి సంబంధించి విద్యాలయం నిధుల నుంచి చెల్లిస్తారు. అయితే ఎవరికీ సకాలంలో జీతాలు అందడం లేదు. ఏ విభాగం వారికి ఎప్పుడు అందుతాయో తెలియదు. ఇలా జెఎన్‌టీయు విశ్వవిద్యాలయంగా రూపాంతరం చెంది రెండేళ్లు దాటినా ఇంకా బాలారిష్టాలు దాటలేదు.

Updated Date - May 01 , 2024 | 11:41 PM