Share News

ఐదేళ్లూ.. పట్టించుకోలే!

ABN , Publish Date - May 01 , 2024 | 11:43 PM

‘నేనున్నాను.. నేను విన్నాను .. అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తాం’ అని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇది నిజమే అనుకుని జిల్లావాసులు గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్‌ జిల్లాలో నిర్వాసిత గ్రామాలపై మాత్రం దృష్టి సారించలేదు.

ఐదేళ్లూ.. పట్టించుకోలే!
నిర్వాసిత గ్రామం బాసంగి

ఇళ్ల నిర్మాణం, మౌలిక వసతుల కల్పనపై దృష్టి సారించని ప్రభుత్వం

కొంతమందికి పరిహారం కూడా అందించని వైనం

న్యాయం చేయని వైసీపీ తీరుపై ఆయా ప్రాంతవాసుల మండిపాటు

(జియ్యమ్మవలస)

‘నేనున్నాను.. నేను విన్నాను .. అధికారంలోకి రాగానే అందరి సమస్యలు పరిష్కరిస్తాం’ అని పాదయాత్ర సమయంలో జగన్‌ హామీ ఇచ్చారు. ఇది నిజమే అనుకుని జిల్లావాసులు గత ఎన్నికల్లో వైసీపీకి పట్టం కట్టారు. అయితే అధికారంలోకి వచ్చిన జగన్‌ జిల్లాలో నిర్వాసిత గ్రామాలపై మాత్రం దృష్టి సారించలేదు. అక్కడి సమస్యలను పట్టించుకోలేదు. ప్రాజెక్టుల కోసం సర్వం త్యాగం చేసిన వారిని గుర్తించలేదు. ఐదేళ్లు గడిచినా.. నిర్వాసితులకు తగిన న్యాయం చేయలేదు.

ఇదీ పరిస్థితి..

జిల్లా పరిధి తోటపల్లి బ్యారేజీ ముంపు ప్రాంతంలో 2004-05లో జియ్యమ్మవలస మండలం బాసంగి, బిత్రపాడు, కొమరాడ మండలంలోని నిమ్మలపాడును నిర్వాసిత గ్రామాలుగా గుర్తించారు. బిత్రపాడు పంచాయతీలో బిత్రపాడు, బట్లభద్ర, సీమనాయుడువలస, బాసంగి పంచాయతీలో బాసంగి బాసంగి గదబవలస, ఎం.హరిపురం గ్రామాలు ఉన్నాయి. బిత్రపాడు పంచాయతీ సీమనాయుడువలస కూడలి వద్ద బిత్రపాడు, బట్లభద్ర, కొమరాడ మండలం నిమ్మలపాడు గ్రామాలకు స్థలాలు, ఇళ్లు మంజూరు చేశారు. ప్యాకేజీ కూడా అందజేశారు. అయితే వీరిలో కొందరికి ప్యాకేజీ అందలేదని చెబుతున్నారు. బిత్రపాడు, బట్లభద్ర గ్రామాలకు ఇచ్చిన స్థలాలు చాలా లోతుగా ఉండేవి. ఈ విషయాన్ని అప్పటి విజయనగరం జిల్లా కలెక్టర్‌ దృష్టికి తీసుకెళ్తే.. ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌తో కలిసి స్థల పరిశీలన చేశారు. చదును చేయడానికి అయ్యే ఖర్చు ఇస్తామని చెప్పారు. దీంతో నిర్వాసితులే వారికిచ్చిన స్థలాలను సొంత డబ్బులతో చదును చేసుకొని ఇళ్లు నిర్మించుకున్నారు. అయితే ఇప్పటికీ ఒక్క పైసా కూడా ఇవ్వలేదని వారు వాపోతున్నారు. చర్చిలు, దేవాలయాల నిర్మాణానికి కూడా నిధులు ఇవ్వలేదని చెబుతున్నారు. కొమరాడ మండలంలో నిర్వాసిత గ్రామం నిమ్మలపాడులో 40 మంది ఇళ్లు నిర్మించుకున్నా డబ్బులు ఇవ్వలేదని ఆ ప్రాంతవాసులు వాపోతున్నారు.

బాసంగిలో ఇలా..

తోటపల్లి నిర్వాసిత గ్రామాల్లో బాసంగి పంచాయతీ చాలా దయనీయ స్థితిలో ఉంది. ఈ గ్రామంలో మొత్తం 384 కుటుంబాలు ఉన్నట్లు అధికారులు తేల్చారు. 2007లో వీరికి ఆర్‌అండ్‌ ఆర్‌ ప్యాకేజీ, భూములకు నష్ట పరిహారం ప్రభుత్వం అందించింది. కానీ ఇళ్లు మంజూరు విషయంలో మాత్రం న్యాయం చేయలేదు. 2015లో అప్పటి ముఖ్యమంత్రి చంద్రబాబు వారి కోసం సీమనాయుడువలస గ్రామ సమీపంలో బట్లభద్ర రెవెన్యూ పరిధిలో సర్వే నెంబరు 63, 65, 67/2, 69/22, 71, 72లలో 30.58 ఎకరాల స్థలాన్ని కొనుగోలు చేశారు. ఇక్కడ అవసరమైన సీసీ రోడ్లు, డ్రైన్లు, విద్యుత్‌ సరఫరా, నీటి సరఫరా ఏర్పాటు చేశారు. అప్పటి ఉమ్మడి జిల్లా కలెక్టర్‌ ఎంఎం నాయక్‌ ఆదేశాల మేరకు గ్రామంలో ఉన్న 384 కుటుంబాలకు ఇళ్ల పట్టాలు ఇచ్చేందుకు తగు చర్యలు తీసుకున్నారు. వీరిలో కొందరు తమ పంట భూములకు ఇళ్ల స్థలాలు చాలా దూరంగా ఉన్నాయని పట్టాలు తీసుకునేందుకు నిరాకరించారు. 252 మంది మాత్రమే ఇళ్ల పట్టాలు తీసుకొని ఇళ్లు నిర్మించుకొనేందుకు సిద్ధమయ్యారు. కానీ ఆ తరువాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఇళ్లు మంజూరు విషయంలో నిర్లక్ష్యం వహించిందని వారు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

ఇవీ సమస్యలు

- బాసంగి నిర్వాసిత గ్రామంలో 70 మందికి ఇంకా అర్‌అండ్‌ఆర్‌ ప్యాకేజీ అందలేదని ఆ ప్రాంతవాసులు చెబుతున్నారు.

- బట్లభద్ర రెవెన్యూ పరిధిలో కేటాయించిన స్థలాలకు వెళ్లిపోతామని 252 మంది ఇళ్ల పట్టాలు తీసుకున్నా.. వారికి గృహాలు మంజూరు చేయలేదు.

- ప్రైవేట్‌ స్థలంలో గృహాలు నిర్మించుకుంటామన్న వారికి కూడా నిధులు మంజూరు చేయలేదని మరికొందరు వాపోతున్నారు.

- దేవాలయాలు, చర్చిలు నిర్మాణాలకు ఒక్క పైసా ఇవ్వలేదు.

- గ్రామంలో దారిద్య్ర రేఖకు దిగువన ఉన్న కుటుంబాలను దారిద్య్ర రేఖకు ఎగువన ఉన్నారని తేల్చి ప్యాకేజీ ఇవ్వలేదు.

- 2021లో ఆర్‌అండ్‌ఆర్‌ కమిషనర్‌ శ్రీధర్‌బాబు ఈ గ్రామానికి వచ్చి సమస్యలు అడిగి తెలుసుకున్నారు. కానీ నేటికీ సమస్యలు పరిష్కారించలేదు.

- కొన్ని కుటుంబాలు చింతలబెలగాం రెవెన్యూ పరిధిలో 14 ఇళ్లు నిర్మించుకున్నారు. ఆ గ్రామానికి సమీపంలో తూర్పు వైపు మరికొందరు, పెదమేరంగి కూడలిలో మరికొందరు, గవరమ్మపేట వద్ద ఇంకొందరు ఇళ్లు నిర్మించుకుంటున్నారు.

మరికొన్ని నిర్వాసిత గ్రామాల్లో ఇలా..

- తోటపల్లి బ్యారేజీ ముంపు గ్రామాలు ఏడు వరకు ఉన్నాయి. అయితే ఆయా గ్రామాల ప్రజలను వైసీపీ ప్రభుత్వం పూర్తిగా పట్టించుకోలేదు.

- పీఆర్‌ఎన్‌ వలస, సుంకి, బాసంగి, బాసంగి గదబవలస, తదితర నిర్వాసిత గ్రామాల కాలనీల్లో మౌలిక సదుపాయాలు కల్పించలేదు.

- బాసంగి గదబవలస, గుణానుపురం, పిన్నింటిరామినాయుడువలసలలో గల దాదాపు 20 నుంచి 30 గిరిజన కుటుంబాలకు చెందిన 20 ఎకరాల డిపట్టా భూములకు ఇంతవరకు నష్ట పరిహారం ఇవ్వలేదు.

- బంటువానివలసలో 18 ఏళ్లు నిండిన 32 మంది యువకుల ఇళ్ల పట్టాలకు సంబంధించి స్థలం చూపించలేకపోయారు.

- దేవాలయాలకు, చర్చిల నిర్మాణాలకు పరిహారం చెల్లించలేదు.

- విజయనగరం జిల్లాలో రామతీర్థసాగర్‌, పార్వతీపురం మన్యం జిల్లాలో పెద్దగెడ్డ నిర్వాసితుల సమస్యలు ఇంతవరకు పరిష్కారం చూపలేదు.

- తోటపల్లి నిర్వాసిత ఆరేడు గ్రామాల్లో 2,800 నిర్వాసితుల ఇళ్ల నిర్మాణాలకు వ్యయం ఎంత అనేది ఇంతవరకు వైసీపీ ప్రభుత్వం నిర్ధారించలేకపోయింది.

వైసీపీ సర్కారు విఫలం

నిర్వాసిత గ్రామాల సమస్యల పరిష్కారం విషయంలో వైసీపీ ప్రభుత్వం పూర్తిగా విఫలమైంది. నిర్వాసితులకు న్యాయం చేయాలని పలుమార్లు కలెక్టర్‌ ద్వారా ప్రభుత్వానికి విన్నవించాం. అయినా ఎటువంటి చర్యలు లేవు. రోజుల్లో తీవ్రంగా ఉద్యమిస్తాం.

- బంటు దాసు, నిర్వాసితుల సంఘం రాష్ట్ర కార్యదర్శి

=========================

ఉన్నతాధికారులకు నివేదించాం

జియ్యమ్మవలస మండలంలో నిర్వాసిత గ్రామాల సమస్యలు పూర్తిస్థాయిలో ఉన్నతాధికారులకు నివేదించాం. వారి నుంచి స్పష్టమైన ఆదేశాలు అందాల్సి ఉంది. ఆ తరువాత సమస్యలను పరిష్కారిస్తాం.

- డీవీ సీతారామయ్య, తహసీల్దార్‌, జియ్యమ్మవలస

Updated Date - May 01 , 2024 | 11:43 PM