Share News

ప్రచారానికి వడదెబ్బ

ABN , Publish Date - May 02 , 2024 | 12:00 AM

ఇంట్లో ఏసీ.. బయటకు వెళితే కారులో ఏసీ.. ఇలా నిత్యం ‘చల్లగా’ ఉండే అభ్యర్థులు మండుటెండలో ఎన్నికల ప్రచారానికి వెళుతూ..చెమటలు కక్కుతున్నారు.

ప్రచారానికి వడదెబ్బ
బొబ్బిలిలో సీఎం పర్యటన నేపథ్యంలో ట్రాఫిక్‌ ఆంక్షలతో ఎండలోనే ప్రజలు

- రోజురోజుకూ పెరుగుతున్న ఉష్ణోగ్రతలు

- నాయకులు, కార్యకర్తలకు ఇబ్బందులు

విజయనగరం (ఆంధ్రజ్యోతి), మే 1: ఇంట్లో ఏసీ.. బయటకు వెళితే కారులో ఏసీ.. ఇలా నిత్యం ‘చల్లగా’ ఉండే అభ్యర్థులు మండుటెండలో ఎన్నికల ప్రచారానికి వెళుతూ..చెమటలు కక్కుతున్నారు. ఎన్నికల నోటిఫికేషన్‌ రాక ముందునుంచే జిల్లాలో ఎండలు మండిపోతున్నాయి. వడగాల్పులు తీవ్రంగా ఉన్నాయి. నోటిఫికేషన్‌ వెలువడిన దగ్గర నుంచి మరింత పెరిగాయి. ప్రచారంలో ముందుండాలనే ఉద్దేశంతో మార్చి, ఏప్రిల్‌ నెలల్లో అభ్యర్థులు ఉదయం... సాయంత్ర ం ప్రచారం చేపట్టారు. రాను రాను సూర్యప్రతాపం ఎక్కువ కావటంతో కార్యకర్తలు ప్రచారానికి డుమ్మా కొడుతున్నారు. కొందరు అభ్యర్థులు... కార్యకర్తలు కూడా వడదెబ్బకు గురవుతున్నారు. ఎక్కువ సంఖ్యలో కార్యకర్తల మధ్య ప్రచారం చేయడం... హారతులు... పూలదండలు... నుదుటి తిలకం... ప్రచారంలో మంటలు పుటిస్తున్నాయి. కొంతమంది అభ్యర్థులు కార్యకర్తలు డీ-హైడ్రేషన్‌కు గురై.. సొమ్మసిల్లి పడిపోతున్న సందర్భాలు ఉంటున్నాయి. దీంతో చేసేది ఏమీ లేక... కొందరు అభ్యర్థులు ఉదయం 9 గంటలకే ప్రచారం ముగించుకుని... తిరిగి సాయంత్రం 5 గంటల తరువాత మొదలు పెడుతున్నారు. మే నెలలో ఉష్ణోగ్రతలు మరీ తీవ్రంగా ఉంటాయని వాతావరణ శాఖ హెచ్చరించింది. అయినా ఈ 10 రోజులు ఎలాగైనా వీలున్నంత వరకు ఎక్కువ మంది ఓటర్లను కలుసుకునేందుకు అభ్యర్థులు ప్రయత్నిస్తున్నారు. ఈ కొద్ది రోజులైనా సూరీడు కాస్త శాంతిస్తే బాగుండునని కోరుకుంటున్నారు. బుధవారం బొబ్బిలిలో జరిగిన సీఎం ఎన్నికల ప్రచారంలో కూడా అనేక మంది కార్యకర్తలు ఎండవేడిని, వడగాల్పులను తట్టుకోలేక సొమ్మసిల్లిపోయారు.

Updated Date - May 02 , 2024 | 12:00 AM