Share News

వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఉత్తరాంధ్ర భూములు

ABN , Publish Date - May 02 , 2024 | 01:50 AM

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దోచేశారని, వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు.

వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఉత్తరాంధ్ర భూములు

వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి వంటి నాయకుల గుప్పిట్లో వేలాది ఎకరాలు

మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అన్నట్టుగా ఉంది వైసీపీ పాలన

చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా చెత్తలో కలిపేద్దాం

పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ కరెప్షన్‌ కింగ్‌

- జగన్‌ రాష్ట్ర స్థాయిలో దోచేస్తే...అతను పెందుర్తిలో దోచేస్తున్నాడు

ఎమ్మెల్యే ఒక కరప్షన్‌ కింగ్‌

- పెందుర్తి సభలో జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌.. వైసీపీ నేతలపై తీవ్ర ఆగ్రహం

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దోచేశారని, వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం, రాత్రి విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ పాలన మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అన్న చందంగా సాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకులు తమ భూములు దోచేశారన్న మాటే వినిపిస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎక్కడికక్కడే భూములు ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

కరప్షన్‌ కింగ్‌ అదీప్‌రాజ్‌

గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గ ఓటర్లు యువకుడైన అదీప్‌రాజ్‌ మేలు చేస్తాడని గెలిపిస్తే కరప్షన్‌ కింగ్‌గా మారాడని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాష్ట్రస్థాయిలో జగన్‌ దోచుకుంటే, నియోజకవర్గ స్థాయిలో అతను దోచేస్తున్నాడన్నారు. ఈ ప్రాంతంలో ఫ్లాట్‌ కొనాలన్నా అదీప్‌రాజ్‌ మనుషులకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించాల్సిందిగా ప్రజలు కోరుతున్నా జగన్‌ పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బాధ్యతను తీసుకుంటామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలని, కానీ, ఆ పరిశ్రమల వల్ల ఎవరూ బలి కాకూడదన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఇక్కడి ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపించకుండా..కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నాడన్నారు. అదీప్‌రాజ్‌ ఓటు అడగానికి వస్తే గెట్‌ లాస్ట్‌ అదీప్‌, గెట్‌ లాస్ట్‌ జగన్‌...అని చెప్పాలని పవన్‌ సూచించారు. పెందుర్తిలో చట్టాలు, రాజ్యాంగం లేదా..? అని ప్రశ్నించిన పవన్‌..అదీప్‌రాజ్‌ నువ్వు జస్ట్‌ ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని, అసెంబ్లీలో ఈ ప్రాంత గళం వినిపిస్తానని పవన్‌ స్పష్టంచేశారు. చెత్త పన్నును చెత్తలో పడేస్తామని, చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా చెత్తలో పడేద్దామని స్పష్టం చేశారు.

హామీలు అమలు చేసే బాధ్యత మాదీ

మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసే బాధ్యత తమదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. ఉమ్మడి మేనిఫెస్టోను స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా రూపొందించామన్నారు. ఎంపీగా సీఎం రమేష్‌ను, ఎమ్మెల్యేగా పంచకర్ల రమేశ్‌బాబును గెలిపించాలని, వీరిద్దరితో పని చేయించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

పాటలు పాడిన పవన్‌..

‘పోలీస్‌ కానిస్టేబుల్‌గా పనిచేసిన నాన్న...ఎస్‌ఐగా చూడాలన్నది ఆయన కోరిక...ఏమవ్వాలో నాకు చెప్పలేదు..చదివే వాడిని కాని.. ఏం అవ్వాలో తెలియదు..యాక్టింగ్‌ స్కిల్‌ నేర్పించి ఈ స్థాయికి వచ్చేలా అన్న చిరంజీవి చేశాడు’ అని పవన్‌ పేర్కొన్నారు. చిరంజీవి తనకు యాక్టింగ్‌ స్కిల్‌ను సత్యానంద్‌ మాస్టార్‌ దగ్గర ఇదే విశాఖలో నేర్పించాడన్న పవన్‌..‘ఏం పిల్లడో ఎల్దమొస్తవా...సీకాకులం చిట్టడవిలోనికి..ఏం పిల్లడో ఎల్దమొస్తవా..’, ‘బైబైయే బంగారు రవణమ్మ..జమ్‌జమ్మల్దారీ..’..పాట, ఆట, నటన అన్నీ నేర్పిస్తే, మీరు గుండెల్లో పెట్టుకుంటే పవన్‌ కల్యాణ్‌ అయ్యాడు’ అని స్పష్టం చేశారు. ఇంటి పెద్దగా ఉన్న చిరంజీవి తనలోని ప్రతిభను గుర్తించి శిక్షణ ఇప్పిస్తే...డబ్బులు సంపాదించి కౌలు రైతులకు సాయం చేసే స్థాయికి పవన్‌ చేరాడన్నారు. చిరంజీవి వంటి పెద్దన్న పాత్రను కూటమి ప్రభుత్వం తీసుకుంటుందని, అటువంటి ఆణిముత్యాలను గుర్తించి వెలికితీసేలా ప్రతిభ గణాంకాలు తీయాలని చంద్రబాబునాయుడుకు సూచించినట్టు పవన్‌ వెల్లడించారు. యువకుల్లోని ప్రతిభను బయటకు తీస్తామన్నారు.

పెందుర్తి జనసంద్రం

పెందుర్తి, మే 1:

పెందుర్తి జనసంద్రాన్ని తలపించింది. జనసేన అఽధినేత పవన్‌ కల్యాణ్‌ వారాహి విజయభేరి యాత్ర ప్రభంజనం సృష్టించింది. బుధవారం సాయంత్రం అచ్యుతాపురంలో సభ ముగించుకుని పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌లో సరిపల్లిలోని హెలీప్యాడ్‌కు చేరుకున్నారు. అక్కడి నుంచి ర్యాలీగా ప్రజలకు అభివాదం చేస్తూ పెందుర్తి జంక్షన్‌లోని సభాస్థలికి చేరకున్నారు. జన సైనికులతో పాటు టీడీపీ, బీజేపీ శ్రేణులు, అభిమానులు, ప్రజలు వెల్లువలా తరలిరావడంతో పెందుర్తి కిక్కిరిసిపోయింది. పవన్‌ ప్రసంగిస్తున్నంత సేపు అభిమానులు కేరింతలు, నృత్యాలతో హోరెత్తించారు. మహిళలు, కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలుపుతూ పవన్‌ తన ప్రసంగాన్ని ప్రారంభించారు. తూటాల్లాంటి మాటలతో వైసీపీ అధినేత జగన్‌పై ధ్వజమెత్తారు. శ్రీశ్రీ, శేషాద్రి కవితలతో ఓటర్లను చైతన్యపరస్తూ, వైసీపీ అరాచకాలను ఎండగడుతూ ప్రసంగించారు. ప్రభుత్వ వ్యతిరేక ఓటుతో రాష్ట్రంలో సునామీ రాబోతుందన్నారు.

పగిలే కొద్దీ గాజు పదునెక్కుతుంది

గాజు పగిలే కొద్దీ పదునెక్కుతుందని..ప్రజల్ని పీడిస్తున్న జలగ జగన్‌ను గద్దె దించేందకు తాను తగ్గి కూటమి కట్టానన్నారు. ప్రజలు భయం గుప్పిట్లో బతుకున్నారన్నారు. ప్రజాధనాన్ని రాబందుల్లా దోచేస్తున్న జగన్‌ రెడ్డి, పెద్దిరెడ్డి, సుబ్బారెడ్డి ఆగడాలకు అంతం పలకాలని యువతకు పిలుపునిచ్చారు.

Updated Date - May 02 , 2024 | 01:50 AM