Share News

వైసీపీ నేతల కబంధ హస్తాల్లో ఉత్తరాంధ్ర భూములు

ABN , Publish Date - May 02 , 2024 | 01:06 AM

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దోచేశారని, వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం, రాత్రి విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్‌లో జరిగిన సభలో ప్రసంగించారు.

వైసీపీ నేతల కబంధ హస్తాల్లో  ఉత్తరాంధ్ర భూములు
అచ్యుతాపురం సభకు హాజరైన అశేష ప్రజానీకం

- వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి, మిథున్‌రెడ్డి వంటి నాయకుల గుప్పిట్లో వేలాది ఎకరాలు

- మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అన్నట్టుగా ఉంది వైసీపీ పాలన

- చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా చెత్తలో కలిపేద్దాం

- ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు భూదందాలు

- కోట్లు ఆర్జించాడే తప్ప అభివృద్ధి శూన్యం

- పెందుర్తి ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ కరెప్షన్‌ కింగ్‌

- జగన్‌ రాష్ట్ర స్థాయిలో దోచేస్తే...అతను పెందుర్తిలో దోచేస్తున్నాడు

విశాఖపట్నం/అచ్యుతాపురం/పెందుర్తి, మే 1 (ఆంధ్రజ్యోతి):

ఉత్తరాంధ్రలో భూములను వైసీపీ నాయకులు వైవీ సుబ్బారెడ్డి, పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్‌రెడ్డి దోచేశారని, వేలాది ఎకరాలు వారి కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఆరోపించారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన బుధవారం సాయంత్రం అనకాపల్లి జిల్లా ఎలమంచిలి నియోజకవర్గ పరిధిలోని అచ్యుతాపురం, రాత్రి విశాఖ జిల్లా పెందుర్తి జంక్షన్‌లో జరిగిన సభలో ప్రసంగించారు. వైసీపీ ప్రభుత్వ పాలన మూడు కబ్జాలు, ఆరు సెటిల్‌మెంట్లు అన్న చందంగా సాగుతోందని తీవ్రస్థాయిలో ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ మూలకు వెళ్లినా వైసీపీ నాయకులు తమ భూములు దోచేశారన్న మాటే వినిపిస్తోందన్నారు. వైసీపీ నేతలు ఎక్కడికక్కడే భూములు ఆక్రమించుకుంటున్నారని ఆగ్రహాన్ని వ్యక్తంచేశారు.

కన్నబాబు రాజు కాదు.. కన్నాల రాజు

అచ్యుతాపురం: ప్రస్తుత ఎలమంచిలి ఎమ్మెల్యే కన్నబాబు రాజు కాదని.. కన్నాల రాజని జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ అన్నారు. అచ్యుతాపురంలో గురువారం జరిగిన వారాహి యాత్రలో పాల్గొన్న ఆయన స్థానిక ఎమ్మెల్యే కన్నబాబు రాజుపై విరుచుకు పడ్డారు. ఐదేళ్లలో కన్నాల రాజు భూదందాలు, సెజ్‌ కర్మాగారాల్లో దందాలతో కోట్లు ఆర్జించాడే తప్ప ఒక్క అభివృద్ధి కార్యక్రమమైనా చేశాడా? అని ప్రశ్నించారు. సెజ్‌ పేరుతో అధికారుల ద్వారా నోటీసులు ఇప్పించడం, రైతులను భయబ్రాంతులకు గురిచేసి వాటిని తక్కువ ధరకు కొనుగోలు చేసి ఎక్కువ ధరకు విక్రయించి కోట్లు ఆర్జించాడన్నారు. కొండలు, గుట్టలు అనే తేడా లేకుండా ఆక్రమించుకున్నాడన్నారు. అలాగే సింహాచలం దేవస్థానానికి చెందిన భూమిని ఆక్రమించి భారీ భవనాన్ని నిర్మించుకున్నాడన్నారు. కొండలు, గుట్టలు, గాలి, నీరు, నిప్పు ఎవడి సొత్తు కాదు. మనది, మనందరిది.. వీటిని ఆక్రమించుకోవడానికి వారికి ఏమి హక్కుంది? అని ఆయన ఆవేశంగా అన్నారు. అలాంటి వారికి ఓటు ద్వారా బుద్ధి చెప్పాలా?, వద్దా? అని ప్రశ్నించారు. బుద్ధి చెప్పాలి.. చెప్పాలి అని జనం కేకలు వేశారు. నియోజక వర్గంలో ప్రజలకు స్వాతంత్య్రం లేదు. ఏది అడిగినా పోలీసు కేసులు. అలాగే ఒక విద్యార్థి ఫీజు రీయింబర్స్‌మెంట్‌ గురించి అడిగితే చెంప మీద కొట్టాడు. అలాంటి వ్యక్తికి మళ్లీ ఓటు వేయాలా?.. అనగానే వద్దు, వద్దు అంటూ జనం సమాధానమిచ్చారు. ఎలమంచిలి అభివృద్ధి చెందాలంటే సుందరపు విజయకుమార్‌, అనకాపల్లి జిల్లా అభివృద్ధి చెందాలంటే సీఎం రమేశ్‌ను గెలిపించాలన్నారు. ల్యాండ్‌ టైటిలింగ్‌ యాక్ట్‌ వస్తే ముందుగా కన్నాల రాజు మీ ఇళ్లను కూడా కబ్జా చేస్తాడని అన్నారు. స్థానిక అధికారులకు చెప్పినా అక్కడ వాళ్ల అధికారులే ఉంటారు కనుక వారు ఏమీ చేయరన్నారు. అప్పుడు హైకోర్టుకు వెళ్లాలన్నారు. ఒక పార్టీ నడుపుతూ, జనాదరణ ఉన్న తానే హైకోర్టుకి వెళ్లలేనని, ఇక సామాన్యులెలా వెళతారని ప్రశ్నించారు. తాము అధికారంలోకి వచ్చిన వెంటనే మత్స్యకారులకు వేట నిషేధ సమయంలో జీవన భృతి, పూడిమడకలో హార్బర్‌ నిర్మాణం చేస్తామని చెప్పారు.

కరప్షన్‌ కింగ్‌ అదీప్‌రాజ్‌

పెందుర్తి: గత ఎన్నికల్లో పెందుర్తి నియోజకవర్గ ఓటర్లు యువకుడైన అదీప్‌రాజ్‌ మేలు చేస్తాడని గెలిపిస్తే కరప్షన్‌ కింగ్‌గా మారాడని పవన్‌ కల్యాణ్‌ విమర్శించారు. రాష్ట్రస్థాయిలో జగన్‌ దోచుకుంటే, నియోజకవర్గ స్థాయిలో అతను దోచేస్తున్నాడన్నారు. ఈ ప్రాంతంలో ఫ్లాట్‌ కొనాలన్నా అదీప్‌రాజ్‌ మనుషులకు డబ్బులు చెల్లించాల్సి వస్తోందన్నారు. కాలుష్య కోరల్లో చిక్కుకున్న తాడి గ్రామాన్ని తరలించాల్సిందిగా ప్రజలు కోరుతున్నా జగన్‌ పట్టించుకోలేదని, తాము అధికారంలోకి వచ్చిన వెంటనే ఆ బాధ్యతను తీసుకుంటామని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. యువతకు ఉద్యోగాలు రావాలంటే పరిశ్రమలు రావాలని, కానీ, ఆ పరిశ్రమల వల్ల ఎవరూ బలి కాకూడదన్నారు. ఎమ్మెల్యే అదీప్‌రాజ్‌ ఇక్కడి ప్రజల సమస్యలకు పరిష్కారాన్ని చూపించకుండా..కబ్జాలు, సెటిల్‌మెంట్లు చేసుకుంటున్నాడన్నారు. అదీప్‌రాజ్‌ ఓటు అడగానికి వస్తే గెట్‌ లాస్ట్‌ అదీప్‌, గెట్‌ లాస్ట్‌ జగన్‌...అని చెప్పాలని పవన్‌ సూచించారు. పెందుర్తిలో చట్టాలు, రాజ్యాంగం లేదా..? అని ప్రశ్నించిన పవన్‌..అదీప్‌రాజ్‌ నువ్వు జస్ట్‌ ఎమ్మెల్యే మాత్రమేనని గుర్తుంచుకోవాలన్నారు. పంచగ్రామాల సమస్య పరిష్కారానికి కృషిచేస్తానని, అసెంబ్లీలో ఈ ప్రాంత గళం వినిపిస్తానని పవన్‌ స్పష్టంచేశారు. చెత్త పన్నును చెత్తలో పడేస్తామని, చెత్తపై పన్ను వేసిన ఈ ప్రభుత్వాన్ని కూడా చెత్తలో పడేద్దామని స్పష్టం చేశారు.

హామీలు అమలు చేసే బాధ్యత మాదీ

మేనిఫెస్టోలోని హామీలను అమలు చేసే బాధ్యత తమదని పవన్‌ కల్యాణ్‌ స్పష్టంచేశారు. ఉమ్మడి మేనిఫెస్టోను స్మార్ట్‌ ఫోన్‌ ఉన్న ప్రతి ఒక్కరూ డౌన్‌లోడ్‌ చేసుకోవాలన్నారు. అన్ని వర్గాలకు మేలు చేసేలా రూపొందించామన్నారు. ఎంపీగా సీఎం రమేష్‌ను, ఎమ్మెల్యేగా పంచకర్ల రమేశ్‌బాబును గెలిపించాలని, వీరిద్దరితో పని చేయించే బాధ్యతను తాను తీసుకుంటానన్నారు.

జన ప్రభంజనం

- జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ కోసం తరలివచ్చిన అశేష ప్రజానీకం

అచ్యుతాపురం, మే 1: అచ్యుతాపురం జనసంద్రమైంది. జనసేన అధినేత పవన్‌ కల్యాణ్‌ ఎన్నికల ప్రచారం కోసం బుధవారం మధ్యాహ్నం ఇక్కడికి రావడంతో జనం పోటెత్తారు. మధ్యాహ్నం మూడు గంటలకు వారాహి యాత్ర ఉంటుందని తెలిసి అచ్యుతాపురం- పూడిమడక రోడ్డులో సభాస్థలికి వేలాది మంది తరలివచ్చారు. పవన్‌ కల్యాణ్‌ హెలికాప్టర్‌లో బ్రాండిక్స్‌ ఆవరణలో దిగారు. నాలుగు గంటలకు అశేష ప్రజానీకం కూటమి జెండాలతో కేరింతలు కొట్టారు. సభా ప్రాంగణం చాలకపోవడంతో మూడు, నాలుగు అంతస్థుల భవనాలపైకి ఎక్కి పవన్‌ కల్యాణ్‌ రాక కోసం ఎదురు చూశారు. సరిగ్గా 4.35 గంటలకు పవన్‌ వారాహి రథం మీదకు వచ్చారు. ముందుగా నవ్వుతూ అందరికీ అభివాదం చేశారు. పవన్‌ కల్యాణ్‌ తన ప్రసంగం పారంభించే ముందు కార్మికులకు మేడే శుభాకాంక్షలు తెలిపారు. సాయంత్రం 5.20 గంటలకు పవన్‌ ప్రసంగం ముగిసింది. సభ అనంతరం వచ్చిన జనం తిరిగి వెళ్లడానికి చాలా సమయం పట్టింది. అచ్యుతాపురం నాలుగురోడ్ల కూడలి జనాలతో నిండిపోయింది. పోలీసులు ముందుగానే అచ్యుతాపురం జంక్షన్‌లో పూడిమడక రోడ్డు వైపు బారికేడ్లతో రాకపోకలను నిషేధించారు. సమావేశం తరువాత నాలుగు రోడ్ల జంక్షన్‌ నుంచి ఎటు చూసినా రెండు కిలోమీటర్ల మేర జనంతో నిండిపోయింది. సాయంత్రం ఆరు వరకు ట్రాఫిక్‌ క్లియర్‌ కాలేదు. సమావేశానికి సుమారు 20 వేల మంది వచ్చి ఉంటారని అంచనా.

Updated Date - May 02 , 2024 | 01:06 AM