Share News

కలిసొచ్చిన అదృష్టం

ABN , Publish Date - May 02 , 2024 | 01:34 AM

జిల్లాలో భీమునిపట్నం ప్రత్యేకత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా నాలుగుసార్లు అదే పార్టీకి చెందిన అభ్యర్థి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు విజయం సాధించడం ఇక్కడ ప్రత్యేకం.

కలిసొచ్చిన అదృష్టం

భీమిలిలో నాలుగుసార్లు జయకేతనం

ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు రాజకీయ ప్రస్థానం

జిల్లాలో భీమునిపట్నం ప్రత్యేకత కలిగిన అసెంబ్లీ నియోజకవర్గం. తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి వరుసగా నాలుగుసార్లు అదే పార్టీకి చెందిన అభ్యర్థి ఆర్‌ఎస్‌డీపీ అప్పలనరసింహరాజు విజయం సాధించడం ఇక్కడ ప్రత్యేకం. ఎలాంటి రాజకీయ పరిచయం లేని వ్యక్తి వరుస విజయాలను అందుకోవడం అప్పట్లో సంచలనం.

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంలో భీమిలి నుంచి పూసపాటి ఆనందగజపతిరాజు పోటీచేసి విజయం సాధించారు. ఎన్టీఆర్‌ మంత్రి వర్గంలో విద్యాశాఖా మంత్రిగా పనిచేశారు. 1985లో నాదెండ్ల భాస్కరరావు ఉదంతం అనంతరం ఎన్టీఆర్‌ అసెంబ్లీని రద్దుచేసి కొత్తవారికి టికెట్లు ఇచ్చారు. ఆ సమయంలో పద్మనాభం మండలం పాండ్రంగి గ్రామానికి చెందిన అప్పల అప్పలనరసింహరాజుకు టికెట్‌ లభించింది. ఏమాత్రం రాజకీయ అనుభవం లేని వ్యక్తికి ఎన్టీఆర్‌ టికెట్‌ ఇవ్వడమే గొప్ప విషయమైతే... ఆ ఎన్నికల్లో ఆయన మంచి మెజారిటీతో విజయం సాధించడం మరో విశేషం.

కలిసొచ్చిన అంశాలివి...

తొలిసారి భీమిలి నుంచి ఆర్‌ఎస్‌డీపీ రంగంలోకి దిగే సమయంలో కాంగ్రెస్‌ తరఫున పోటీకి డిమాండ్‌ ఉండేది. ఆ పార్టీ ప్రొఫెసర్‌ ఆకెళ్ల శేషగిరిరావుకు టికెట్‌ ఇచ్చింది. దీంతో నియోజకవర్గంలోని సీనియర్‌ నేతలు ఎవరూ అతనికి సహకరించలేదు. దీంతో అప్పలనరసింహరాజు విజయం నల్లేరు మీద నడకలా సాగిపోయిది. ఆ తర్వాత జరిగిన ఎన్నికల్లో కాంగ్రెస్‌ నుంచి పోటీకి అభ్యర్థుల మధ్య పోటీ నెలకొంది. కాగా విజయనగరం జిల్లా అలమండకు చెందిన కాకర్లపూడి సూర్యనారాయణరాజుకు కాంగ్రెస్‌ బి ఫారం ఇచ్చింది. ఈలోగా పీసీసీ అధ్యక్షుడి మార్పు జరగడంతో విశాఖపట్నానికి చెందిన సుంకర ఆళ్వారుదాసుకు కూడా బి ఫారం లభించింది. ఇద్దరూ కాంగ్రెస్‌ అభ్యర్థులుగానే నామినేషన్లు వేశారు. దీంతో ఈసీ ఇద్దరినీ స్వతంత్ర అభ్యర్థులుగా ప్రకటించడంతో బ్యాలెట్‌లో హస్తం గుర్తుకు చోటు దక్కలేదు. దీంతో అప్పలనరసింహరాజు సునాయాసంగా విజయం సాధించారు.

మూడో సారీ... అదే రీతి

మూడోసారి పోటీలో టీడీపీ మండలాధ్యక్షుడు కోరాడ శంకరరావు కాంగ్రెస్‌లో టికెట్‌ సాధించారు. దీంతో కాంగ్రెస్‌ ఆశావహులు సహకరించలేదు. పైగా అప్పలనరసింహరాజు విజయానికి కృషి చేశారు. ఇక నాల్గోసారి ఇలాంటి పరిస్థితి పునరావృతమయింది. పాత ప్రత్యర్థులే మళ్లీ తలపడ్డారు. శంకరరావుపై వ్యతిరేకత అప్పలనరసింహరాజుకు విజయం సాధించిపెట్టింది. అయితే 2009లో సింహాచలం సర్పంచి కర్రి సీతారామ్‌ కాంగ్రెస్‌ అభ్యర్థిగా రంగంలోకి దిగడం, బలమైన అతని సామాజికవర్గం సహకరించడంతో అప్పలనరసింహరాజుకు ఓటమి తప్పలేదు. అనంతరం అతనికి మళ్లీ పోటీచేసే అవకాశం దక్కలేదు. దీంతో తెలుగుదేశం పార్టీలో కొనసాగుతూ అభ్యర్థుల విజయానికి సహకరిస్తున్నారు.

- భీమునిపట్నం రూరల్‌

Updated Date - May 02 , 2024 | 01:34 AM