Share News

సాగునీటి వనరులపై అంతులేని నిర్లక్ష్యం

ABN , Publish Date - May 02 , 2024 | 01:09 AM

మండలంలో ఐదేళ్లుగా సాగునీటి వనరులు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పలు పంట కాలువలపై ఉన్న డివిజన్‌ డ్యామ్‌లు శిథిలావస్థకు చేరుకుని గేట్లు లేక ఆయకట్ట భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఇక ఆయకట్ట శివారు భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదు. దీంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

సాగునీటి వనరులపై అంతులేని నిర్లక్ష్యం
శ్రీరాంపురం వద్ద శిథిల స్థితిలో ఉన్న డివిజన్‌ గేట్లు

- శిథిలావస్థకు చేరిన డివిజన్‌ డ్యామ్‌లు

- గేట్లు లేక సాగునీరు వృథా

- ప్రభుత్వానికి అధికారులు ప్రతిపాదనలు పంపినా పట్టించుకోని వైనం

- ఐదేళ్లుగా రైతులకు తప్పని కష్టాలు

పాయకరావుపేట, మే 1: మండలంలో ఐదేళ్లుగా సాగునీటి వనరులు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. పలు పంట కాలువలపై ఉన్న డివిజన్‌ డ్యామ్‌లు శిథిలావస్థకు చేరుకుని గేట్లు లేక ఆయకట్ట భూములకు సక్రమంగా సాగునీరు అందడం లేదు. ఇక ఆయకట్ట శివారు భూములకు సాగునీరు అందే పరిస్థితి లేదు. దీంతో రైతులు సాగునీటి కష్టాలు ఎదుర్కొంటున్నారు.

ప్రతి ఏటా వర్షాకాలంలో పాయకరావుపేట వద్ద తాండవ నదిలోకి పలు కొండ గెడ్డలు, ఎగువ ప్రాంతంలోని పంట కాలువల ద్వారా వచ్చే నీటితో పాటు తాండవ రిజర్వాయర్‌ నుంచి నదిలోకి విడిచిపెడుతున్న నీరు పాయకరావుపేట వద్ద భూమి, ముఠా ఆనకట్టల వరకు చేరుతుండగా, మండలంలోని వేల ఎకరాల పంట భూములకు సాగునీరందుతోంది. దీనిలో ముఠా ఆనకట్టకు కుడి వైపు ఉన్న ముఠా చానెల్‌ పరిధిలో 5,280 ఎకరాల ఆయకట్ట భూములుండగా, ఆనకట్ట ఎడమవైపు ఉన్న మంగవరం చానెల్‌ పరిధిలో 1,256 ఎకరాల భూమిని రైతులు సాగు చేస్తున్నారు. భూమి ఆనకట్ట వద్ద ఉన్న భూమి చానెల్‌ పరిధిలో 2,549 ఎకరాల ఆయకట్ట ఉంది. ఆదే విధంగా ఆవ చానెల్‌ పరిధిలో 2,464 ఎకరాలు, ఎం.ఎస్‌.పేట చానెల్‌ పరిధిలో 663 ఎకరాలు, రాజవరం చానెల్‌ పరిధిలో 363 ఎకరాలు, పాల్తేరు కనుముల చానెల్‌ పరిధిలో 223 ఎకరాలను రైతులు సాగు చేస్తున్నారు.

ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా స్పందన కరువు

మండలంలో ముఠా చానెల్‌ పరిధిలో శిథిలావస్థకు చేరుకున్న డివిజన్‌ డ్యామ్‌లు 14, భూమి చానెల్‌ పరిధిలో 18, మంగవరం చానెల్‌ పరిధిలో 12 కలిపి.. మొత్తం 44 డివిజన్‌ డ్యామ్‌లు, గేట్లు పునర్నిర్మాణం, పాయకరావుపేట వద్ద భూమి, ముఠా ఆనకట్టల నిర్వహణ, గేట్ల మరమ్మతుల కోసం గత ఐదేళ్లుగా జలవనరుల శాఖ అధికారులు ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపినా ఒక్క రూపాయి కూడా నిధులు మంజూరుకాలేదు. మండలంలో సాగునీటి చెరువులు, పంట కాలువల్లో తుప్పలు, పూడిక పేరుకుపోయి సాగునీరు సక్రమంగా పారడం లేదు. దీనికి తోడు డివిజన్‌ డ్యామ్‌లకు గేట్లు లేకపోవడంతో అధిక మొత్తంలో నీరు వృథా అవుతూ అవసరమైన సమయాల్లో పంటలకు సాగునీరందక రైతులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. నీటి వృథాను అరికట్టేందుకు రైతులు ఇసుక బస్తాలు, కొబ్బరి మట్టలు, బరకాలు అడ్డుగా వేసుకోవాల్సి వస్తోంది. శివారు భూములకు సాగునీరందే పరిస్థితి లేక వర్షాలపైనే ఆధారపడాల్సి వస్తోంది. ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించి మండలంలోని పలు పంట కాలువల్లో పూడిక, తుప్పలు తొలగించి దెబ్బతిన్న డివిజన్‌ డ్యామ్‌లను పునరుద్ధరించాలని, గేట్లకు మరమ్మతులు చేపట్టాలని రైతులు కోరుతున్నారు. దీనిపై జలవనరుల శాఖ మండల ఏఈ శ్రీరామూర్తి వివరణ కోరగా గత ఐదేళ్లుగా మండలంలో సాగునీటి వనరుల మరమ్మతులకు నిధులు మంజూరుకాక పనులు జరగలేదని తెలిపారు. మండలంలో భూమి, ముఠా చానెళ్ల పరిధిలోని పంట కాలువల అభివృద్ధి, డివిజన్‌ డ్యామ్‌లు, గేట్ల మరమ్మతులు, భూమి, ముఠా ఆనకట్టల నిర్వహణకు రూ.14.5 కోట్లతో రూపొందించిన ప్రతిపాదనలు ప్రభుత్వం వద్ద పెండింగ్‌లో ఉన్నాయన్నారు. ఎన్నికలు ముగిసిన తరువాత నిధులు విడుదలైతే పనులు చేపడతామని ఆయన తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 01:09 AM