Share News

శరవేగంగా ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు

ABN , Publish Date - May 02 , 2024 | 01:07 AM

మండలంలోని బాలారం గ్రామంలో కొయ్యూరు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా పనులు వేగవంతం చేశారు.

శరవేగంగా ఏకలవ్య పాఠశాల భవన నిర్మాణాలు
ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల బాలికల వసతి గృహ భవన నిర్మాణ పనులు జరుగుతున్న దృశ్యం

వచ్చే ఏడాది జూన్‌కు అప్పగించేలా ముమ్మరంగా పనులు

కొయ్యూరు, మే 1: మండలంలోని బాలారం గ్రామంలో కొయ్యూరు ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల భవన నిర్మాణాలు జోరుగా సాగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి భవన నిర్మాణాలు పూర్తి చేసేందుకు వీలుగా పనులు వేగవంతం చేశారు.

మూడేళ్ల క్రితం మండలానికి ఏకలవ్య మోడల్‌ రెసిడెన్షియల్‌ పాఠశాల మంజూరైన సంగతి తెలిసిందే. పాఠశాల భవన నిర్మాణాలకు వీలుగా బాలారం గ్రామంలో సుమారు 15 ఎకరాల ప్రభుత్వ భూమి కేటాయించారు. భవన నిర్మాణాలకు రెండేళ్ల క్రితమే నిధులు మంజూరైనా పనులు చేపట్టేందుకు కాంట్రాక్టర్లు ముందుకు రాకపోవడంతో జాప్యం జరిగింది. దీనికి తోడు పాఠశాల భవన నిర్మాణాలకు కేటాయించిన భూమి కొన్ని దశాబ్దాలుగా బాలారం గ్రామానికి చెందిన వారి సాగులో ఉండడంతో భూ వివాదంతో మరికొంత జాప్యం జరిగింది. దీంతో బాలికలకు చింతపల్లి ఏకలవ్య పాఠశాలలో, బాలురకు కొయ్యూరు గురుకుల పాఠశాల ఆవరణలో రెండు గదుల్లోనూ గత విద్యా సంవత్సరం వరకు తరగతులు నిర్వహిస్తూ వచ్చారు. గత విద్యా సంవత్సరంలో విద్యార్థుల సంఖ్య పెరగడంతో వసతి సమస్య ఏర్పడింది. దీంతో విద్యార్థినీ, విద్యార్థులను చింతపల్లి వైటీసీ భవనానికి తరలించి అక్కడ తరగతులు నిర్వహిస్తున్నారు.

చురుగ్గా పనులు

భవన నిర్మాణాలకు అప్పట్లో వేసిన అంచనా వ్యయాన్ని రివైజ్‌ చేసి రూ.32 కోట్ల నిధులను కేటాయించడంతో పనులు చేపట్టేందుకు తిరుపతికి చెందిన సీఎన్‌ఆర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ సంస్థ టెండర్‌ దక్కించుకుంది. గత ఏడాది అక్టోబరులో పనులు ప్రారంభించింది. ఇంజనీరింగ్‌ ప్రాజెక్టు ఇండియా లిమిటెడ్‌కు చెందిన డీజీఎం విశ్వనాథ్‌, ఇండియా నెక్స్ట్‌ ఇంజనీరింగ్‌ కన్సెల్టెంట్‌ సత్యనారాయణ పర్యవేక్షణలో పనులు జరుగుతున్నాయి. వచ్చే ఏడాది జూన్‌ నాటికి నిర్మాణాలు పూర్తి చేసి అప్పగించేలా చర్యలు తీసుకుంటున్నామని ఇంజనీరింగ్‌ కన్సెల్టెంట్‌ సత్యనారాయణ తెలిపారు.

Updated Date - May 02 , 2024 | 01:07 AM