Share News

తాగునీటికి కటకట

ABN , Publish Date - May 02 , 2024 | 01:51 AM

నగరంలో నీటి ఎద్దడి ప్రారంభమైంది.

తాగునీటికి కటకట

నగరంలో ప్రారంభమైన వేసవి ఇక్కట్లు

టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రైవేటు ట్యాంకర్ల నిరీక్షణ

విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):

నగరంలో నీటి ఎద్దడి ప్రారంభమైంది. ఏలేరు, తాటిపూడి, రైవాడ జలాశయాల నుంచి నగరానికి తరలిస్తున్న నీటిని జీవీఎంసీ నీటి సరఫరా విభాగం అధికారులు శుద్ధి చేసి పైప్‌లైన్ల ద్వారా ప్రజలకు సరఫరా చేస్తున్నారు. పైప్‌లైన్‌ సదుపాయం లేని కొండవాలు ప్రాంతాలు, హోటళ్లు, లాడ్జిలు, కొళాయి కనెక్షన్‌ పొందని అపార్టుమెంట్లకు జీవీఎంసీ, ప్రైవేటు ట్యాంకర్ల ద్వారా ద్వారకా నగర్‌లోని టీఎస్‌ఆర్‌ కాంపెక్స్‌లోని రిజర్వాయర్‌ నుంచి సరఫరా చేస్తుంటారు. అయితే వేసవి నేపథ్యంలో నీటి లభ్యత తగ్గడంతో ప్రైవేటు ట్యాంకర్లకు నీరు ఇచ్చే విషయంలో జీవీఎంసీ అధికారులు ఆచితూచి వ్యవహరిస్తున్నారు. నగరంలోని కొళాయిల ద్వారా నీటిని సరఫరా చేయడానికి మొదటి ప్రాధాన్యం ఇస్తున్నారు. అనంతరం టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌లో మిగిలివున్న నీటిని జీవీఎంసీ ట్యాంకర్లకు నింపి, నిర్దేశిత ప్రాంతాలకు తరలించి ప్రజలకు సరఫరా చేస్తున్నారు. ఆ తర్వాత కూడా నీరు మిగిలి ఉంటేనే హోటళ్లు, లాడ్జీలతోపాటు ప్రైవేటు బుకింగ్‌లకు సరఫరా చేసే ట్యాంకర్లకు అందజేస్తున్నారు.

ప్రతి కిలోలీటర్‌కు ప్రైవేటు ట్యాంకర్లు రూ.40 చొప్పున జీవీఎంసీకి డీడీ రూపంలో చెల్లించాల్సి ఉంటుంది. 1,500 కిలోలీటర్లు సామర్థ్యం కలిగిన 500 ప్రైవేటు ట్యాంకర్లు, వంద కిలోలీటర్లు సామర్థ్యం కలిగిన 1,500 ట్యాంకర్‌ ఆటోలు నిత్యం టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ నుంచి నీటిని సరఫరా చేస్తుంటాయి. అయితే గత రెండు రోజులుగా టీఎస్‌ఆర్‌ రిజర్వాయర్‌లోని పంపుల వద్ద నీటి లభ్యత తగ్గిపోవడంతో ప్రైవేటు ట్యాంకర్లకు నీటిని ఇవ్వడం లేదు. దీంతో ఇక్కట్లు మొదలయ్యాయి. జీవీఎంసీ ట్యాంకర్లకు నింపిన తర్వాతే ప్రైవేటు ట్యాంకర్లకు అందిస్తుండడంతో అన్ని ట్యాంకర్లకు అందే పరిస్థితి కనిపించడం లేదు. దీంతో టీఎస్‌ఆర్‌ కాంప్లెక్స్‌ వద్ద ప్రైవేటు ట్యాంకర్లు బారులు తీరిపోతున్నాయి. మంగళ, బుధవారాల్లో టీఎస్‌ఆర్‌ కాంపెక్స్‌ నుంచి వీఎంఆర్‌డీఏ సెంట్రల్‌ పార్క్‌ సమీపంలోని తెన్నేటి విశ్వనాథం సర్కిల్‌ వరకూ రోడ్డుపై బారులు తీరి నిలిచిపోయాయి.

Updated Date - May 02 , 2024 | 01:51 AM