Share News

చరిత్ర పుటల్లోకి ‘చింతపల్లి’

ABN , Publish Date - May 02 , 2024 | 01:35 AM

ఏజెన్సీలో చింతపల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది.

చరిత్ర పుటల్లోకి ‘చింతపల్లి’

మన్యానికి మకుటం

బ్రిటీష్‌ కాలంలోనే ప్రాచుర్యం

అల్లూరి ఉద్యమానికి కేంద్రం

1962లో అసెంబ్లీ నియోజకవర్గంగా ఏర్పాటు

2004 వరకూ కొనసాగిన సెగ్మెంట్‌

పునర్విభజనలో భాగంగా 2008లో ‘పాడేరు’లో విలీనం

1962-2004 మధ్యకాలంలో పదిసార్లు ఎన్నికలు

కాంగ్రెస్‌ పార్టీ ఐదు పర్యాయాలు, టీడీపీ మూడుసార్లు, సీపీఐ రెండుసార్లు విజయం

మరోమారు నియోజకవర్గంగా ఏర్పడుతుందని స్థానికుల ఆశాభావం

చింతపల్లి, మే 1:

ఏజెన్సీలో చింతపల్లి ప్రాంతానికి ఒక ప్రత్యేకత ఉంది. బ్రిటీష్‌ వారి హయాంలో విప్లవ జ్యోతి అల్లూరి సీతారామరాజు చింతపల్లి కేంద్రంగానే తన ఉద్యమాన్ని నిర్మించారు. తొలి సాయుధ పోరాటంలో భాగంగా చింతపల్లి పోలీస్‌ స్టేషన్‌పై దాడిచేశారు. తుపాకులను ఎత్తుకెళ్లడం అప్పట్లో దేశవ్యాప్తంగా సంచలమైంది. కాగా స్వాతంత్ర్యానంతరం 1953లో ఆంధ్ర రాష్ట్రం, 1956లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రం ఏర్పడిన విషయం తెలిసింది. అప్పటికి చింతపల్లి కేంద్రంగా అసెంబ్లీ నియోజకవర్గం లేదు. 1961లో చేపట్టిన డీలిమిటేషన్‌ అనంతరం చింతపల్లి కేంద్రంగా 1962లో శాసనసభా నియోజకవర్గం ఏర్పాటైంది. దాదాపు 55 ఏళ్ల తరువాత 2007-08లో జరిగిన నియోజకవర్గాల పునర్విభజనలో చింతపల్లిని రద్దు చేశారు. 2004లో జరిగిన ఎన్నికలే చివరివి. 2009 ఎన్నికల నుంచి చింతపల్లి ప్రాంతం పాడేరు నియోజకవర్గంలో కొనసాగుతున్నది. కాగా చింతపల్లి నియోజకవర్గంగా ఉండగా 1962 నుంచి 2004 వరకు మొత్తం పదిసార్లు ఎన్నికలు జరిగాయి. కాంగ్రెస్‌ పార్టీ అత్యధికంగా ఐదు పర్యాయాలు గెలుపొందింది. టీడీపీ మూడుసార్లు, సీపీఐ రెండుసార్లు విజయం సాధించాయి. టీడీపీ ఆవిర్భావం తరువాత ఈ స్థానానికి ఆరుసార్లు ఎన్నికలు జరగ్గా...కాంగ్రెస్‌ పార్టీ ఒక్కసారి మాత్రమే గెలుపొందడం గమనార్హం. 1994లో పొత్తులో భాగంగా టీడీపీ ఈ సీటును సీపీఐకి విడిచిపెట్టింది. లేకపోతే ఆ ఎన్నికల్లో టీడీపీ పోటీ చేసి వుంటే కచ్చితంగా విజయం సాఽధించి వుండేదని ఆ పార్టీ సీనియర్‌ నాయకులు అభిప్రాయపడుతున్నారు.

1962 నుంచి 2004 వరకు జరిగిన ఎన్నికల్లో చింతపల్లి నుంచి గెలుపొందిన అభ్యర్థులు, ఓడిన సమీప ప్రత్యర్థులు, ఇతర వివరాలు...

- తొలిసారి 1962లో జరిగిన ఎన్నికల్లో 11,807 ఓట్లు పోలయ్యాయి. లంబసింగి గ్రామానికి చెందిన దేపూరు కొండలరావు కాంగ్రెస్‌ పార్టీ తరపున పోటీ చేసి, స్వంతంత్ర పార్టీ అభ్యర్థి కిల్లు మల్లంనాయుడుపై 834 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1967లో జరిగిన ఎన్నికల్లో 32,141 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్‌ అభ్యర్థి దేపూరు కొండలరావు...స్వతంత్ర పార్టీ అభ్యర్థి పీబీ పడాల్‌పై 4,850 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1972 ఎన్నికల్లో 30,132 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్‌ అభ్యర్థి ఇంగువ రామన్నపడాల్‌, ఇండిపెండెంట్‌ అభ్యర్థి మత్స్యరాస మత్స్యరాజుపై 11,772 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1978లో జరిగిన ఎన్నికల్లో 47,997 ఓట్లు పోలవ్వగా కాంగ్రెస్‌ అభ్యర్థి దేపూరు కొండలరావు, శరభన్నపాలెం గ్రామానికి చెందిన కాంగ్రెస్‌ (ఐ) అభ్యర్థి లోకుల కన్నాలుపై 3,656 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

తెలుగుదేశం ఆవిర్భావంతో కాంగ్రెస్‌ హవాకు బ్రేకులు

తెలుగుదేశం పార్టీ ఆవిర్భావంతో చింతపల్లి నియోజకవర్గంలో కాంగ్రెస్‌ పార్టీ హవాకు బ్రేకులు పడ్డాయి. నియోజకవర్గం ఏర్పాటైన తరువాత వరుసగా నాలుగుసార్లు కాంగ్రెస్‌ అభ్యర్థులే ఎమ్మెల్యేలుగా ఎన్నికయ్యారు. 1982లో తెలుగుదేశం పార్టీ ఆవిర్భవించగా, 1983లో జరిగిన ఎన్నికల్లో 47,566 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ తరపున చౌడుపల్లి పంచాయతీకి చెందిన కోరాబు వెంకటరత్నం పోటీ చేసి, కాంగ్రెస్‌ అభ్యర్థి దేపూరు కొండలరావుపై 1,884 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1985లో జరిగిన మధ్యంతర ఎన్నికల్లో 52,489 ఓట్లు పోలయ్యాయి. కొయ్యూరుకు చెందిన మొట్టడం వీర వెంకట సత్యనారాయణ టీడీపీ అభ్యర్థిగా పోటీ చేసి కాంగ్రెస్‌ అభ్యర్థి కంకిపాటి వీరభద్రరావుపై 14,438 ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.

- 1989లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలు, బీజేపీ, జనతాదళ్‌ తదితర పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. పొత్తులో భాగంగా చింతపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. కాంగ్రెస్‌ అభ్యర్థి పసుపులేటి బాలరాజు, సీపీఐ అభ్యర్థి కొర్రు మల్లయ్యపై 1,999 ఓట్ల మెజారిటీతో గెలుపొందారు.

- 1994లో జరిగిన ఎన్నికల్లో తెలుగుదేశం, వామపక్షాలు కూటమిగా ఏర్పడి పోటీ చేశాయి. ఈసారి కూడా చింతపల్లి స్థానాన్ని సీపీఐకి కేటాయించారు. ఈ ఎన్నికల్లో సీపీఐ తొలిసారి గెలుపొందింది. కొయ్యూరు మండలం శరభన్నపాలెం గ్రామానికి చెందిన గొడ్డేటి దేముడు సీపీఐ అభ్యర్థిగా పోటీ చేశారు. మొత్తం 1,05,024 ఓట్లు పోలవ్వగా దేముడుకు 35,257 ఓట్లు, ఇండిపెండెంట్‌గా పోటీ చేసిన మాజీ ఎమ్మెల్యే మొట్టడం వీర వెంకట సత్యనారాయణకు 30,175 ఓట్లు, కాంగ్రెస్‌ నుంచి పోటీ చేసిన సిట్టింగ్‌ ఎమ్మెల్యే పసుపులేటి బాలరాజుకు 23,497 ఓట్లు వచ్చాయి. 5,082 ఓట్ల మెజారిటీతో దేముడు గెలిచారు.

- 1999 ఎన్నికల్లో టీడీపీ, బీజేపీ జతకట్టగా, వామపక్షాలు విడిగా పోటీ చేశాయి. ఆ ఎన్నికల్లో 1,05,024 ఓట్లు పోలయ్యాయి. టీడీపీ అభ్యర్థి మొట్టడం వీర వెంకట సత్యనారాయణకు 41,163 ఓట్లు, సీపీఐ అభ్యర్థి గొడ్డేటి దేముడుకు 32,892 ఓట్లు వచ్చాయి. ఈ ఎన్నికల్లో కాంగ్రెస్‌ పార్టీ బాలరాజుకు కాకుండా కంకిపాటి పద్మకుమారికి టికెట్‌ ఇచ్చింది. దీంతో బాలరాజు ఇండిపెండెంట్‌గా పోటీ చేసి 14,122 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. కాంగ్రెస్‌ పార్టీ నాలుగో స్థానానికి పడిపోయింది.

- 2004లో జరిగిన ఎన్నికల్లో 1,08,530 ఓట్లు పోలయ్యాయి. ఈసారి కాంగ్రెస్‌, వామపక్షాలు ఒక కూటమి (యూపీఏ)గా, టీడీపీ, బీజేపీ మరో కూటమిగా (ఎన్‌డీఏ) పోటీ చేశాయి. పొత్తులో భాగంగా ఈ స్థానం నుంచి సీపీఐ అభ్యర్థి గొడ్డేటి దేముడు పోటీ చేశారు. దీంతో పుసుపులేటి బాలరాజు అసంతృప్తి చెంది, ఇండిపెండెంట్‌గా పోటీ చేశారు. దేముడు 52,705 ఓట్లు సాధించి ఎమ్మెల్యేగా గెలిచారు. బాలరాజు 35,223 ఓట్లతో రెండో స్థానంలో, టీడీపీ అభ్యర్థి చిల్లంగి జ్ఞానేశ్వరి 14,471 ఓట్లతో మూడో స్థానంలో నిలిచారు. 2008లో నియోజకవర్గాల పునర్విభజన జరగడంతో చింతపల్లి నియోజకవర్గాన్ని రద్దు చేసి, ఏజెన్సీలోని మూడు మండలాలను పాడేరు నియోజకవర్గంలో విలీనం చేశారు. దీంతో ఐదున్న దశాబ్దాల చరిత్ర వున్న చింతపల్లి అసెంబ్లీ నియోజకవర్గం కనుమరుగైంది. నియోజకవర్గాల పునర్విభజన జరిగితే చింతపల్లి నియోజకవర్గం మళ్లీ ఏర్పాటు అవుతుందని ఈ ప్రాంతానికి చెందిన వివిధ రాజకీయ పార్టీల నాయకులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 01:36 AM