Share News

బుచ్చెయ్యపేటలో దారుణ హత్య

ABN , Publish Date - May 02 , 2024 | 01:03 AM

బుచ్చెయ్యపేటలో బుధవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై ఈ సంఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

బుచ్చెయ్యపేటలో దారుణ హత్య
హతుడు తాటికొండ అచ్చెంనాయుడు(ఫైల్‌ ఫొటో)

- పండగ రోజు ఇరువురి మధ్య ఘర్షణ

- కక్ష పెంచుకుని నడిరోడ్డుపై కత్తితో దాడి

- సంఘటన స్థలంలోనే వ్యక్తి మృతి

- పోలీస్‌ స్టేషన్‌లో లొంగిపోయిన నిందితుడు

బుచ్చెయ్యపేట, మే 1: బుచ్చెయ్యపేటలో బుధవారం ఉదయం ఓ వ్యక్తి దారుణ హత్యకు గురయ్యాడు. నడిరోడ్డుపై ఈ సంఘటన జరగడంతో స్థానికంగా కలకలం రేగింది. దీనికి సంబంధించి ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపిన వివరాలు ఇలా వున్నాయి.

బుచ్చెయ్యపేటకు చెందిన తాటికొండ అచ్చెంనాయుడు(39), గన్రెడ్డి శ్రీను మంగళవారం కందిపూడిలో అమ్మవారి పండగకు వెళ్లి తిరిగి స్వగ్రామానికి చేరుకున్నారు. ఈ సమయంలో ఇద్దరి మధ్య చోటుచేసుకున్న స్వల్ప వివాదం ఘర్షణకు దారి తీసింది. స్థానికులు ఇద్దరినీ విడదీసి సర్ది చెప్పి పంపించేశారు. అయితే కక్ష పెంచుకున్న శ్రీను బుధవారం ఉదయం 5.30 గంటల సమయంలో గోనె సంచిలో కత్తి పెట్టుకుని బుచ్చెయ్యపేట ప్రధాన రహదారిపై అచ్చెంనాయుడు కోసం మాటువేశాడు. అటుగా బైక్‌పై వెళుతున్న అచ్చెంనాయుడుపై శ్రీను కత్తితో దాడి చేశాడు. అచ్చెంనాయుడు బైక్‌ వదిలి పారిపోవడానికి ప్రయత్నించి కింద పడిపోయాడు. దీంతో అతని మెడ, దవడపై కత్తితో శ్రీను విచక్షణారహితంగా నరికేశాడు. సంఘటన స్థలంలోనే అచ్చెంనాయుడు మృతి చెందాడు. నిందితుడు శ్రీను పోలీస్‌ స్టేషన్‌కి వెళ్లి లొంగిపోయాడు. అచ్చెంనాయుడు హత్యకు గురికావడంతో భార్య, పిల్లలు, బంధువులు కన్నీరు మున్నీరుగా విలపించారు. అచ్చెంనాయుడు కుటుంబ సభ్యులు, బంధువులు పోలీస్‌ స్టేషన్‌కి చేరుకుని నిందితుడు శ్రీనును తమకు అప్పగించాలని ఆందోళనకు దిగారు. కొత్తకోట సీఐ అప్పలనాయుడు వారికి సర్దిచెప్పి పంపించేశారు. మృతుని కుమారుడు పవన్‌కుమార్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నామని ఎస్‌ఐ ఈశ్వరరావు తెలిపారు.

నిలిచిపోయిన బావమరిది నిశ్చితార్థం

అచ్చెంనాయుడు హత్యకు గురికావడంతో అతని బావమరిది నిశ్చితార్థం నిలిచిపోయింది. అచ్చెంనాయుడు అత్తవారి గ్రామం కందిపూడి. అక్కడ బుధవారం తన బావమరిది నిశ్చితార్థం కావడంతో భార్య దుర్గా భవాని, ముగ్గురు పిల్లలు కందిపూడిలోనే ఉన్నారు. నిశ్చితార్థానికి సమీప గ్రామాలకు చెందిన బంధువులు తరలి వచ్చారు. అచ్చెంనాయుడు హత్యకు గురికావడంతో నిశ్చితార్థం నిలిచిపోయింది.

Updated Date - May 02 , 2024 | 01:03 AM