Share News

క్రీడా ప్రాంగణాలన్నీ ప్రైవేటుకు ధారాదత్తం

ABN , Publish Date - May 02 , 2024 | 01:42 AM

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జీవీఎంసీ పరిధిలోని క్రీడా ప్రాంగణాలన్నింటినీ (స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు) ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వస్తోంది. ఆదాయమే పరమావధిగా, అస్మదీయులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంది.

క్రీడా ప్రాంగణాలన్నీ ప్రైవేటుకు ధారాదత్తం

ఇదే ఐదేళ్లలో వైసీపీ సర్కారు చేసిన ఘనకార్యం

టీడీపీ హయాంలో రూ.4.5 కోట్లతో ఎంవీపీలో స్పోర్ట్స్‌ ఎరీనా నిర్మాణం ప్రారంభం

వైసీపీ అధికారంలోకి వచ్చిన తరువాత నిర్వహణ ప్రైవేటు వ్యక్తులకు అప్పగింత

బీచ్‌రోడ్డులో ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ కూడా అంతే...

స్వర్ణభారతి స్టేడియాన్ని కూడా అప్పగించేందుకు రంగం సిద్ధం

ఎన్నికల కోడ్‌ నేపథ్యంలో పెండింగ్‌

వైసీపీ నేతల అనుచరులకే అప్పగిస్తున్నారని ఆరోపణలు

భారీగా ఫీజులు వసూలు చేస్తున్న నిర్వాహకులు

ఆటలకు దూరమైపోతున్న పేద, మధ్య తరగతి క్రీడాకారులు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

వైఎస్‌ఆర్‌ కాంగ్రెస్‌ పార్టీ ప్రభుత్వం జీవీఎంసీ పరిధిలోని క్రీడా ప్రాంగణాలన్నింటినీ (స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌లు) ప్రైవేటు వ్యక్తులకు కట్టబెడుతూ వస్తోంది. ఆదాయమే పరమావధిగా, అస్మదీయులకు ప్రయోజనం కలిగేలా నిర్ణయాలు తీసుకుంది. కాంట్రాక్టు తీసుకున్న సంస్థలు భారీగా ఫీజులు వసూలు చేస్తుండడంతో ప్రతిభ కలిగిన క్రీడాకారులు స్టేడియంలోకి అడుగుపెట్టలేని పరిస్థితి ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వం, జీవీఎంసీ తీరుపై క్రీడాకారులు తీవ్ర ఆగ్రహంతో ఉన్నారు.

గత టీడీపీ ప్రభుత్వం నగరంలో ప్రపంచస్థాయి ప్రమాణాలతో కూడిన ఇండోర్‌ స్టేడియం నిర్మించాలని నిర్ణయించింది. ఎంవీపీ కాలనీలోని ఏఎస్‌ రాజా కాలేజీ మైదానంలో స్మార్ట్‌సిటీ ప్రాజెక్టు కింద రూ.4.5 కోట్లతో ఇండోర్‌ స్పోర్ట్స్‌ ఎరీనా కాంప్లెక్స్‌ నిర్మాణం ప్రారంభించింది. అందులో బ్యాడ్మింటన్‌, వాలీబాల్‌ కోర్టులు, స్విమ్మింగ్‌పూల్‌ వంటివి ఉంటాయి. స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ నిర్మాణం చివరి దశలో ఉండగా వైసీపీ అధికారంలోకి వచ్చింది. దీంతో నిర్మాణ పనులు ఆలస్యమయ్యాయి. కొన్నాళ్లకు భవన నిర్మాణాన్ని పూర్తిచేసిన తర్వాత జీవీఎంసీ ఆధ్వర్యంలోనే స్టేడియం ఉంటుందని అందరూ భావించారు. అలాగైతే నామమాత్రపు ఫీజుతో అత్యున్నత ప్రమాణాలు కలిగిన స్టేడియంలో సాధన చేసుకోవచ్చునని క్రీడాకారులు ఆశించారు. కానీ వైసీపీ ముఖ్య నేతలకు సన్నిహితుడైన వ్యక్తి కళ్లు స్పోర్ట్స్‌ ఎరీనాపై పడ్డాయి. అంతే రూ.4.5 కోట్ల వ్యయంతో నిర్మించిన స్పోర్ట్స్‌ ఎరీనాను ఆగమేఘాల మీద టెండరు పేరుతో అస్మదీయుడైన వ్యక్తికి లీజుకు అప్పగించారు. లీజుకు దక్కించుకున్న వ్యక్తి అక్కడ సాధన చేసేందుకు భారీగా ఫీజులు నిర్ణయించడంతో సాధారణ, మధ్య తరగతికి చెందిన క్రీడాకారులు అటు వైపు కన్నెత్తి చూసేందుకు కూడా సాహించలేని పరిస్థితి ఏర్పడింది. జాతీయ స్థాయి క్రీడాకారులను తయారుచేసే లక్ష్యంతో నిర్మించిన స్పోర్ట్స్‌ ఎరీనాను చివరకు జీవీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వానికి ఆదాయాన్ని సమకూర్చడానికన్నట్టు మార్చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

అలాగే బీచ్‌రోడ్డులోని ఆక్వా స్పోర్ట్సు కాంప్లెక్స్‌లో రెండు స్విమ్మింగ్‌పూల్స్‌ ఉన్నాయి. వీటిని జీవీఎంసీయే నిర్వహిస్తూ వచ్చింది. పెద్దవారికి నెలకు రూ.200, చిన్నారులకు రూ.వంద చొప్పున ఫీజు తీసుకునేవారు. నామమాత్రపు ఫీజు కావడంతో ఎంతోమంది స్విమ్మింగ్‌లో సాధన చేసేవారు. అక్కడ సాధన చేసిన వారిలో ఎంతోమంది రాష్ట్ర, జాతీయ స్థాయి స్విమ్మింగ్‌ పోటీల్లో బహుమతులు గెలుచుకున్నారు. కరోనా సమయంలో ఆక్వా స్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను మూతపడింది. తర్వాత దాదాపు రూ.2.5 కోట్లు వెచ్చించి ఆక్వాస్పోర్ట్స్‌ కాంప్లెక్స్‌ను ఆధునీకరించారు. ఇది అందుబాటులోకి వస్తే ఎంతోమంది తిరిగి స్విమ్మింగ్‌ సాధన చేసేందుకు అవకాశం ఉంటుందని అందరూ ఆశపడ్డారు. చివరకు ఆక్వాస్పోర్ట్స్‌ ఎరీనా నిర్వహణను ప్రైవేటు వ్యక్తులకు అప్పగించాలని జీవీఎంసీ నిర్ణయించింది. దీనిపై క్రీడాకారులు, క్రీడా సంఘాల నుంచి తీవ్రస్థాయిలో విమర్శలు, అభ్యంతరాలు వ్యక్తమవ్వడంతో అధికారులు కొంతకాలం ఆ ప్రతిపాదనను పెండింగ్‌లో పెట్టారు. తర్వాత ఉదయం, సాయంత్రం నిర్ణీత సమయాల్లో జీవీఎంసీ నిర్ణయించిన ఫీజులు, తర్వాత సమయాల్లో నిర్వాహకులకు నచ్చిన మొత్తంలో ఫీజులు వసూలు చేసుకునేలా వెసులుబాటు కల్పిస్తూ ప్రైవేటుకు అప్పగించేశారు.

మద్దిలపాలెం సమీపంలోని స్వర్ణభారతి ఇండోర్‌ స్టేడియం పరిస్థితి కూడా అలాగే తయారైంది. దశాబ్దాలుగా స్టేడియంలో వందలాది మంది ఉదయం, సాయంత్రం వేళ బ్యాడ్మింటన్‌, కిక్‌బాక్సింగ్‌ సాఽధన చేస్తుంటారు. వీరిలో పిల్లలతోపాటు పెద్దలు కూడా ఉంటారు. పిల్లలకు నిపుణులైన కోచ్‌లు మెలకువలు నేర్పుతూ వారిని ఉత్తమ క్రీడాకారులుగా తయారుచేస్తున్నారు. వీరంతా ఏడాదికి రూ.వెయ్యి చొప్పున జీవీఎంసీకి ఫీజు చెల్లిస్తున్నారు. అయితే నగర నడిబొడ్డున ఉండడం, స్టేడియంలో ఓపెన్‌స్పేస్‌ కూడా ఉండడంతో కొంతమంది ప్రైవేటు వ్యక్తుల కన్ను పడింది. స్టేడియం నిర్వహణను దక్కించుకుంటే భారీగా సంపాదించవచ్చునని భావించారు. దీంతో స్టేడియాన్ని ఆధునికీకరించి తమకు లీజుకు అప్పగించాలని జీవీఎంసీ అధికారులను కోరినట్టు సమాచారం. ఈ మేరకు వైసీపీ నేతల నుంచి ఒత్తిడి రావడంతో ఆగమేఘాల మీద స్వర్ణభారతి స్టేడియం ఆధునికీకరణ పనులకు జీవీఎంసీ కౌన్సిల్‌ ఆమోదం తీసుకుని, వెంటనే పనులు మొదలుపెట్టేశారు. స్వర్ణభారతి స్టేడియాన్ని ప్రైవేటు వ్యక్తులకు అప్పగించబోతున్నారనే ప్రచారం జరగడంతో అబ్బే ఇప్పట్లో అలాంటి ఆలోచన లేదంటూ అధికారులు ప్రకటన జారీచేశారు. కానీ ప్రైవేటుకు అప్పగించే ప్రయత్నాలు జరుగుతుండగానే ఎన్నికల కోడ్‌ అమలులోకి వచ్చింది. దీంతో స్టేడియం నిర్వహణపై నిర్ణయం వాయిదా పడిందనే అభిప్రాయం క్రీడా సంఘాల నుంచి వ్యక్తమవుతోంది. నగరంలో క్రీడాకారులను తయారుచేసేందుకు, ప్రతిభ కలిగిన వారికి ప్రోత్సాహం ఇచ్చేందుకు కృషిచేయాల్సిన జీవీఎంసీ, రాష్ట్ర ప్రభుత్వం అందుకు విరుద్ధంగా ఆదాయమే ధ్యేయం అన్నట్టు వ్యవహరించడంపై తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 01:42 AM