Share News

భీమిలి అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌

ABN , Publish Date - May 02 , 2024 | 01:39 AM

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ఓ ప్రత్యేకత ఉంది.

భీమిలి అభివృద్ధికి ప్రత్యేక మాస్టర్‌ ప్లాన్‌

విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తాం

ముఖ్యమంత్రిగా చంద్రబాబు విశాఖకు ఎంతో ప్రాధాన్యం ఇచ్చారు

వైసీపీ బస్టాపులు కూడా సరిగా నిర్మించలేకపోయింది

విశాఖలో రాజధాని అవాస్తవం

రుషికొండపై భవనాన్ని ఎలా ఉపయోగించుకోవాలో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం

‘ఆంధ్రజ్యోతి’తో భీమిలి టీడీపీ అభ్యర్థి గంటా శ్రీనివాసరావు

(విశాఖపట్నం-ఆంధ్రజ్యోతి)

రాజకీయాల్లో గంటా శ్రీనివాసరావుకు ఓ ప్రత్యేకత ఉంది. ఒకసారి ఏదైనా నియోజకవర్గం నుంచి పోటీ చేస్తే రెండోసారి మళ్లీ అక్కడి నుంచి పోటీ చేయరు. ఇరవై ఐదేళ్లుగా రాజకీయాల్లో ఉన్న గంటా ఓసారి అనకాపల్లి ఎంపీగా, నాలుగుసార్లు ఎమ్మెల్యే (చోడవరం, అనకాపల్లి, భీమిలి, విశాఖ ఉత్తరం)గా ఎన్నికయ్యారు. ఇప్పటివరకూ ఆయనకు ఓటమి లేదు. వచ్చే ఎన్నికల్లో ఆనవాయితీగా భిన్నంగా ఆయన రెండోసారి భీమిలి నుంచి పోటీ చేస్తున్నారు. ఈ సందర్భంగా ‘ఆంధ్రజ్యోతి’ ప్రతినిధికి ఇచ్చిన ఇంటర్వ్యూ విశేషాలు...

ప్రశ్న: మీకు టికెట్‌ ఇవ్వకూడదనే ఉద్దేశంతోనే చీపురుపల్లికి వెళ్లమన్నారా?

గంటా: అదంతా దుష్ప్రచారం. విజయనగరం జిల్లాలో పార్టీ పరిస్థితి బాగున్నా లీడ్‌ చేసే నాయకుడు లేరని, అందుకే అక్కడకు వెళ్లాలని చంద్రబాబు చెప్పారు. ఒక జిల్లా నుంచి వేరే జిల్లాకు వెళ్లి పోటీ చేయమన్నారంటే అది ఒక విధంగా ఎలివేషన్‌. అక్కడ కూడా గెలవగలననే పెద్దల నమ్మకం. వారు సర్వేలు కూడా చేయించుకున్నారు. గెలుస్తానని నివేదిక వచ్చింది. అందుకే పట్టుబట్టి వెళ్లమన్నారు.

ప్ర: భీమిలి టికెట్‌కు వారిని ఎలా ఒప్పించారు?

గంటా: చీపురుపల్లి వెళ్లి రావాలంటే 150 కి.మీ. అంత దూరంగా ప్రయాణం కష్టం. అదీ కాకుండా చాలా తక్కువ సమయం ఉంది. భీమిలిపైన ఇంట్రెస్ట్‌ ఎక్కువగా ఉంది. నా మిత్రులు అందరితో మాట్లాడితే...ఇక్కడి నుంచే పోటీ చేయమన్నారు. భీమిలి నియోజకవర్గ ప్రజలు, నాయకులు కూడా ఆహ్వానించారు. ఇదే విషయమై బాబును, లోకేశ్‌ను నాలుగుసార్లు కలిశా. తప్పదంటే చీపురుపల్లి వెళతానని, లేదంటే భీమిలే ఖరారు చేయాలని కోరా. దాంతో వారు చివరకు నన్నే ప్రకటించారు.

ప్ర: భీమిలికి ఏమి చేయాలని మీ ఆలోచన?

గంటా: దేశంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చిన వారు భీమిలి పరిసరాల్లో సెటిల్‌ అవుతున్నారు. ఇది అది పెద్ద నియోజకవర్గం. 3.6 లక్షల మంది ఓటర్లు ఉన్నారు. హ్యాపినింగ్‌ ప్లేస్‌. విశాఖపట్నం-భోగాపురం విమానాశ్రయాల మధ్య ఉన్న పట్టణం. ఐటీ, టూరిజం, రియల్‌ ఎస్టేట్‌ ఇలా అనేక రంగాల్లో అభివృద్ధి చెందుతోంది. భీమిలి అభివృద్ధికి ఓ విజన్‌ డాక్యుమెంట్‌ రూపొందిస్తాం. అలాగే ప్రత్యేకంగా మాస్టర్‌ ప్లాన్‌ కూడా తయారుచేసి ప్రణాళికాబద్ధంగా అభివృద్ధి చేస్తాం. చిల్లపేటను ట్యాంక్‌ బండ్‌గా మార్చాలని గతంలోనే చంద్రబాబు చెప్పారు.

ప్ర: జగన్మోహన్‌రెడ్డి తాను గెలిస్తే విశాఖ నుంచే పరిపాలన అంటున్నారు?

గంటా: విశాఖలో పరిపాలనా రాజదాని అనేది ఒక ట్రాష్‌. మూడు రాజధానుల బిల్లు చెల్లదు. దానిపై న్యాయస్థానంలో కేసులు ఉన్నాయి. అవి తేలకుండా విశాఖను రాజధానిగా మార్చలేరు. ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రులు అంతా ఇదిగో వస్తున్నారు..అదిగో వస్తున్నారని ప్రచారం చేశారు. ఉగాది, దసరా, దీపావళి, సంక్రాంతి ఇలా అన్ని పండుగలు అయిపోయాయి. జగన్‌ విశాఖ రావడం అనేది...గోడపై ‘రేపు’ అని రాసుకోవడం లాంటిదే. ప్రజలను నమ్మించి మోసం చేస్తున్నారు. విశాఖ ప్రశాంత నగరం. పులివెందుల ఫ్యాక్షన్‌, కడప రాజకీయాలు చూసి భయపడిపోతున్నారు.

ప్రశ్న: మీరు గెలిస్తే రుషికొండపై సీఎం క్యాంపు కార్యాలయం ఏమి చేస్తారు?

గంటా: రుషికొండపై టూరిజం గెస్ట్‌హౌస్‌ కూలగొట్టి సీఎం క్యాంప్‌ ఆఫీసు నిర్మించుకున్నారు. ఆ విషయాన్ని వారు ధైర్యంగా చెప్పుకోలేకపోతున్నారు. ఇప్పటికీ పర్యాటక శాఖ కోసమే నిర్మించామని అబద్ధాలు చెబుతున్నారు. దానిని చూడడానికి ఎవరినీ అనుమతించడం లేదు. ఆ భవనంలో ఖరీదైన వస్తువులు ఉన్నాయని, ఆడంబరంగా కట్టించుకున్నారని ప్రచారం జరుగుతోంది. ఎలా ఉపయోగించుకుంటే బాగుంటుందో ఆలోచించి నిర్ణయం తీసుకుంటాం.

ప్రశ్న: భీమిలిలో మిత్రుడైన ముత్తంశెట్టితోనే పోటీ పడుతున్నారు? దీనిపై ఏమంటారు?

గంటా: భీమిలి ప్రజలు బలంగా కోరుకున్నందునే ఇక్కడి నుంచి పోటీ చేస్తున్నా. పోటీ చేసే ప్రతి ఒక్కరూ గెలుస్తామనే విశ్వాసంతోనే ఉంటారు. ఓడిపోతామని ఎవరూ చెప్పరు. నా విజయంపై నాకు ఎలాంటి అనుమానం లేదు. ఎవరైతే బాగుంటుందో భీమిలి ప్రజలే నిర్ణయిస్తారు.

ప్రశ్న: విశాఖ అభివృద్ధిపై?

గంటా: చంద్రబాబు సీఎంగా ఉన్నప్పుడు విశాఖకు చాలా ప్రాధాన్యం ఇచ్చారు. వాస్తవానికి హుద్‌హుద్‌ తరువాత విశాఖ రూపురేఖలే మారిపోయాయి. నగరాన్ని పునర్నిర్మాణం చేశారు. రియల్‌ బూస్టింగ్‌ ఇచ్చింది చంద్రబాబే. అది చూసే విశాఖలో అన్నీ ఉన్నాయి..ఇంకేమీ అవసరం లేదు..ఇక్కడే రాజధాని పెడతాం అని జగన్‌ అంటున్నారు. వైసీపీ బస్టాపులు కూడా సరిగ్గా నిర్మించలేకపోయింది. అదీ వారి ఘనత.

Updated Date - May 02 , 2024 | 01:39 AM