Share News

నాడు కుగ్రామం... నేడు మహా నగరం

ABN , Publish Date - May 02 , 2024 | 01:43 AM

విశాఖపట్నం ఒకప్పుడు అతిచిన్న మత్స్యకార పల్లె. కుగ్రామంగా ప్రస్థానం ప్రారంభమయింది.

నాడు కుగ్రామం... నేడు మహా నగరం

ఊహించని స్థాయిలో విస్తరించిన విశాఖ

కేవలం ఒక్క నియోజకవర్గం నుంచి ఐదింటికి పెరిగిన వైనం

68 వేల నుంచి 17 లక్షలకు పెరిగిన నగర ఓటర్లు

(ఆంధ్రజ్యోతి, విశాఖపట్నం)

విశాఖపట్నం ఒకప్పుడు అతిచిన్న మత్స్యకార పల్లె. కుగ్రామంగా ప్రస్థానం ప్రారంభమయింది. అయితే సుమారు డెభ్బై ఎనభై ఏళ్లలో ఎవరూ ఊహించని స్థాయిలో నగరం విస్తరించింది. స్వాతంత్ర్యానంతరం జరిగిన తొలి సాధారణ ఎన్నికల్లో విశాఖపట్నం మొత్తం ఒక్కటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. దేశంలో తొలిసారిగా 1952 సాధారణ ఎన్నికలు జరిగాయి. ఈ ఎన్నికల్లో విశాఖపట్నం అసెంబ్లీ ఓటర్ల సంఖ్య కేవలం 68,282 మంది మాత్రమే. కానీ నగరం విస్తరించిన సందర్భంలో నగరంలో ఐదు అసెంబ్లీ నియోజకవర్గాలు, శివారు ప్రాంతాలతో కలిసి మరో రెండు నియోజకవర్గాలు ఏర్పడ్డాయి.

విశాఖ నగర ఓటర్ల సంఖ్య ప్రస్తుతం 17 లక్షలకు చేరింది. జిల్లా ఓటర్ల సంఖ్య 20 లక్షల మార్కుల దాటింది. ఇందులో ఆనందపురం, పద్మనాభం, భీమిలి గ్రామీణం, సబ్బవరం, పరవాడ ప్రాంతాల్లో రమారమి మూడు లక్షల వరకు ఓటర్లున్నారు. కేవలం 68 వేల ఓటర్ల నుంచి విశాఖపట్నం 20 లక్షల ఓటర్లకు విస్తరించిందంటే నగరం ఏస్థాయిలో విస్తరించిందో అర్ధమవుతుంది.

ఉమ్మడి మద్రాసు రాష్ట్రంలో ఉండగా జరిగిన 1952 మొదటి ఎన్నికలలో (27-3-1952) విశాఖ ఒకటే అసెంబ్లీ నియోజకవర్గంగా ఉండేది. ఆ ఎన్నికల్లో ఓటర్లసంఖ్య కేవలం 68,282. ఈ ఎన్నికల్లో విశాఖ అసెంబ్లీ నుంచి శాసనసభ్యుడిగా ప్రముఖ నేత తెన్నేటి విశ్వనాఽఽథం ఎన్నికైౖ రికార్డు సృష్టించారు. అంటే విశాఖపట్నం వరకు చూస్తే తొలి శాసనసభ్యుడు ఆయనే. తరువాత విశాఖ విస్తరించే క్రమంలో 1955 మధ్యంతర ఎన్నికలలో విశాఖతోపాటు కణితి (నగరంలో కణిత బ్యాలెన్సింగ్‌ రిజర్వాయర్‌ నిర్మించిన ప్రాంతం) కేంద్రంగా రెండో అసెంబ్లీ నియోజకవర్గం ఏర్పాటుచేశారు. దీంతో విశాఖ అసెంబ్లీ సెగ్మెంట్‌లో ఓటర్ల సంఖ్య 58,132 మందికి తగ్గారు. రాష్ట్రవ్యాప్తంగా కొత్తగా నియోజకవర్గాలు ఏర్పాటుచేసిన క్రమంలో విశాఖ క్రమసంఖ్య 23. తొలి సార్వత్రిక ఎన్నికల్లో రాష్ట్రంలో అసెంబ్లీ నియోజకవర్గాల నంబరులో విశాఖ అసెంబ్లీ క్రమసంఖ్య 19. ఇదిలావుండగా 1962లో జరిగిన మూడో సార్వత్రిక ఎన్నికల్లో విశాఖ అసెంబ్లీ ఓటర్ల సంఖ్య 71,794కు పెరిగింది. అక్కడి నుంచి విశాఖ నగరంలో పెరిగిన జనాభా మేరకు ఓటర్ల సంఖ్య పెరుగుతూ వచ్చింది. ఈ క్రమంలో 1967 ఎన్నికల సమయానికి కణితి అసెంబ్లీని రద్దుచేసి విశాఖ-1, విశాఖ -2 రెండు సెగ్మెంట్లుగా ఏర్పాటుచేశారు. ఆ తరువాత 2004 వరకు రెండు సెగ్మెంట్లుగా కొనసాగాయి. 2004లో విశాఖ-1లో 1,27,044, విశాఖ-2లో ఓటర్ల సంఖ్య 4,03,262కు పెరిగింది. తరువాత నియోజకవర్గాల పునరవ్యవస్థీకరణ చేసే క్రమంలో 2009లో విశాఖ తూర్పు, దక్షిణ, ఉత్తర, పశ్చిమ, గాజువాక నియోజకవర్గాలు పూర్తిగా నగర పరిధిలో ఉండగా, భీమిలి, పెందుర్తి నియోజకవర్గాల్లో అత్యధిక ప్రాంతాలు నగర పరిధిలోనివే ఉన్నాయి.

Updated Date - May 02 , 2024 | 01:43 AM