Share News

కార్మికులకూ వంచనే

ABN , Publish Date - May 01 , 2024 | 12:31 AM

మే డే.. అంటే కార్మికులకు పండుగ దినం. కార్మికుల శ్రమ, వారి అంకితభావం గుర్తించేలా.. ఏటా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు. కాగా.. వైసీపీ పాలనలో కార్మికుల హక్కుల కాలరాయడం.. శ్రమదోపిడీకి పాల్పడడం.. ఉపాధి అవకాశాలు లేక.. కార్మికుల్లో సంతోషం కరువవుతోంది.

కార్మికులకూ వంచనే

- సంక్షేమాన్ని విస్మరించిన వైసీపీ ప్రభుత్వం

- సమస్యలపై పోరాడితే.. గొంతు నొక్కిన వైనం

- సీఎం వైఎస్‌ జగన్‌ హామీలకు తిలోదకాలు

(ఆమదాలవలస/రణస్థలం)

మే డే.. అంటే కార్మికులకు పండుగ దినం. కార్మికుల శ్రమ, వారి అంకితభావం గుర్తించేలా.. ఏటా మే ఒకటో తేదీన కార్మిక దినోత్సవం నిర్వహిస్తారు. కాగా.. వైసీపీ పాలనలో కార్మికుల హక్కుల కాలరాయడం.. శ్రమదోపిడీకి పాల్పడడం.. ఉపాధి అవకాశాలు లేక.. కార్మికుల్లో సంతోషం కరువవుతోంది. హక్కుల కోసం ప్రశ్నిస్తే.. గొంతునొక్కడం పరిపాటిగా మారింది. వైసీపీ ప్రభుత్వం కార్మికుల సంక్షేమాన్ని విస్మరించిందనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ఓవైపు పరిశ్రమలు లేవు. మరోవైపు సిమెంట్‌, ఇసుక, ఐరన్‌ ధరలు భారీగా పెంచేయడంతో భవన నిర్మాణ రంగం కుదేలైంది. దీంతో కార్మికులు ఉపాధి కోసం వలసబాట పట్టాల్సిన దుస్థితి నెలకొంది. గత ఎన్నికల ముందు పాదయాత్ర సమయంలో వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి కార్మికులకు కల్లబొల్లి కబుర్లు చెప్పారు. తాము అధికారంలోకి వస్తే ‘సమాన పనికి సమాన వేతనం అందజేస్తాం. ఉద్యోగ భద్రత కల్పిస్తాం. వేలాది మందికి ఉపాధి కల్పించేలా పరిశ్రమలు ఏర్పాటు చేస్తాం. సమస్యలను పరిష్కరిస్తాం’ అంటూ హామీలిచ్చారు. కార్మికుల ఓట్లతో అధికారాన్ని జేజిక్కించుకున్నారు. కానీ అధికారంలోకి వచ్చాక ఆ హామీలేవీ సక్రమంగా నెరవేర్చలేదు. ఈ ఐదేళ్లలో కొత్త పరిశ్రమలు రాకపోగా.. ఉన్న పరిశ్రమలు కొన్ని మూతపడ్డాయి. కార్మికుల బతుకులు రోడ్డునపడ్డాయి. అలాగే పారిశుధ్య కార్మికులను సైతం పట్టించుకున్న దాఖలాలు లేవు. హామీల అమలు, సమస్యల పరిష్కారం కోసం వారు సమ్మెబాట పట్టగా.. వైసీపీ ప్రభుత్వం ఉక్కుపాదం మోపింది.

- కనీస సౌకర్యాలు లేవు

జిల్లాలో అసంఘటిత రంగ కార్మికులు సుమారు లక్ష మంది ఉన్నారు. వ్యవసాయ, భవన నిర్మాణం, చేనేత, ఉపాధిహామీ వేతనదారులు, చేతివృత్తుల వారు, హమాలీలు తదితరులు ఈ కోవలోకి వస్తారు. కార్మిక శాఖ గుర్తించింది మాత్రం 25వేల లోపే. వీరికి ప్రత్యేక సంక్షేమ పథకాల మాట దేవుడెరుగు. కనీసం సౌకర్యాలు కూడా అందడం లేదు. ఇతర సంక్షేమ పథకాలతో ముడిపెట్టి, నిధులను మళ్లిస్తున్నారు. రణస్థలం మండలం పైడిభీమవరంలో సుమారు 15 పరిశ్రమలు ఉన్నాయి. సుమారు 18వేల కార్మికులు పనిచేస్తున్నారు. వీరంతా అరకొర సౌకర్యాలతో ఇబ్బందులు పడుతున్నారు. ఈజ్‌ ఆఫ్‌ డూయింగ్‌ బిజినెస్‌ పేరుతో కార్మిక శాఖ అధికారాలకు ప్రభుత్వం కత్తెర వేసింది. ప్రైవేటు యాజమాన్యాలకు మితిమీరిన మినహాయింపులు ఇచ్చారు. దీంతో ప్రైవేటు కంపెనీలు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తున్నాయి. రాష్ట్ర పరిశ్రమల శాఖ కమిషనర్‌ అనుమతి లేనిదే కిందిస్థాయి అధికారి పరిశ్రమలను తనిఖీ చేయలేని పరిస్థితి ఉండడంతో వారు ఆడిందే ఆట పాడిందే పాట అన్న చందంగా పరిస్థితి ఉంది. దీంతో కార్మిక చట్టాలు అమలుకావడం లేదు. కార్మిక రక్షణ లేకుండా పోతోంది. అలాగే నిబంధనల మేరకు పరిశ్రమల యాజమాన్యాలు స్థానికులకు ఉపాధి అవకాశాలు కల్పించడం లేదని పలువురు పేర్కొంటున్నారు.

- ఆ పథకాలకు మంగళం

వైసీపీ ప్రభుత్వం సంక్షేమ పథకాల పేరు చెప్పి.. కార్మికుల పథకాలను నిలిపేసింది. అన్ని ప్రయోజనాలను వైఎస్సార్‌ బీమా, పెళ్లి కానుక, ఆరోగ్యశ్రీ వంటి సాధారణ పథకాలతో ముడిపెట్టి ఆపేసింది. ఫలితంగా కార్మిక సంక్షేమ పథకాలు పూర్తిగా నిలిచిపోయాయి. గతంలో కార్మిక సంక్షేమ నిధులకు సంబంధించి కార్మిక కుటుంబాల్లో ఎవరికైనా పెళ్లి జరిగితే రూ.20 వేలు, డెలివరికి రూ.20వేలు, ఇంటర్‌, ఆపై చదివిన విద్యార్థులకు ఏడాదికి రూ.10వేల వరకూ స్కాలర్‌షిప్‌లు అందేవి. అనారోగ్యానికి సంబంధించి మేజర్‌ ఆపరేషన్లకు రూ.50వేలు, దీర్ఘకాలిక వ్యాధులు, గుండెజబ్బులు ఉన్న కార్మికులకు ఏడాదికి రూ.20వేలు సాయం అందించేవారు. ఈ ఐదేళ్లలో రాష్ట్రంలో దాదాపు రూ.400 కోట్ల కార్మిక సంక్షేమ నిధిని పక్కదారి పట్టించినట్టు గణాంకాలు చెబుతున్నాయి.

- తెరచుకోని చక్కెర కర్మాగారం

ఆమదాలవలస నియోజకవర్గంలోని చక్కెర కర్మాగారం, కాన్‌కాస్ట్‌ ఫ్యాక్టరీ జూట్‌మిల్లులు, పలు చిన్న తరహా పరిశ్రమలు వివిధ కారణాలతో మూతపడ్డాయి. వేలాది మంది కార్మిక కుటుంబాలు ఉపాధి లేక అల్లాడిపోతున్నాయి. ఆమదాలవలసలో దశాబ్దాల చరిత్ర కలిగిన చక్కెర కర్మాగారం ఒకప్పుడు సుమారు 700మంది ఉద్యోగులు, కార్మికులకు ఉపాధి కల్పించేది. నష్టాల కారణంగా 2004లో ఈ కర్మాగారం మూతపడడంతో రైతులకు, కార్మికులకు ఇబ్బందులు ఎదురవుతున్నాయి. గతంలో బెంగళూరులో ఓ ప్రైవేటు సంస్థకు ఈ కర్మాగారాన్ని విక్రయించారు. కొందరు షేర్‌హోల్డర్లు న్యాయస్థానాన్ని ఆశ్రయించారు. కర్మాగారాన్ని సహకార సంఘాలు నడిపించాలని కోర్టు తీర్పు ఇచ్చింది. కానీ పరిశ్రమ మాత్రం తెరచుకోలేదు. ఐదేళ్లకోసారి ఎన్నికల వేళ.. ఈ కర్మాగారాన్ని తెరిపిస్తామని నాయకులు హామీలిస్తున్నారు. కానీ, ఎన్నికల తర్వాత దీని ఊసే మరచిపోతున్నారు. 2019లో ఆమదాలవలసలో పాదయాత్ర చేపట్టిన వైఎస్‌ జగన్మోహన్‌రెడ్డి.. తాము అధికారంలోకి వచ్చిన నెలరోజుల్లో చక్కెర కర్మాగారాన్ని తెరిపిస్తామని హామీ ఇచ్చారు. కానీ, నేటికీ హామీ నెరవేరలేదని రైతులు, కార్మికులు వాపోతున్నారు.

- మూతపడిన మెట్‌కోర్‌ ఎల్లాయిస్‌ పరిశ్రమ

టెక్కలి : టెక్కలి డివిజన్‌ కేంద్రం రావివలసలో 1989లో శారద ఫెర్రో ఎల్లాయిస్‌ పరిశ్రమను స్థాపించారు. ఈ పరిశ్రమలను కొన్నాళ్లు జీఎంఆర్‌, ఆ తర్వాత మెట్‌కోర్‌ ఎల్లాయిస్‌ లిమిటెడ్‌ సంస్థ నడిపించింది. మెట్‌కోర్‌ ఎల్లాయిస్‌ పరిశ్రమ నష్టాల్లో ఉందంటూ అప్పటి యాజమాన్యం లాకౌట్‌ ప్రకటించింది. దీంతో రెగ్యులర్‌, కాంట్రాక్ట్‌ పద్ధతిలో పనిచేసే సుమారు 700 మంది కార్మికులు ఉపాధి కోల్పోయామంటూ రోడ్డెక్కారు. సీఎం జగన్మోహన్‌రెడ్డి 2019 ఎన్నికలకు ముందు పాదయాత్రలో భాగంగా ఆ ప్రాంతంలో పర్యటించగా.. కార్మికులకు తమ సమస్యను వివరించారు. తాను అధికారంలోకి వస్తే పరిశ్రమను తెరిపించి కార్మికులకు ఉపాధి కల్పిస్తానని జగన్‌ అప్పట్లో హామీ ఇచ్చారు. ఈ మేరకు 2021 డిసెంబరు 1న ముంబైకి చెందిన అబిజిత్‌ అనే పారిశ్రామికవేత్త ఈ పరిశ్రమను తెరిచి కొద్దిరోజులు నడిపించారు. తర్వాత చడీచప్పుడు లేకుండా పరిశ్రమ మూసివేశారు. దీంతో కార్మికులంతా మళ్లీ ఆందోళన బాట పట్టారు. బకాయిలు చెల్లిస్తూ.. పరిశ్రమ తెరిపించి ఉపాధి కల్పించాలని డిమాండ్‌ చేశారు. అయినా ప్రజాప్రతినిధులు, అధికారులు పట్టించుకోవడం లేదని వాపోతున్నారు. ఉపాధి లేక ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్నామని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పరిశ్రమ తెరిపించి.. కార్మికులకు ఉపాధి కల్పిస్తామన్న సీఎం జగన్‌ హామీ గాలిలో కలిసిపోయిందని ఆరోపిస్తున్నారు.

ఉపాధి కోసం ఎదురుచూస్తున్నా

వైసీపీ పాలనలో ఉద్యోగాలు లేవు. ఆర్టీసీ అద్దె బస్సు డ్రైవర్‌గా పనిచేస్తున్నాను. గత ఐదేళ్లలో ఆర్టీసీలో ఎటువంటి నియామకాలు చేపట్టలేదు. మెరుగైన ఉపాధి అవకాశాలు కోసం ఎదురుచూస్తున్నాను.

- మండ వెంకటరావు, నిరుద్యోగి, నందికొండ కాలనీ, సరుబుజ్జిలి

...........................

కార్మికులకు ఇబ్బందులే

వైసీపీ పాలనలో ఇసుక కొరతకు భవన నిర్మాణ రంగ కార్మికులకు ఉపాధి లేక ఇబ్బందులు పడ్డారు. టీడీపీ హయాంలో భవన నిర్మాణ కార్మికులకు బీమా వర్తించేది. ఉచిత ఇసుక కారణంగా ఉపాధి అవకాశాలు పుష్కలంగా ఉండేవి. ప్రస్తుతం ఆ పరిస్థితి లేదు.

- ముంజి లక్ష్మీనారాయణ, సరుబుజ్జిలి

...........................

బలవంతపు రిటైర్మెంట్‌ ఆపాలి

30 ఏళ్లు సర్వీసు పూర్తయిందని కార్మికులకు బలవంతపు రిటైర్మెంట్‌ చేయిస్తున్నారు. దీనివల్ల ఇప్పటివరకూ 60 మంది కార్మికులు వీధిన పడ్డారు. 12 ఏళ్ల సర్వీసు ఉన్నా తొలగించడం అన్యాయం. 58 ఏళ్లు పూర్తయితేనే రిటైర్మెంట్‌ చేయాలని జాయింట్‌ కమిషన్‌ ఆఫ్‌ లేబర్‌ ఆదేశాలు ఉన్నాయి. ఈ మేరకు బలవంతపు రిటైర్మెంట్‌లు నిలిపేయాలి.

- సీహెచ్‌ అమ్మన్నాయుడు, సీటూ నాయకుడు

...........................

స్థానికులకు ఉపాధి కల్పించాలి

స్థానికంగా పరిశ్రమలు ఉన్నప్పటికీ పూర్తిస్థాయిలో స్థానిక యువతకు ఉపాధి దొరకడం లేదు. పరిశ్రమల్లో పనిచేసేందుకు పూర్తి స్థాయి అర్హత ఉన్నా.. యవతీ, యువకులకు ఉపాధి ఉండడం లేదు. 75శాతం స్థానిక ఉపాధి ఎక్కడా అమలు కాలేదు. చాలీచాలని జీతాలతో కార్మికులు దుర్భరమైన జీవితాలు వెల్లబుచ్చుతున్నారు.

- పి.తేజేశ్వరరావు, సీఐటీయూ నాయకుడు

Updated Date - May 01 , 2024 | 12:31 AM