Share News

మంత్రి స్వగ్రామంలో వైసీపీ దౌర్జన్యం

ABN , Publish Date - May 01 , 2024 | 11:50 PM

మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం.. దేవునల్తాడలో టీడీపీ నేతల ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక టీడీపీ, జనసేన కార్యకర్తలు వారి ప్రయత్నాలను తిప్పికొట్టడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకుంది.

మంత్రి స్వగ్రామంలో వైసీపీ దౌర్జన్యం
మాట్లాడుతున్న ఎంపీ రామ్మోన్నాయుడు.. ఇన్‌సెట్‌లో ప్రచారిన్న అడ్డుకునేందుకు యత్నిస్తున్న వైసీపీ శ్రేణులు

- టీడీపీ ప్రచారాన్ని అడ్డుకునేందుకు యత్నం

- తిప్పికొట్టిన టీడీపీ, జనసేన కార్యకర్తలు

వజ్రపుకొత్తూరు, మే 1: మంత్రి సీదిరి అప్పలరాజు స్వగ్రామం.. దేవునల్తాడలో టీడీపీ నేతల ఎన్నికల ప్రచారాన్ని వైసీపీ శ్రేణులు అడ్డుకునే ప్రయత్నం చేశారు. అయితే స్థానిక టీడీపీ, జనసేన కార్యకర్తలు వారి ప్రయత్నాలను తిప్పికొట్టడంతో ఇరువర్గాల మధ్య తోపులాట చేసుకుంది. గ్రామ పెద్దల జోక్యంతో పరిస్థితి సద్దుమణిగింది. వివరాల్లోకి వెళితే.. వజ్రపుకొత్తూరు మండలం దేవునల్తాడలో బుధవారం ఎంపీ కింజరాపు రామ్మోహన్‌నాయుడు, పలాస టీడీపీ ఎమ్మెల్యే అభ్యర్థి గౌతు శిరీష ఎన్నికల ప్రచారం నిర్వహించారు. ముందుగా గ్రామంలోని శివాలయం, పెద్దతల్లి ఆలయాల్లో పూజలు చేశారు. అనంతరం ప్రచార రథంపై వివిధ కూడళ్లలో ప్రసంగించారు. చివరకు బస్టాండ్‌ వద్దకు ప్రచారరథం చేరుకోగా.. వైసీపీ శ్రేణులు అక్కడకు చేరుకుని.. ప్రచారాన్ని అడ్డుకునేందుకు ప్రయత్నించారు. పెద్ద పెద్దగా కేకలు వేస్తూ.. ప్రచార ర్యాలీ మధ్యలోకి చొరబడ్డారు. దీనిని గమనించిన ఎంపీ రామ్మోహన్‌నాయుడు తాము ఎన్నికల ప్రచారానికి వచ్చామని, గొడవలకు రాలేదన్నారు. మీ పార్టీ నాయకులు కూడా ఎక్కడైనా ప్రచారం చేసుకోవచ్చని స్పష్టం చేశారు. అయినా వైసీపీ శ్రేణులు తగ్గకపోవడంతో.. స్థానిక టీడీపీ, జనసేన కార్యకర్తలు వారిని అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగ్గా.. ఉద్రిక్త పరిస్థితి నెలకొంది. గ్రామపెద్దలు కలుగజేసుకుని వర్గాలకు నచ్చజెప్పడంతో పరిస్థితి సద్దుమణిగింది. ఈ ఘటనపై పోలీసులు ఫిర్యాదు చేయనున్నట్టు టీడీపీ నాయకులు తెలిపారు. కాగా.. అంతకు ముందు ఎంపీ రామ్మోహన్‌నాయుడు మాట్లాడుతూ సొంత గ్రామానికి వంశధార నీరందించకుండా మంత్రి అప్పలరాజు కుంటిసాకులు చెబుతున్నారని విమర్శించారు. టీడీపీ అధికారంలోకి వచ్చిన వెంటనే వంశధార నీరందిస్తామని తెలిపారు. కార్యక్రమంలో టీడీపీ నాయకులు పుచ్చ ఈశ్వరరావు, కర్ని రమణ, పుచ్చ శోభారాణి, గొరకల వసంతరావు, జనసేన నాయకులు వి.దుర్గారావు, కణితి సురేష్‌, బుల్లోజు శశిభూషణ్‌, అర్సవెళ్లి ఉమామహేశ్వర్రావు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 11:50 PM