Share News

గొంతెండుతోంది!

ABN , Publish Date - May 01 , 2024 | 11:53 PM

మునిసిపాలిటీల్లో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే. ‘తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం. ప్రతి ఇంటికీ నీరందిస్తామ’న్న అధికారపార్టీ నేతల ప్రకటనలు.. ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో.. తాగునీటి పథకాల నిర్వహణ గాలికొదిలేశారు.

గొంతెండుతోంది!
పురుషోత్తపురంలో ట్యాంకర్‌ వద్ద మహిళల పాట్లు

- తాగునీటి కష్టాలు తీరేదెన్నడో?

- మునిసిపాలిటీల్లో అరకొరగా నీటి సరఫరా

- నిధులు మంజూరులో వైసీపీ ప్రభుత్వ నిర్లక్ష్యం

- మహిళలకు తప్పని ఇబ్బందులు

(ఇచ్ఛాపురం/ పలాస/ ఆమదాలవలస)

మునిసిపాలిటీల్లో ఎక్కడ చూసినా తాగునీటి ఇబ్బందులే. ‘తాగునీటి సమస్య పరిష్కారానికి పూర్తిస్థాయిలో చర్యలు చేపడతాం. ప్రతి ఇంటికీ నీరందిస్తామ’న్న అధికారపార్టీ నేతల ప్రకటనలు.. ఆచరణకు నోచుకోవడం లేదు. ఈ ఐదేళ్లలో వైసీపీ ప్రభుత్వం సక్రమంగా నిధులు మంజూరు చేయకపోవడంతో.. తాగునీటి పథకాల నిర్వహణ గాలికొదిలేశారు. కనీసం పైపులైన్ల మరమ్మతులు కూడా చేపట్టలేదు. దీంతో ప్రస్తుత వేసవి వేళ.. మరింతగా తాగునీటి కష్టాలు పడుతున్నామని మహిళలు ఆవేదన చెందుతున్నారు. కుళాయిల ద్వారా సక్రమంగా నీరు రావడం లేదని.. ట్యాంకర్ల ద్వారా మూడు రోజులకోసారి అరకొరగా నీటి సరఫరా చేస్తున్నారని వాపోతున్నారు.

.....................................

ఇచ్ఛాపురం మునిసిపాలిటీలో 23 వార్డులు ఉన్నాయి. 1, 2, 3, 18, 19, 20 వార్డులతో పాటు పలు వీధుల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. 15 ఏళ్ల కిందట మునిసిపాల్టీలో 28వేల జనాభాకు అనుగుణంగా నీటి పథకానికి పైపులైన్లు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం 36వేలకు జనాభా పెరగ్గా.. అదేస్థాయి నీటి వాడకం కూడా అధికమైంది. బాహుదానదిలోని ఊటబావుల నుంచి పంపుహౌస్‌కి నీటి సరఫరా చేసి.. క్లోరినేషన్‌ చేపట్టి.. ఇచ్ఛాపురం రాజావారితోటలోని 8 లక్షల లీటర్ల రిజర్వాయర్‌ ద్వారా మునిసిపాలిటీ ప్రజలకు నీటిని అందిస్తున్నారు. పురుషోత్తపురం, ఏఎస్‌పేటకు(1,2,3 వార్డులు) కుళాయిల ద్వారా నీటిని అందించేందుకు ఏర్పాటు చేసిన పైపులైన్లు నాణ్యతాలోపం కారణంగా లీకులు కావడంతో ట్రైల్‌లోనే వదిలేశారు. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై 5 లక్షల లీటర్ల సామర్ధ్యం గల ట్యాంకు నిర్మించి ఏళ్లు గడుస్తున్నా వినియోగంలో లేకుండా పోయింది. ఈ మూడు వార్డుల పరిధిలో 8 చింతటిక్‌ ట్యాంకర్లు ఏర్పాటు చేయగా.. నెలరోజులకే మూలకు చేరాయి. ఈ నేపథ్యంలో ఈ మూడు వార్డులకు మూడు రోజులకోసారి ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. నీరు లేక ఇబ్బంది పడుతున్నామని, రోజూ నీటిని సరఫరా చేయాలని అధికారులను అడుగుతున్నా.. పట్టించుకోవడం లేదని స్థానికులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వం కూడా కనీసస్థాయిలో నిధులు మంజూరు చేయకపోవడంతో తాగునీటి పథకం నిర్వహణ పనులు సక్రమంగా సాగడం లేదని వాపోతున్నారు.

- రోజు విడిచి రోజు కుళాయి

అధికారపార్టీ నేతలు, మునిసిపల్‌ అధికారుల నిర్లక్ష్యంతో ప్రజలకు తాగునీటి కష్టాలు తప్పడం లేదు. కుళాయిల ద్వారా రోజు విడిచి రోజు.. అదీ గంటపాటు మాత్రమే నీటిని సరఫరా చేస్తున్నారు. మునిసిపల్‌ చైర్‌పర్సన్‌ ఉన్న బెల్లుపడ గ్రామంలో సుమారుగా ఏడు వీధులకు పూర్తిగా కొలాయిలు ద్వారా నీరు రావడం లేదు. దీంతో దూరప్రాంతంలో ఉన్న బావుల నుంచి నీటిని తెచ్చుకునేందుకు అవస్థలు పడుతున్నారు. 18, 19, 20 వార్డుల ప్రజలు కూడా తాగునీటి ఇబ్బందులతో సతమతమవుతున్నారు.

ఆమదాలవలసలోనూ.. దాహం కేకలు

ఆమదాలవలస మునిసిపాలిటీలో 23 వార్డుల్లో శివారు ప్రాంతాల్లో తాగునీటి ఎద్దడి నెలకొంది. ఒకటో వార్డు పరిధిలోని తిమ్మాపురం, జగ్గుశాస్ర్తులపేట, పార్వతీశంపేట, నాలుగో వార్డులోని గేదెలవానిపేట, కసింవలస ఐదోవార్డులోని రెడ్డిపేట, సొట్టవానిపేట, పంతులపేట ప్రజలు తాగునీటి కోసం ఇబ్బందులు పడుతున్నారు. అలాగే ఆరో వార్డులోని నందిగిరిపేట, తురకపేట, పంతులుపేట, తెలగ మన్నయ్యపేట, కాళింగ మన్నయ్యపేట, ఏడోవార్డులోని చింతాడ, చింతాడ కాలనీ, 21వ వార్డులోని కుద్దిరాం తదితర ప్రాంతాల్లో నేటికీ మంచినీటి కుళాయిలు లేవు. అధికారులు ట్యాంకర్లతో అరకొరగా మూడురోజులకోసారి నీటిని సరఫరా చేస్తుండడంతో అవస్థలు తప్పడం లేదని మహిళలు వాపోతున్నారు.

- ఆమదాలవలస మునిసిపాలిటీలో సుమారు 40వేలకుపైగా జనాభా ఉన్నారు. ప్రజల దాహార్తిని తీర్చేందుకు పట్టణ ప్రణాళిక విభాగం ప్రతిపాదనలు పంపుతున్నా.. ప్రభుత్వం అరకొరగా నిధులు మంజూరు చేస్తోంది. దీంతో నీటి పథకాల పనులు సక్రమంగా సాగడం లేదు. టీడీపీ హయాంలో పట్టణ శివారు వార్డులకు తాగునీరందించేందుకు 2018లో రూ.40కోట్లు మంజూరు కాగా.. పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. 2019లో అధికారంలోకి వచ్చిన వైసీపీ.. గత ప్రభుత్వ పథకాలను నిలిపేయడంతో తాగునీటి పైపులు వృథాగా పడి ఉన్నాయి. శివారు వార్డు ప్రజలకు తాగునీటి కష్టాలు తీరడం లేదు. ఇటు వంశధారనది నుంచి వచ్చిన నీరు మెట్టక్కివలస, కృష్ణాపురం, మార్కెట్‌, గేటు, వెంగళరావుకాలనీ వంటి ప్రాంతాలకు సరఫరా అవుతోంది. అటు నాగావళి నది నుంచి వచ్చిన నీరు లక్ష్ముడుపేట, వెంకయ్యపేట, బొడ్డేపల్లిపేట వంటి వార్డులకు సరఫరా అవుతోంది. ఈ రెండు నదుల వద్ద ఉన్న పంపుసెట్ల మోటార్ల సామర్థ్యం చాలడం లేదు. ఒక్కోసారి మోటార్లు మొరాయిస్తే ఒకటి రెండు రోజులు వార్డులకు తాగునీటి సరఫరా నిలిచిపోతుంది. దీనికితోడు పట్టణంలో సగానికిపైగా బడాబాబులు కుళాయిలకు మోటార్లు పెట్టి నీటి చౌర్యానికి పాల్పడుతున్నారు. మరోవైపు ఎక్కడికక్కడ పైపులైన్ల లీకేజీ కారణంగా పట్టణ ప్రజలకు సక్రమంగా నీరందడం లేదు.

- మునిసిపాలిటీ ప్రజల తాగునీటి సమస్య పరిష్కరించేందుకు టీడీపీ హయాంలో.. అప్పటి విప్‌ కూన రవికుమార్‌ రూ.33కోట్లతో పనుల నిర్వహణకు చర్యలు చేపట్టారు. ఈ పనులు మధ్యలోనే నిలిచిపోయాయి. అలాగే 2020లో స్పీకర్‌ తమ్మినేని సీతారాం.. ఏఐఐబి నిధులు రూ.61.38కోట్ల వ్యయంతో పనులకు శంకుస్థాపన చేశారు. కానీ పనులు ఆదిలోనే నిలిచిపోవడంతో పట్టణ ప్రజలకు నీటి కష్టాలు కొనసాగుతూనే ఉన్నాయి.

సూదికొండకాలనీకి ట్యాంకర్ల నీరే గతి

పలాస-కాశీబుగ్గ మునిసిపాలిటీ 19వ వార్డు సూదికొండకాలనీలో తాగునీటి కోసం మహిళలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. ఈ ప్రాంతంలో శాశ్వత మంచినీటి పథకాలు లేవు. పవర్‌బోర్లలో నీరు అడుగంటింది. కుళాయిల ద్వారా వారానికోసారి.. కొద్దిపాటి నీరు మాత్రమే సరఫరా అవుతోంది. కొండ ప్రాంతం కావడంతో నీటి ఇబ్బందులు ఏర్పడ్డాయి. ప్రస్తుతం రోజూ మునిసిపాలిటీ ట్యాంకర్ల ద్వారా నీటిని సరఫరా చేస్తున్నారు. వాటిని డ్రమ్ముల్లో నింపి.. కొండపై ఉన్న తమ గృహాలకు మహిళలు తీసుకెళ్తున్నారు. సూదికొండ కాలనీలో మొత్తం 3వేల జనాభా ఉన్నారు. ఎక్కువగా జీడి, ఆటోరిక్షా కార్మికులతో పాటు సాధారణ ప్రజలే నివనిస్తున్నారు. మున్సిపాలిటిలో దీర్ఘకాలిక తాగునీటి ప్రాజెక్టులు లేకపోవడంతో ప్రతిరోజు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. బోర్లు వేసినా 600 అడుగులు లోతు వెళ్లనిదే నీరు పడని పరిస్థితి ఉంది. 25 ఏళ్ల కిందట ఏర్పడిన ఈ కాలనీకి ఇప్పటివరకూ నీటి సమస్య తీర్చే నాఽథులే లేరు. ప్రతి ఎన్నికల్లో శాశ్వత తాగునీటి ప్రాజెక్టులు నిర్మిస్తామని చెబుతున్న ప్రజాప్రతినిధులు తరువాత ముఖం చాటేస్తున్నారు. సూదికొండ నీటి పరిష్కారం కోసం రోటరీక్లబ్‌ గతంలో భారీ ట్యాంకు నిర్మించింది. నీరు లభ్యత అంతంతమాత్రం కావడంతో ఆ ప్రాజెక్టు ప్రస్తుతం రూపం లేకుండా పోయింది. వీధిలో అక్కడక్కడా పవర్‌బోర్లు వేసినా నీరందడం లేదని మహిళలు ఆవేదన చెందుతున్నారు.

శాశ్వత పరిష్కారం చూపించాలి

మాకు శాశ్వత మంచినీటి పరిష్కారం చూపించాలి. బోర్లు ఎండిపోవడంతో ట్యాంకర్ల ద్వారా వచ్చే నీరే గతవుతోంది. మేము పనులకు వెళ్లిపోతే నీరు పట్టడానికి కూడా ఎవరూ ఉండరు. మండుటెండలో నీరు పట్టుకొని నిల్వ చేసుకుంటున్నాం. అధికారులు స్పందించి నీటి సమస్య పరిష్కరించాలి.

- ఎన్‌.యశోద, సూదికొండకాలనీ, పలాస

............................

- నిత్యం తాగునీటి సమస్యే

ఇచ్ఛాపురంలోని ఏఎస్‌పేటలో నిత్యం తాగునీటి సమస్య ఉన్నా అధికారులు పట్టించుకోవడం లేదు. అధికారపార్టీ నేతలు కుళాయిల ద్వారా నీరందిస్తామని చెప్పి.. నాసిరకం పైపులు వేయడంతో అవి ప్రారంభించకముందే లీకులు ఏర్పడ్డాయి. రోజూ ట్యాంకర్లతో నీటిని అందిస్తామని చెప్పిన అధికారులు.. మూడు రోజులకోసారి అరకొరగా సరఫరా చేస్తున్నారు.

- తవిటయ్య, 3వ వార్డు టీడీపీ కౌన్సిలర్‌, ఇచ్ఛాపురం

............................

పట్టించుకోవడం లేదు

అధికారపార్టీ నేతలు పురుషోత్తపురంలోని 1, 2 వార్డుల్లో నీటి సమస్యపై పట్టించుకోవడం లేదు. మూడు రోజులకోసారి ట్యాంకర్లతో సరఫరా చేయడంతో ఇబ్బందులు పడుతున్నాం. చెరువు, బావుల నుంచి నీటిని తెచ్చుకుంటున్నాం. పురుషోత్తపురం పుష్పగిరి కొండపై నిర్మించిన ట్యాంక్‌ శిథిలావస్థకు చేరుకున్నా.. ఇంతవరకూ పైపులైన్లు లేవు.

- గాలి ధనవతి, 2వ వార్డు టీడీపీ మాజీ కౌన్సిలర్‌

....................

చర్యలు తీసుకుంటున్నాం

ఇచ్ఛాపురంలో 1, 2, 3 వార్డుల్లో తాగునీటి సమస్య పరిష్కారానికి ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నాం. ప్రతిరోజూ ట్యాంకర్ల ద్వారా ఒక్కో వీధిలో నీటిని సరఫరా చేస్తున్నాం. మునిసిపాలిటీలో నీటి సమస్య లేకుండా చర్యలు తీసుకుంటున్నాం.

- ఎన్‌.రమేష్‌, మునిసిపల్‌ కమిషనర్‌, ఇచ్ఛాపురం

Updated Date - May 01 , 2024 | 11:53 PM