Share News

ఈవీఎంల రెండోదశ ర్యాండమైజేషన్‌ పూర్తి

ABN , Publish Date - May 01 , 2024 | 11:49 PM

సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటుతోపాటు, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు.

ఈవీఎంల రెండోదశ ర్యాండమైజేషన్‌ పూర్తి
మాట్లాడుతున్న కలెక్టర్‌, ఎన్నికల పరిశీలకులు

- జిల్లా ఎన్నికల అధికారి మన్‌జీర్‌ జిలానీ సమూన్‌

కలెక్టరేట్‌, మే 1: సార్వత్రిక ఎన్నికల్లో భాగంగా శ్రీకాకుళం పార్లమెంటుతోపాటు, శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట అసెంబ్లీ నియోజకవర్గాలకు సంబంధించిన ఈవీఎంల రెండో దశ ర్యాండమైజేషన్‌ ప్రక్రియ పూర్తయిందని జిల్లా ఎన్నికల అధికారి, కలెక్టర్‌ మన్‌జీర్‌ జిలానీ సమూన్‌ తెలిపారు. బుధవారం కలెక్టరేట్‌లో ఎన్నికల పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి సమక్షంలో ఈవీఎంల ర్యాండమైజేషన్‌ ప్రక్రియ నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశీలకుడు శేఖర్‌ విద్యార్థి మాట్లాడుతూ మొదటి దశలో అసెంబ్లీ సెగ్మెంట్ల వారీగా, రెండవ దశలో పోలింగ్‌ కేంద్రాల వారీగా ఈవీఎంలు కేటాయిస్తామన్నారు. కలెక్టర్‌ మాట్లాడుతూ ఎన్నికల కమిషన్‌ మార్గదర్శకాల ప్రకారం రాజకీయ పార్టీల సమక్షంలో, ఎన్నికల పరిశీలకుల పర్యవేక్షణలో ఆన్‌లైన్‌ విధానం ద్వారా, పూర్తి పారదర్శకంగా ర్యాండమైజేషన్‌ పూర్తి చేస్తామని తెలిపారు. సమావేశంలో ఆమదాలవలస రిటర్నింగ్‌ అధికారి, జేసీ ఎం.నవీన్‌, డీఆర్వో ఎం.గణపతిరావు, శ్రీకాకుళం, నరసన్నపట ఆర్వోలు సీహెచ్‌ రంగయ్య, రామ్మోహన్‌, ఈవీఎంల నిర్వహణ నోడల్‌ అధికారి సుధ, ఎస్‌ఎస్‌ఏ జయప్రకాష్‌, పలు రాజకీయ పార్టీల ప్రతినిథులు, స్వతంత్ర అభ్యర్థులు పాల్గొన్నారు.

నేరుగా ఫిర్యాదు చేయవచ్చు

ఎన్నికల నిబంధన ఉల్లంఘనకు సంబంధించి శ్రీకాకుళం పార్లమెంటుతో పాటు శ్రీకాకుళం, ఆమదాలవలస, నరసన్నపేట నియోజకవర్గాలకు చెందిన అభ్యర్థులు, ప్రజలు నేరుగా తనకు ఫిర్యాదు చేయవచ్చని ఎన్నికల పరిశీలకుడు, సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి శేఖర్‌ విద్యార్థి తెలిపారు. జిల్లాలో స్వేచ్ఛగా, నిష్పక్షపాతంగా, ప్రశాంత వాతావరణంలో ఎన్నికలు యంత్రాంగం కృషి చేస్తోందన్నారు. శ్రీకాకుళం అరసవల్లి రోడ్డులోని సన్‌రైజ్‌ హోటల్లో ప్రతీరోజు ఉదయం 11-30 నుంచి మధ్యాహ్నం 1-30 గంటల వరకు అందుబాటులో ఉంటానని, తనను నేరుగా కానీ, లేదా 9032923131 నెంబరుకు ఫోన్‌ చేసి సంప్రదించవచ్చని సూచించారు. ఎన్నికల నిర్వహణలో లోటుపాట్లపై సలహాలు, సూచనలు కూడా చేయవ చ్చని తెలిపారు.

Updated Date - May 01 , 2024 | 11:49 PM