Share News

ఇది‘ధర్మ’మేనా?

ABN , Publish Date - May 01 , 2024 | 11:51 PM

కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్‌ను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. బీచ్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని గతంలో మాటిచ్చి మరిచింది. ఐదేళ్ల కిందట వచ్చిన వరదలకు బీచ్‌ తీరం కోతకు గురైంది. తీరంలోని బొమ్మలు, సిమెంట్‌ బల్లలు, ఇతర పర్యాటక సామగ్రి అంతా సముద్రంలో కలసిపోయింది. సందర్శకులు రావడం మానేశారు. బీచ్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ధర్మాన హామీఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఈ పనులు ముందుకు సాగలేదు. నిధులు రాక, బిల్లులు కాక పనులు ఆగిపోయాయి. పర్యాటకాన్ని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

 ఇది‘ధర్మ’మేనా?
వెలవెలపోతున్న కళింగపట్నం బీచ్‌

కళింగపట్నం (కె.మత్స్యలేశం) బీచ్‌ను వైసీపీ ప్రభుత్వం తీవ్ర నిర్లక్ష్యం చేస్తోంది. బీచ్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని గతంలో మాటిచ్చి మరిచింది. ఐదేళ్ల కిందట వచ్చిన వరదలకు బీచ్‌ తీరం కోతకు గురైంది. తీరంలోని బొమ్మలు, సిమెంట్‌ బల్లలు, ఇతర పర్యాటక సామగ్రి అంతా సముద్రంలో కలసిపోయింది. సందర్శకులు రావడం మానేశారు. బీచ్‌కు పూర్వవైభవం తీసుకొస్తామని, అన్ని విధాలా అభివృద్ధి చేస్తామని మంత్రి ధర్మాన హామీఇచ్చారు. ఐదేళ్లు గడిచినా ఈ పనులు ముందుకు సాగలేదు. నిధులు రాక, బిల్లులు కాక పనులు ఆగిపోయాయి. పర్యాటకాన్ని పట్టించుకోని వైసీపీ ప్రభుత్వంపై ప్రజలు మండిపడుతున్నారు.

(గార)

జిల్లాలోని ప్రముఖ పర్యాటక కేంద్రాల్లో కె.మత్స్యలేశం (కళింగపట్నం) బీచ్‌ ఒకటి. గతంలో ఇక్కడకు శ్రీకాకుళం, నరసన్నపేట, ఎచ్చెర్ల, పాతపట్నం తదితర ప్రాంతాల నుంచి నిత్యం సందర్శకులు వచ్చేవారు. పిక్నిక్‌ల సమయంలోనే కాకుండా శని, ఆదివారాల్లో వందలాది మంది సందర్శకులతో ఈ ప్రాంతం కళకళలాడేది. పర్యాటకుల కోసం అన్ని రకాల వసతులు కల్పించేందుకు గతంలో అధికారులు చర్యలు తీసుకున్నారు. రూ.50లక్షలు ఖర్చుచేసి బుద్ధుడు, ఏనుగు, జిరాపీ మొదలైన బొమ్మలతో పాటు సందర్శకులు కూర్చొనేందుకు గ్రానైట్‌తో కూడిన బల్లలు ఏర్పాటు చేశారు. 2019 ఆగస్టులో వంశధార నదికి భారీగా వరదలు వచ్చాయి. వరద ఉధృతికి నదీ ప్రవాహం దిశ మారడంతో అప్పట్లో గ్రామస్థులు ఆ రోజు అర్ధరాత్రి బిక్కుబిక్కుమని గడిపారు. వరద నేరుగా సముద్రం వైపు వెళ్లకుండా బీచ్‌ వైపునకు దూసుకురావడంతో లక్షలాది రూపాయలతో ఏర్పాటు చేసిన బొమ్మలు, పరికరాలు, కట్టడాలు సముద్రంలోకి కొట్టుకుపోయాయి. బీచ్‌ ఫ్రంట్‌ రోడ్డు కూడా కొట్టుకుపోయింది. దీంతో బీచ్‌ కళావిహీనంగా మారింది. అప్పటి నుంచి ఇక్కడకు క్రమేణా సందర్శకులు రావడం తగ్గింది. అయితే, బీచ్‌ కోతకు గురైనా చాలామంది సముద్రంలో స్నానాలు చేయడానికి వచ్చి ప్రమాదాల బారినపడేవారు. దీంతో అధికారులు రోడ్డుకు అడ్డంగా సిమెంట్‌ గోడ కట్టించారు. దీంతో పూర్తిగా సందర్శకుల రాకపోకలు తగ్గిపోయాయి. వైసీపీ ప్రభుత్వం బీచ్‌ పునరుద్ధరణ, మరమ్మతులకు ఎటువంటి చర్యలు తీసుకోకపోవడంతో ఆ ప్రాంతం ప్రస్తుతం వెలవెలబోతుంది. కాగా, గతంలో బీచ్‌కు సందర్శకులు వచ్చే సమయంలో పరిసర గ్రామాల్లోని చిరువ్యాపారులకు ఉపాధి దొరికేది. ప్రస్తుతం సందర్శకులు రాకపోవడంతో వారంతా కూలీలుగా మారిపోయారు.

పూర్వ వైభవం కలేనా?

కళింగపట్నం బీచ్‌ కోతకు గురైన తర్వాత ఆ గ్రామస్థులు భయాందోళనకు గురయ్యారు. మళ్లీ వరద వస్తే గ్రామంలోకి చొచ్చుకు వస్తుందని, సముద్రంలో గ్రామం కలిసి పోతుందని అధికారులు, ప్రజాప్రతినిధులు దృష్టికి గ్రామస్థులు తీసుకువెళ్లారు. తక్షణమే బీచ్‌ను పరిరక్షణకు అధికారులు చర్యలు తీసుకోవాలని కోరారు. ఈనేపథ్యంలో మంత్రి ధర్మాన ప్రసాదరావు బీచ్‌కు పూర్వ వైభవం తీసుకువస్తామని హామీ ఇచ్చారు. ఈ మేరకు రూ.7.50 కోట్లు నిధులు మంజూరు చేయించారు. ఆ నిధులతో బీచ్‌లో డ్రెడ్జింగ్‌ చేపట్టి పనులు ప్రారంభిం చారు. మొదట్లో పనులు వేగంగా జరిగినా తరువాత నిధులు కొరత, బిల్లులు కాకపోవడంతో పనులు ముందుకు సాగలేదు. ప్రస్తుతం ఈ బీచ్‌ పరిస్థితిని చూసి సందర్శకులు ఆవేదనచెందుతున్నారు. బీచ్‌ను అభివృద్ధి చేసేందుకు వైసీపీ ప్రభుత్వానికి ఐదేళ్లు సరిపోలేదా అని ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.

కానరాని బీచ్‌ ఫెస్టివల్‌

టీడీపీ ప్రభుత్వ హయాంలో ప్రతిరోజూ వందలాది మంది సందర్శకులతో కళింగ పట్నం బీచ్‌ కళకళలాడేది. 2016 నుంచి 2019 వరకు ప్రతిఏటా ఇక్కడ మూడు రోజుల పాటు బీచ్‌ ఫెస్టివల్‌ను వైభవంగా నిర్వహించేవారు. బుల్లితెర నటులతోపాటు వివిధ రంగాల కళాకారులతో సాంస్కృతిక కార్యక్రమాలు ఏర్పాటు చేసేవారు. జిల్లా నలు మూలల నుంచి వేలాదిమంది కుటుంబాలతో తరలివచ్చే వారు. వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బీచ్‌ ఫెస్టివల్‌ నిర్వహణను నిలిపివేశారు.

పూర్వ వైభవం తీసుకురావాలి..

జిల్లాలో మంచి పర్యాటక కేంద్రంగా గుర్తింపు పొందిన కె.మత్స్యలేశం బీచ్‌కు పూర్వ వైభవం తీసుకొచ్చేలా అధికారులు చర్యలు తీసుకోవాలి. ఎంతో చారిత్రక, ప్రసిద్ధి చెందిన ఈ బీచ్‌లో సంద ర్శకులకు కనీస సౌకర్యాలు అందుబాటులో ఉంచేలా అధికారులు చర్యలు చేపట్టాలి.

-జేసీ దేవదాస్‌,

విశ్రాంత ప్రధానోపాధ్యాయుడు

Updated Date - May 01 , 2024 | 11:51 PM