Share News

పొరుగు మద్యం పరవళ్లు

ABN , Publish Date - May 02 , 2024 | 01:31 AM

ఎన్నికల వేళ పొరుగు రాష్ట్రాల మద్యం పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా కేసుల కొద్దీ బయటపడుతోంది. గోవా, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి భారీగా జిల్లాకు అధికార పార్టీ వారు దిగుమతి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది.

పొరుగు మద్యం పరవళ్లు
వైసీపీ వాహనాల్లో ఎక్సైజ్‌ అధికారులు స్వాధీనం చేసుకున్న గోవా మద్యం

మంత్రుల ఇలాకాలో డంప్‌లు

సీఎం సభకు హాజరైన వారికి పంపిణీ

ఉదాసీనంగా వ్యవహరిస్తున్న ఎక్సైజ్‌ అధికారులు

పట్టుబడిన కీలక వ్యక్తులపై చర్యలు శూన్యం

విషయం తెలిసినా మూలాలపై సారించని దృష్టి

ఎన్నికల వేళ పొరుగు రాష్ట్రాల మద్యం పరవళ్లు తొక్కుతోంది. జిల్లాలోని అన్ని ప్రాంతాల్లో వరుసగా కేసుల కొద్దీ బయటపడుతోంది. గోవా, పుదుచ్చేరి, కర్ణాటక నుంచి భారీగా జిల్లాకు అధికార పార్టీ వారు దిగుమతి చేసుకున్నట్లు స్పష్టమవుతోంది. మంగళవారం టంగుటూరులో ముఖ్యమంత్రి సభకు హాజరైన వైసీపీ నాయకుల కార్లలో గోవా మద్యం దొరకడం అందుకు నిదర్శనం. చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడు, టంగుటూరు మండలం జమ్ములపాలెం, కొండపి వద్ద పొరుగు రాష్ట్రాల మద్యం పట్టుబడటం.. అవి మంత్రులు పోటీచేస్తున్న నియోజకవర్గాలు కావడం చర్చనీయాంశమైంది. నెల్లూరు జిల్లా కందుకూరులో పట్టుబడిన గోవా మద్యంతో అప్రమత్తమైన అధికారులు జిల్లాలో తనిఖీలు చేసి కొంతమేర పట్టుకోగలిగారు. అయితే పొరుగు మద్యం ఎలా జిల్లాకు చేరుతుంది, ఎవరు ఈ దుస్సాహసానికి పాల్పడుతున్నారు అన్నది తేలాల్సి ఉంది. అధికార పార్టీ నాయకులకు మాత్రమే సరఫరా జరగడం అనుమానాలకు తావిస్తోంది.

ఒంగోలు (క్రైం), మే 1 : జిల్లాలో పొరుగు మద్యం ఏరులై పారుతోంది. ఒకపక్క ప్రభుత్వ మద్యం దుకాణాలను ఏకపక్షంగా కబ్జా చేసిన అధికార వైసీపీ నాయకులు ఇంకా చాలదన్నట్లు పక్క రాష్ర్టాల మద్యాన్ని కూడా నాలుగైదు కంటైనర్లలో జిల్లాకు తెచ్చినట్లు ప్రచారం నడుస్తోంది. ఇందుకు ఎక్సైజ్‌ శాఖ, అధికార యంత్రాంగం పూర్తి సహకారం అందించినట్లు ఆరోపణలు ఉన్నాయి. అయితే ఎన్నికల చెక్‌పోస్టులలో కొనసాగుతున్న తనిఖీల తీరు చూస్తే పొరుగు రాష్ట్రాల నుంచి మద్యాన్ని ఎలా జిల్లాలోకి తీసుకోస్తున్నారనేది ఎవరికీ అర్థం కావడం లేదు. జిల్లా నలుమూలల 18 చెక్‌పోస్టులు ఉన్నాయి. అంతేకాకుండా జిల్లాకేంద్రమైన ఒంగోలు శివారుతోపాటు నగరంలో ముఖ్యమైన ప్రాంతాలలో కూడా చెక్‌పోస్టులు పెట్టి తనిఖీలు చేస్తున్నారు. అయినప్పటికీ అధికారపార్టీ వారి కోసం పొరుగు మద్యం దిగుమతి కావడం తనిఖీలపై అనుమానాలకు తావిస్తోంది.

మంత్రుల ఇలాకాలోనే భారీగా...

కొండపి నియోజకవర్గంలో అధికారపార్టీ అభ్యర్థిగా మంత్రి సురేష్‌ పోటీచేస్తున్నారు. మంగళవారం టంగుటూరులో జరిగిన ముఖ్యమంత్రి సభకు హాజరైన వైసీపీ నేతల కార్లలో 114 బాటిళ్ల గోవా మద్యం పట్టుబడింది. అదేక్రమంలో మంగళవారం రాత్రి కొండపి నియోజక వర్గంలోని మర్రిపూడి మండలంలో తనిఖీలు నిర్వహిస్తుండగా రెండు వాహనాలలో 26 బాటిళ్ల పుదుచ్చేరి మద్యం దొరికింది. వాటిని సీజ్‌ చేసి ఇరువురు వ్యక్తులపై కేసు నమోదు చేశారు. అలాగే మరో మంత్రి మేరుగ నాగార్జున పోటీచే స్తున్న ఎస్‌ఎన్‌పాడు నియోజకవర్గం చీమకుర్తి మండలం ఎర్రగుడిపాడులోని పశువుల షెడ్‌లో ఇటీవల నిల్వ ఉంచిన 1,001 బాటిళ్ల గోవా మద్యం ను అధికారులు సీజ్‌ చేశారు. ఇలా మంత్రుల ఇలాకాలో పొరుగు మద్యాన్ని భారీగా సీజ్‌ చేశారు. ఎన్నికల కమిషన్‌ ఆదేశాల మేరకు మద్యం షాపుల్లో రేషన్‌ విధించడంతో పొరుగు రాష్ట్రాల నుంచి భారీగా దిగుమతి చేసుకున్నట్లు అధికారులు అనుమానిస్తున్నారు.

అడుగు ముందుకు పడని విచారణ

పొరుగు నుంచి భారీగా దిగుమతి చేసు కొని నిబంధనలకు విరుద్ధంగా ఓటర్లకు పంపిణీ చేయడానికి సిద్ధంగా ఉంచిన కేసుల విషయంలో అధికారులు ఉదాసీనంగా వ్యవ హరిస్తున్నారన్న ఆరోపణలు ఉన్నాయి. ఎర్ర గుడిపాడు తరహాలోనే చీమకుర్తి మండలం లో 15 గ్రామాలకు 20 కేసుల చొప్పున సరఫ రా చేసి ఉండవచ్చని తెలుస్తోంది. ఇప్పటికీ ఎర్రగుడిపాడు వైసీపీ నేత వెంక ట్రావుపైన మాత్రమే కేసు నమో దు చేశారు. అక్కడ వైసీపీ మండల కన్వీనర్‌ దగ్గర ఉండి ఆయా గ్రామాలకు మద్యం పంపిణీ చేసినట్లు ఆధారాలు దొరికినప్పటికీ విచారణలో ఒక్క అడుగు ముందుకు వేయలేదు. కాల్‌డేటా ఆధారంగా విచారణ చేపడ తామ ని చెప్పిన అధికారులు ఆ దిశగా ముందుకెళ్లిన దాఖలాలు లేవు. టంగుటూరులో గోవా మద్యం వైసీపీ నేతల వాహనాల్లో దొరికింది. అందుకు సంబంధించి తొమ్మిది మందిని అరెస్టు చేశారు. వారికి అర్ధరాత్రి మద్యం సరఫరా చేసిన వ్యక్తిని విచారించడానికి కూడా పోలీసులు వెనకాడుతు న్నారు. మంత్రి వద్ద కీలకంగా వ్యవహరించే వ్యక్తి కాల్‌డేటా అధికారులకు అందింది. అయినా అత నిని విచారించకపోవడం అనుమానాలకు తావి స్తోంది. సీఎం సభ కోసం కొండపి నియోజకవ ర్గంలో మండలానికి 50 పెట్టెల గోవా మద్యం పంపిణీ చేసినట్లు ప్రాథమికంగా అంచనాకు వచ్చినప్పటికీ విచారణకు వెనకడుగు వేస్తున్నారు.

సీఎం సభకు వచ్చిన వాహనాల్లో గోవా మద్యం

తొమ్మిది మంది అరెస్టు, ఆరు కార్లు సీజ్‌, 114 బాటిళ్లు పట్టివేత

టంగుటూరులో మంగళవారం సీఎం జగన్‌మోహన్‌రెడ్డి పాల్గొన్న సభకు హాజరై వెళుతున్న వాహనాలలో గోవా మద్యాన్ని ఫ్లైయింగ్‌ స్క్వాడ్‌ గుర్తించింది. సభకు హాజరై వెనుదిరిగి వెళుతున్న వాహనాలను తనిఖీ చేయగా ఆరు కార్లలో 114 క్వార్టర్‌ బాటిళ్లు దొరికాయి. వాటిని సీజ్‌ చేసినట్లు ఒంగోలు ఎక్సైజ్‌ సీఐ జి.సూర్యనారాయణ ఓ ప్రకటనలో తెలిపారు. ఆరు కార్లను స్వాధీనం చేసుకున్నామని, వాటిలో ఉన్న తొమ్మిది మందిని అరెస్టు చేశామని తెలిపారు. తనిఖీలలో ఎక్సైజ్‌ ఎస్‌ఐ సిహెచ్‌.గీత, సిబ్బంది పాల్గొన్నారు.

మద్యం అక్రమ రవాణా, నిల్వలపై ఫిర్యాదులు చేయవచ్చు

జిల్లాలో మద్యం అక్రమంగా నిల్వ, రవాణా చేస్తుంటే కంట్రోల్‌ రూం ఫోన్‌ నంబర్‌ 08592-222275 కు ఫిర్యాదు చేయవచ్చని జిల్లా ఎక్సైజ్‌ శాఖాధికారి పీఎన్‌.మూర్తి బుధవారం ఒక ప్రకటనలో తెలిపారు. సమాచారం ఇచ్చిన వ్యక్తి వివరాలను గోప్యంగా ఉంచుతామన్నారు. ఇప్పటివరకు 17 మందిపై కేసులు నమోదు చేశామని చెప్పారు.

Updated Date - May 02 , 2024 | 01:31 AM