Share News

పింఛన్‌దారులను ఏడిపింఛన్‌

ABN , Publish Date - May 02 , 2024 | 01:29 AM

ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో నెలకోవిధంగా వ్యవహ రిస్తోంది. లబ్ధిదారులను ఏడిపిస్తోంది. అవ్వాతాతలు మండుటెండలో మలమల మాడేలా చేస్తోంది.

పింఛన్‌దారులను ఏడిపింఛన్‌
పింఛన్‌దారులను

మండుటెండలో పండుటాకుల పాట్లు

బ్యాంకు ఖాతాల్లో జమ విషయం తెలియక సచివాలయాలకు లబ్ధిదారుల క్యూ

ఖాతాలో వేశారో లేదో తెలియక గందరగోళం

మేడే సెలవు కావడంతో తొలిరోజు అందని వైనం

ఇంటింటికీ వెళ్లి ఇచ్చిందీ అరకొరే!

ఒంగోలు నగరం, మే 1 : ప్రభుత్వం పింఛన్ల పంపిణీ విషయంలో నెలకోవిధంగా వ్యవహ రిస్తోంది. లబ్ధిదారులను ఏడిపిస్తోంది. అవ్వాతాతలు మండు టెండలో మలమల మాడేలా చేస్తోంది. పింఛన్‌ ఇంటింటికీ అందకపోవడానికి ప్రతిపక్షమే కారణమని చిత్రీకరించి ఎన్నికల్లో లబ్ధి పొందేందుకు వికృత క్రీడ ఆడుతోంది. వైసీపీ ప్రభుత్వ అమానవీయా నికి పింఛన్‌దారులు అల్లాడుతున్నారు. ప్రతినెలా ఒకటో తేదీన పింఛన్‌ తీసుకొని అవసరాలు తీర్చుకునే వారు ఇప్పుడు మానసిక ఆందోళనకు గురవుతున్నారు.

సమాచారం లేక సచివాలయాలకు..

గతంలో ఇంటింటికీ వెళ్లి పింఛన్‌ సొమ్మును అందజేసిన వలంటీర్లను ఎన్నికల నేపథ్యంలో ఈసీ ఆదేశాల మేరకు ప్రభుత్వం పక్కనపెట్టింది. గత నెలలో సచివాలయాల్లో పింఛన్‌ సొమ్మును అందజేసిన ప్రభుత్వం ఈనెలలో బ్యాంకు ఖాతాలకు జమ చేయాలని మూడు రోజుల క్రితమే నిర్ణయించింది. ఈవిషయమై లబ్ధిదారులకు ముందస్తు సమాచారం లేదు. వారంతా గత నెలలో మాదిరిగానే ఈసారి కూడా సచివాల యాల్లోనే పంపిణీ చేస్తారనుకున్నారు. మండుటెండలో ఇబ్బందులు పడి అక్కడికి చేరుకున్న వారికి బ్యాంకుల్లో నగదు జమ అవు తుందని సచివాయల సిబ్బంది చెప్పడంతో తీవ్ర నిరాశకు గురయ్యా రు. కొంతమంది ప్రభుత్వానికి శాపనార్థాలు పెడుతూ వెనుదిరిగారు.

అంతా గందరగోళం

ప్రభుత్వం అనుసరించిన విధానంతో పింఛన్‌ పంపిణీ ప్రక్రియ గందరగోళంగా మారింది. అసలు ఏబ్యాంకు ఖాతాకు తమ ఆధార్‌ కార్డు లింక్‌ అయ్యిందో, ఏబ్యాంకులో పింఛన్‌ సొమ్ము జమ చేశారో తెలియక వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులు ఆందోళనకు గుర య్యారు. సమీపంలోని బ్యాంకులకు వెళ్లి కనుక్కుందామంటే మేడే సం దర్భంగా బుధవారం సెలవు. గ్రామీణ ప్రాంతాలకు సంబంధించి మం డల కేంద్రాల్లోనే ఒకటి లేదా రెండు బ్యాంకుల శాఖలు ఉన్నాయి. మండ లంలోని అన్ని గ్రామాల నుంచి వాటి వద్దకు వచ్చి పింఛన్‌ తీసుకోవాలం టే ఒకరోజు వేచి ఉండాల్సిందే. అలాగే సమీప పట్టణ ప్రాంతంలోని బ్యాం కుల్లో ఖాతాలు ఉండి ప్రభుత్వం వాటికి పింఛన్‌ సొమ్మును జమ చేస్తే అది లబ్ధిదారుల చేతికొచ్చే సరికి వారం పట్టే అవకాశం ఉంది. ఒక వైపు బ్యాంకు లకు సెలవు కావడం, మరోవైపు సచివాలయ సిబ్బంది సరైనా సమాచారం ఇవ్వలేకపోవడంతో లబ్ధిదారులకు మానసికంగా ఆందోళనకు గురవుతున్నారు.

ఇంటింటికీ పంపిణీ అరకొరే!

బ్యాంకు ఖాతాలకు ఆధార్‌ లింకు కాని వారికి, మంచంలో ఉన్న వృద్ధులు, నడవలేని దివ్యాంగులు, దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్న వారికి మాత్రమే ఈనెలలో పింఛన్‌ సొమ్మును ఇంటికి అందిస్తామని ప్రభుత్వం ప్రకటించింది. జిల్లాలో మొత్తం 2,92,522 మంది లబ్ధిదారులు ఉండగా ఇందులో 69,918 మందికి ఇంటికి వెళ్లి పింఛన్‌ సొమ్ము ఇవ్వాల్సి ఉంది. బుధవారం ఉదయాన్నే సచివాలయ సిబ్బంది వాళ్ల ఇంటి తలుపు తట్టి పింఛన్‌ అందిస్తారని ప్రభుత్వం ప్రకటించగా, జిల్లాలో మధ్యాహ్నం వరకూ పంపిణీ ప్రారంభం కాలేదు. ఆతర్వాత మొదలు పెట్టినా తొలిరోజు 69శాతం మందికి మాత్రమే ఇచ్చారు.

బ్యాంకుల్లో జమకాని సొమ్ము

లబ్ధిదారులకు సంబంధించిన పింఛన్‌ సొమ్ము ఇప్పటి వరకూ బ్యాంకులకు జమ కాలేదని తెలుస్తోంది. గురువారం లబ్ధిదారుల ఖాతాలకు జమ చేసే అవకాశం ఉందని అధికారులు భావిస్తున్నారు. ప్రభుత్వం వద్ద తగినన్ని నిధులు లేకపోతే వారం రోజులపాటు ఈ జమ చేసే ప్రక్రియ కొనసాగే అవకాశం లేకపోలేదని వారు అంటున్నారు. ప్రభుత్వం ఖాతాలకు జమ చేసి అది ఏ బ్యాంకులో, ఏఖాతాలో పడిందో తెలుసుకొని దాన్ని తీసుకొనేందుకు అవ్వాతాతలు ప్రయాసకు గురి కావాల్సిన పరిస్థితి కనిపిస్తోంది. ప్రభుత్వం పింఛన్ల పంపిణీని ఎన్నికల స్టంట్‌గా వాడుకుంటూ వృద్ధులు, వితంతువులు, దివ్యాంగులకు నరకం చూపుతున్నదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

Updated Date - May 02 , 2024 | 01:29 AM