Share News

వైసీపీపై బ్రాహ్మణాగ్రహం

ABN , Publish Date - May 02 , 2024 | 12:21 AM

సమాజంలో అగ్రవర్ణంగా పేరొంది, సర్వేజనా సుఖినోభవంతు అనుకునే బ్రాహ్మణుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. గత ఎన్నికలలో అధికశాతం బ్రాహ్మణులు వైసీపీకి అండగా నిలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే ఆవేదన ఇప్పుడు వారిలో బలంగా ఉంది.

వైసీపీపై బ్రాహ్మణాగ్రహం

వైసీపీ ప్రభుత్వ వైఖరిపట్ల తీవ్ర అసంతృప్తి

టీడీపీ ఏర్పాటు చేసిన కార్పొరేషన్‌ను పథకం ప్రకారం నిర్వీర్యం

ఆలయాల ధ్వంసం, అర్చకులపై దాడులు

ఒంగోలు నగరంతోపాటు జిల్లా వ్యాప్తంగా బ్రాహ్మణుల పొలాలు అధికార పార్టీ నేతల కబ్జా

తెలుగుదేశంలోకి పలువురు బ్రాహ్మణ నాయకులు

వారికి వైసీపీ నాయకుల బెదిరింపులు

ఒంగోలు(కల్చరల్‌), మే 1 : సమాజంలో అగ్రవర్ణంగా పేరొంది, సర్వేజనా సుఖినోభవంతు అనుకునే బ్రాహ్మణుల్లో వైసీపీ ప్రభుత్వంపై తీవ్ర ఆగ్రహజ్వాలలు పెల్లుబుకుతున్నాయి. గత ఎన్నికలలో అధికశాతం బ్రాహ్మణులు వైసీపీకి అండగా నిలిచారు. 2019లో వైసీపీ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత తాము తీవ్ర నిర్లక్ష్యానికి గురయ్యామనే ఆవేదన ఇప్పుడు వారిలో బలంగా ఉంది. బ్రాహ్మణుల ఆర్థిక అవసరాలు తీర్చటానికి, వారికి అండగా నిలవటానికి గత టీడీపీ ప్రభుత్వ హయాంలో చంద్రబాబు బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటుచేసి తగినన్ని నిధులు కేటాయిస్తే, వైసీపీ వచ్చాక దానిని ఒక పథకం ప్రకారం నిర్వీర్యం చేసిందని బ్రాహ్మణులు విమర్శిస్తున్నారు. కార్పొరేషన్‌కు నిధులు కేటాయించక పోగా, దాని ద్వారా అంతకుముందు అందుతున్న పథకాలన్నీ వైసీపీ ప్రభుత్వం అటకెక్కించింది. అంతేగాకుండా వైసీపీ అధికారంలోకి వచ్చాక రాష్ట్రంలో అనేక దేవాలయాలు ధ్వంసమయ్యాయి. అర్చకులపై వైసీపీ నాయకుల దాడులు విపరీతంగా పెరిగాయి. ఇన్ని జరుగుతున్నా సీఎం జగన్‌ అక్రమార్కులపై ఈగను కూడా వాలనివ్వకపోవడంతో బ్రాహ్మణుల్లో తీవ్ర అసంతృప్తి నెలకొంది.

టీడీపీలోకి బ్రాహ్మణ నాయకులు

గత ఎన్నికలలో వైసీపీకి అండగా నిలిచి పార్టీ విజయం కోసం పనిచేసిన బ్రాహ్మణ నాయకులను స్థానిక ప్రజాప్రతినిధులు ఏమాత్రం పట్టించుకోకపోవటం, కొంతమంది నాయకులకు మాత్రమే విలువ ఇస్తుండటంతో పలువురిలో అసంతృప్తి నెలకొంది. దీంతో వారు తమ సామాజిక వర్గానికి గతంలో అండగా నిలిచిన టీడీపీని ఎంచుకుంటున్నారు. ఇప్పటికే ఒంగోలు బ్రాహ్మణ సేవాసమితి కార్యదర్శి గంజాం శ్రీరంగనాథ్‌, కార్యవర్గ సభ్యులు ముక్తినూతలపాటి వాసు, ప్రముఖ వేద, జ్యోతిష్య పండితులు వ్యామజాల ప్రసన్నకుమార్‌ వంటి వారు తమ అనుచరులతో టీడీపీ కూటమి అభ్యర్థి దామచర్ల జనార్దన్‌ సమక్షంలో పార్టీలో చేరగా, ఈ దిశగా మరికొంత మంది బ్రాహ్మణ ప్రముఖులు సైతం ఆలోచన చేస్తున్నట్లు సమాచారం. టీడీపీలో చేరిన వారికి వైసీపీ నాయకుల నుంచి బెదిరింపులు వస్తున్నాయని, ప్రస్తుతం సమితిలో వారి పదవులకు రాజీనామాలు చేయాలని అంటున్నట్లు వినికిడి. అంతేకాకుండా ఇందుకోసం వారు పలువురు సమితి సభ్యుల నుంచి కూడా సంతకాలను సేకరిస్తున్నట్లు సమాచారం.

అర్చకులపై అమానుష దాడులు

వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఒకవైపు అనేక దేవాలయ భూములను ఆ పార్టీ నేతలు కబ్జా చేశారు. ఒంగోలు నగరంలో సైతం బ్రాహ్మణులకు చెందిన విలువైన స్థలాలను వైసీపీ నేతలు కబ్జా చేసిన ఉదంతాలు లెక్కకుమిక్కిలి వెలుగులోకి వచ్చాయి. మరోవైపు దేవదాయ శాఖ పరిధిలో ఉన్న ఆలయాలకు నిధులు కేటాయించకుండా వాటిని నిర్వీర్యం చేసే ప్రయత్నాలు కొనసాగాయి. ఇక రాష్ట్రంలో అనేక ప్రాంతాలలో దేవాలయాల విధ్వంసం, రథాలు తగలబడటం వంటివి జరుగుతున్నా ప్రభుత్వం నిమ్మకు నీరెత్తినట్లు ప్రవర్తిస్తోంది. ఇదిలా ఉంటే రాష్ట్రంలో అనేకచోట్ల వైసీపీ నాయకులు ఆలయాల్లో అర్చకులను దుర్భాషలాడటం, వారిపై దాడి చేయడం పరిపాటిగా మారింది. తాజాగా కాకినాడలో జరిగిన సంఘటనతో బ్రాహ్మణులలో ఆక్రోశం మరింత పెరిగింది. కొన్నిచోట్ల బ్రాహ్మణులు సాక్షాత్తు గాయత్రి స్వరూపంగా భావించే జంధ్యాన్ని సైతం వైసీపీ నాయకులు తెంచివేసి అవమానించారు. ఇక దేవాలయాలలో అర్చకుల నియామకాన్ని అధికార పార్టీకి చెందిన ప్రయివేటు ఏజెన్సీలకు ఇవ్వాలని కొన్ని దేవాలయాలలో ప్రయత్నించటం, దానిని పురోహిత, బ్రాహ్మణ సంఘాలు తీవ్రంగా ప్రతిఘటించటం జరిగాయి. ఈ విధంగా వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత బ్రాహ్మణుల పట్ల తీవ్ర వివక్ష కొనసాగుతుండటమే కాకుండా తమకు రక్షణ లేకుండా పోయిందనే భావన సైతం వారిలో నెలకొంది.

ఒకటొకటిగా పథకాలు రద్దు

గత టీడీపీ హయాంలో ఏర్పాటుచేసిన ఆంధ్రప్రదేశ్‌ బ్రాహ్మణ కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణుల సంక్షేమానికి అనేక పథకాలు అమలుచేసింది. ప్రస్తుత ప్రభుత్వం కొంతకాలంగా ఒకటొకటిగా వాటిని రద్దు చేయటం లేదా అమలు చేయకుండా కాలాయాపన చేయటం జరుగుతోంది.

గత టీడీపీ హయాంలో బ్రాహ్మణ కుటుంబాలలోని వృద్ధులకు కార్పొరేషన్‌ ద్వారా వృద్ధాప్య పింఛన్‌ లభించేది. ఒక కుటుంబంలో ఇద్దరు లేక ముగ్గురు వృద్ధులు ఉన్నప్పటికీ అందరికీ పింఛన్‌ వచ్చేది.

జగన్‌ ప్రభుత్వం ఒక కుటుంబంలో కేవలం ఒకరికే పింఛన్‌ అంటూ కోతపెట్టటమే కాకుండా ఆ ఒకరికి కూడా కార్పొరేషన్‌ ద్వారా కాకుండా సామాజిక పింఛన్‌ పథకానికి మార్పు చేశారు. ఈ క్రమంలో గతంలో పింఛన్‌ పొందుతున్న అనేకమంది బ్రాహ్మణ వృద్ధుల పేర్లు సామాజిక పింఛన్‌ పథకంలో కనిపించకుండా పోయి వారు ఆర్థికంగా ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.

గత టీడీపీ హయాంలో వయసుతో నిమిత్తం లేకుండా, భర్తను కోల్పోయినా లేదా భర్త వదిలేసిన ఒంటరి బ్రాహ్మణ మహిళలకు సైతం నెలవారీ పింఛన్‌ కార్పొరేషన్‌ ద్వారా అందేది.

వైసీపీ ప్రభుత్వం ఆ పింఛన్‌ను సైతం నిలుపుదల చేసింది.

విదేశాలకు వెళ్లి చదువుకోవాలనుకునే బ్రాహ్మణ విద్యార్థులకు కార్పొరేషన్‌ ద్వారా ఆర్థిక సహాయం గతంలో అందేది.

వైసీపీ ప్రభుత్వం దానిని సైతం నిలిపివేసింది.

బ్రాహ్మణులు చనిపోయినప్పుడు దహనక్రియల ఖర్చుల కోసం ‘గరుడ’ పథకం ద్వారా ఆర్థిక సహాయం అందజేసేవిధంగా గత ప్రభుత్వం ఏర్పాటుచేసింది. అప్పట్లో ఈ పథకానికి దరఖాస్తు చేసుకున్న పది నుంచి పదిహేను రోజులలో రు.10 వేలు నేరుగా చనిపోయిన వ్యక్తి వారసులకు అందేవి.

ప్రస్తుతం ఈ పథకం కింద దరఖాస్తు చేసుకుని జిల్లాలో అనేకమంది నెలల తరబడి ఎదురుచూస్తున్నారు.

కారు వంటి నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేసుకుని దానిని అద్దెకు తిప్పటం ద్వారా స్వయం ఉపాధి పొందేవిధంగా గత టీడీపీ ప్రభుత్వ హయాంలో కార్పొరేషన్‌ ద్వారా బ్రాహ్మణ యువతకు రుణాలు ఇచ్చారు.

వైసీపీ ప్రభుత్వ హయాంలో అది అమలు కావటం లేదు. ఇలా అనేక పథకాలను నిలిపివేసింది.

నాడు అండగా టీడీపీ ప్రభుత్వం

2014 ఎన్నికల ముందు పాదయాత్రలో బ్రాహ్మణుల కష్టాలను స్వయంగా గమనించిన చంద్రబాబు తమ పార్టీ అధికారంలోకి వస్తే ప్రత్యేకంగా కార్పొరేషన్‌ ఏర్పాటుచేసి వారికి అండగా నిలుస్తామని హామీ ఇచ్చారు. అధికారం చేపట్టిన తర్వాత తన మాటను నిలబెట్టుకుంటూ ఆయన దేశంలోనే తొలిసారిగా ఏపీ బ్రాహ్మణ కార్పొరేషన్‌ను ఏర్పాటు చేశారు. అంతేగాకుండా పుష్కలంగా నిధులు కేటాయించారు. బ్రాహ్మణులలో పేదవారు, పురోహితులు, అర్చకులకు ఆసరాగా అనేక పథకాలకు రూపకల్పన చేసి వారికి కార్పొరేషన్‌ అండగా నిలిచింది. జిల్లాలో సైతం అనేక బ్రాహ్మణ కుటుంబాలకు లక్షలాది రూపాయల నిధులు వివిధ పథకాల ద్వారా అందాయి.

పథకం ప్రకారం నిర్వీర్యం

బ్రాహ్మణుల ఓట్లే లక్ష్యంగా 2019 ఎన్నికల ముందు తాము అధికారంలోకి వస్తే బ్రాహ్మణ కార్పొరేషన్‌కు రూ.1000 కోట్లు కేటాయిస్తామని, ప్రస్తుతం అమలు జరుగుతున్న పథకాలకు తోడు మరిన్ని సంక్షేమ పఽథకాలు ప్రవేశపెడతామని జగన్మోహన రెడ్డి హామీఇచ్చారు. ఆ హామీని నమ్మిన బ్రాహ్మణులు అత్యధిక శాతం వైసీపీకి అండగా నిలిచారు. అధికారంలోకి వచ్చాక జగన్‌ అందుకు భిన్నంగా వ్యవహరించారు. కార్పొరేషన్‌ను పూర్తిగా నిర్వీర్యం చేశారు. రూ.1000 కోట్లలో పదోవంతు కూడా ఇప్పటివరకు కేటాయించలేదని బ్రాహ్మణులు చెబుతున్నారు.

కార్పొరేషన్‌ను రద్దు చేసే కుట్ర

కామరాజుగడ్డ కుసుమకుమారి, బ్రాహ్మణ కార్పొరేషన్‌ జిల్లా మాజీ కో ఆర్డినేటర్‌

ప్రజల సంక్షేమం కోసం చంద్రబాబు ప్రవేశపెట్టిన అన్న క్యాంటీన్‌ లాంటి వాటిని ప్రస్తుత ముఖ్యమంత్రి జగన్‌ తీసివేశారు. అదేవిధంగా బ్రాహ్మణ కార్పొరేషన్‌ను కూడా చంద్రబాబు ప్రారంభించారని, దానిని కొనసాగిస్తే ఆ ఖ్యాతి చంద్రబాబుకు దక్కుతుందని జగన్‌ భావిస్తున్నట్లు అనిపిస్తుంది. అందుకే బ్రాహ్మణ కార్పొరేషన్‌ను నిర్వీర్యం చేసేలా అనేక పన్నాగాలు పన్నారు.

బ్రాహ్మణులు ఏకం కావాలి

టీవీ శ్రీరామమూర్తి, రాష్ట్ర కోఆర్డినేటర్‌, టీడీపీ బ్రాహ్మణ సాధికార కమిటీ

ప్రస్తుత ప్రభుత్వ హయాంలో బ్రాహ్మణులపై ముఖ్యంగా ఆలయాల అర్చకులపై దాడులు నిత్యకృత్యమయ్యాయి. సమాజంలో ప్రతి ఒక్కరూ బ్రాహ్మణులను గౌరవిస్తారు. వైసీపీ నాయకులు మాత్రం వారిపై తమ పెత్తనాన్ని చెలాయిస్తూ వారిని దూషించటం, చేయి చేసుకోవటం వంటి చర్యలకు దిగారు. బ్రాహ్మణుల పట్ల వైసీపీకి ఉన్న కక్ష అర్థం అవుతోంది. అర్చకులపై దాడులు చేసిన వారి మీద తక్షణమే కఠిన చర్యలు తీసుకోకుండా ఉదాసీన వైఖరి అవలంచింటం దారుణం. అందుకే రానున్న ఎన్నికల్లో వైసీపీకు బుద్ధి చెప్పేందుకు బ్రాహ్మణులు ఏకం కావాలి.

Updated Date - May 02 , 2024 | 12:21 AM