Share News

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

ABN , Publish Date - May 16 , 2024 | 11:25 PM

పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం యంత్రాల కోసం ఆర్జీఎం, శాంతిరామ్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్టభద్రత ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తెలిపారు.

స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్ట భద్రత

నంద్యాల క్రైం/పాణ్యం, మే 16 : పార్లమెంట్‌, అసెంబ్లీ నియోజకవర్గాల ఈవీఎం యంత్రాల కోసం ఆర్జీఎం, శాంతిరామ్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలల్లో ఏర్పాటు చేసిన స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద పటిష్టభద్రత ఏర్పాటు చేసినట్లు ఎన్నికల అధికారి, కలెక్టర్‌ కె.శ్రీనివాసులు, ఎస్పీ కె.రఘువీర్‌రెడ్డి తెలిపారు. స్ట్రాంగ్‌రూమ్‌ల వద్ద సిబ్బంది నిత్యం అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు. గురువారం వారు ఆర్జీఎం, శాంతిరామ్‌ ఇంజనీరింగ్‌, ఫార్మసీ కళాశాలలను ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ స్ర్టాంగ్‌రూమ్‌ల వద్ద ఏర్పాటు చేసిన మూడంచెల భద్రతా సిబ్బంది అనుక్షణం అప్రమత్తంగా ఉండాలన్నారు. కేంద్ర పోలీస్‌ బలగాల గార్డులు, జిల్లా ఆర్మ్‌డ్‌ పోలీస్‌ గార్డులు, సివిల్‌ పోలీసు సిబ్బంది కౌంటింగ్‌ వరకు అనునిత్యం అప్రమత్తంగా ఉండాలని పేర్కొన్నారు. భద్రతా చర్యల్లో ఎలాంటి అలసత్వం ఉండరాదని హెచ్చరించారు. స్ట్రాంగ్‌రూమ్‌ల పరిసర ప్రాంతాల్లో 144వ సెక్షన్‌ అమల్లో ఉంటుందని, నిరంతరం సీసీ కెమెరాల పర్యవేక్షణ, పోలీస్‌ పహారా ఉండేలా చర్యలు తీసుకోవాలని పేర్కొన్నారు. డీఎస్పీ స్థాయి అధికారి 24 గంటలపాటు భద్రతను పర్యవేక్షిస్తుంటారన్నారు. ఎలాంటి అగ్నిప్రమాదాలు సంభవించకుండా ఫైర్‌ ఇంజన్లను ఏర్పాటు చేశామని పేర్కొన్నారు. విద్యుత్‌ అంతరాయం లేకుండా జనరేటర్లను కూడా ఏర్పాటు చేశామన్నారు. స్ట్రాంగ్‌రూమ్‌లు తెరిచేముందు, మూసే సమయంలో సీసీటీవీ కెమెరాల్లో సీల్‌ కనిపించే విధంగా ఏర్పాటు చేశామన్నారు. సీసీ ఫుటేజీలు అన్ని కమాండ్‌ కంట్రోల్‌కు అనుసంధానం చేయబడి 24గంటలు సిబ్బంది పర్యవేక్షిస్తూ ఉండేలా చర్యలు తీసుకున్నామని పేర్కొన్నారు. ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు తలెత్తకుండా జిల్లా వ్యాప్తంగా పోలీస్‌ పికెట్లు, మొబైల్‌ పెట్రోలింగ్‌ పార్టీలు ఏర్పాటు చేసినట్లు తెలిపారు. జూన్‌ 4న ఓట్ల లెక్కింపు ముగిసే వరకు ఎన్నికల కోడ్‌ అమల్లో ఉంటుందన్నారు. అసాంఘిక శక్తులు, రౌడీషీటర్లపై ప్రత్యేక నిఘా ఉంటుందన్నారు. అపోహలు, తప్పుడు సమాచారాలు నమ్మి ఎవరైనా అవాంఛనీయ సంఘటనలకు పాల్పడితే పోలీసు శాఖ తీవ్రంగా పరిగణించి అలాంటి వారిపై కఠినచర్యలు తీసుకుంటుందని ఎస్పీ హెచ్చరించారు.

Updated Date - May 16 , 2024 | 11:25 PM