Share News

వైసీపీ వస్తే అధికారికంగా భూకబ్జాలు

ABN , Publish Date - May 02 , 2024 | 12:42 AM

వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు.

వైసీపీ వస్తే అధికారికంగా భూకబ్జాలు
ప్రచారం చేస్తున్న గౌరు చరిత, బైరెడ్డి శబరి

గడివేముల, మే 1: వైసీపీ మరోసారి అధికారంలోకి వస్తే ప్రజల భూములను అధికారికంగా కబ్జా చేస్తారని పాణ్యం ఎమ్మెల్యే అభ్యర్థి గౌరు చరిత, నంద్యాల ఎంపీ అభ్యర్థి బైరెడ్డి శబరి అన్నారు. బుధవారం వారు గడివేములలో ఎన్నికల ప్రచారం నిర్వహించారు. వారు మాట్లాడుతూ జగన్‌మోహన్‌రెడ్డి తీసుకొచ్చిన భూయాజమాన్య హక్కు చట్టం కబ్జాకోరులకు, అక్రమార్కులకు ఊతమిచ్చేలా ఉందన్నారు. ప్రజల భూముల ఒరిజనల్‌ పత్రాలను ప్రభుత్వం దగ్గర పెట్టుకొని నకిలీ పత్రాలను రైతులకు ఇస్తామని అనడం దుర్మార్గమైన చర్య అన్నారు. వైసీపీ నేతలు ప్రభుత్వ భూములను కబ్జా చేశారని, రాత్రికి రాత్రే ఆన్‌లైన్‌లో పేరు మార్చి రైతుల భూములను స్వాహా చేశారని ఆరోపించారు. రైతుల పొలాల వద్ద, పాసు పుస్తకాలపై జగన్‌ ఫొటోలు పెట్టుకుంటున్నారని అన్నారు. జగనన్న సమగ్ర భూ సర్వే పేరుతో రైతుల పట్టా భూములను ఆన్‌లైన్‌లో ఇనామ్‌ భూములుగా నమోదు చేస్తున్నారని అన్నారు. అలగనూరు రిజర్వాయర్‌ మరమ్మతులు చేపట్టక పోవడంతో సాగునీరు లేక రైతులు తీవ్ర ఇబ్బందులు పడ్డారని, టీడీపీ అధికారంలోకి వస్తే మరమ్మతులు చేయిస్తామని చెప్పారు. వైసీపీ నాయకులు దోచుకోవడం, దాచుకోవడం తప్ప ప్రజల సంక్షేమాన్ని పట్టించుకోలేదని అన్నారు. హామీలు అమలు చేయలేని వైసీపీ నాయకులకు ఓట్లు అడిగే నైతిక హక్కు లేదని అన్నారు. అనంతరం టీడీపీ మండల అధ్యక్షుడు దేశం సత్యనారాయణరెడ్డి మాట్లాడుతూ గడివేములలో వైసీపీ నాయకుల అరాచకాలకు అంతేలేకుండా పోయిందని అన్నారు. కొర్రపొలూరు గ్రామంలో ప్రభుత్వ భూములను కబ్జా చేసి వారి అనునయులపై ఆన్‌లైన్‌లో నమోదు చేసుకున్నారని అన్నారు. గడివేములలో ఆదాయం కోసం అస్తవ్యస్థంగా డ్రైనేజీ కాలువలను నిర్మించారని అన్నారు. ప్రణాళికబద్ధంగా నిర్మించక పోవడంతో పెద్ద మురుగు కాలువల్లోని నీరు చిన్న కాలువలో ప్రవహించి మురుగు సమస్య నెలకొందన్నారు. మాజీ జడ్పీటీసీ సీతారామిరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మాజీ కో-ఆప్షన్‌ మెంబర్‌ ఎస్‌ఏ రఫిక్‌, ఈశ్వర్‌రెడ్డి, చిందుకూరు సర్పంచ్‌ అనసూయమ్మ, పంటా రామచంద్రారెడ్డి, మురళీమోహన్‌రెడ్డి, గడివేముల మాజీ సర్పంచ్‌ జమాల్‌బాషా పాల్గొన్నారు.

పాణ్యం నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి గౌరు చరిత నిర్వహించిన ఎన్నికల ప్రచారంతో గడివేముల పసుపుమయంగా మారింది. కార్యకర్తలు పసుపు రంగు బాణసంచాను పేల్చి టీడీపీ నాయకులు గజమాలతో గౌరుచరితమ్మను సత్కరించారు. అనంతరం గౌరు చరిత మాట్లాడుతూ వైసీపీ పాలనలో ప్రజలు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారని అన్నారు. గడివేములలో బైపాస్‌ రోడ్డు ఏర్పాటు చేయిస్తామని అన్నారు. జగనన్న కాలనీలో ఉన్న అనర్హులను గుర్తించి అర్హులకు ఇళ్ల పట్టాలు ఇస్తామని అన్నారు. టీడీపీ మండల అధ్యక్షుడు సత్యనారాయణరెడ్డి, మాజీ ఎంపీపీ శ్రీనివాసరెడ్డి, మాజీ జెడ్పీటీసీ సీతారామిరెడ్డి, గడివేముల మాజీ సర్పంచ్‌ జమాల్‌బాషా, పంటా రామచంద్రారెడ్డి, రఫిక్‌ తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:42 AM