Share News

ఇదేనా చిత్తశుద్ధి..!

ABN , Publish Date - May 02 , 2024 | 12:28 AM

ప్రతి పనిలో సీఎం జగన్‌ రాజకీయ లబ్ధి మాత్రమే చూస్తారనడానికి ఈ ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి.

ఇదేనా చిత్తశుద్ధి..!

రూ.1,030 కోట్లలో హంద్రీనీవా విస్తరణకు చంద్రబాబు శ్రీకారం

అవినీతి ముసుగేసి అటకెక్కించిన జగన్‌

సమాంతర కాలువ అంటూ మాయ

రూ.6,182 కోట్లలతో విస్తరణ పేరిట మరో డ్రామా

జగన్‌ నిర్లక్ష్యం.. రాయలసీమ ప్రాజెక్టులకు శాపం

అన్నదాతల ఆశలకు జగన్‌ ప్రభుత్వం గండి

కర్నూలు, మే 1 (ఆంధ్రజ్యోతి): ప్రతి పనిలో సీఎం జగన్‌ రాజకీయ లబ్ధి మాత్రమే చూస్తారనడానికి ఈ ఐదేళ్ల పాలనలో లెక్కలేనన్ని ఉదాహరణలు ఉన్నాయి. చిత్తశుద్ధి, ప్రజా సంక్షేమం లాంటివన్నీ ఒట్టి మాటలేనని, టీడీపీ వ్యతిరేకతకు, స్వలాభానికి ప్రజా ప్రయోజనాలను బలిపెట్టడంలో జగన్‌ను మించిన వాళ్లు లేరనే ఆరోపణలు ఉన్నాయి. గత తెలుగుదేశం ప్రభుత్వం చేపట్టిన ప్రాజెక్టులు పూర్తి చేయకపోగా.. ఆ పనుల్లో అవినీతి జరిగిందని విచారణ పేరిట అటకెక్కించారు. హంద్రీ నీవా కాలువ విస్తరణలో అదే జరిగింది. 3,850 క్యూసెక్కుల ప్రవాహానికి వీలుగా రూ.1,030 కోట్లతో చంద్రబాబు ప్రభుత్వం విస్తరణ పనులు చేపట్టి రూ.285.77 కోట్లు ఖర్చు చేసింది. ఆ తర్వాత వచ్చిన వైసీపీ ప్రభుత్వం ఆ పనులను అవినీతి సాకుతో అడ్డుకున్నది.

రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడప జిల్లాల్లో 6.05 లక్షల ఎకరాలకు సాగునీరు, 35 లక్షల జనాభాకు తాగునీరు ఇవ్వాలనే లక్ష్యంతో హంద్రీ నీవా సుజల స్రవంతి ఎత్తిపోతల పథకం చేపట్టారు. శ్రీశైలం ఎగువన నందికొట్కూరు మండలం మాల్యాల లిఫ్టు ద్వారా 40 టీఎంసీలు కృష్ణా వరద జలాలు ఎత్తిపోసి కరువు పల్లెల కన్నీళ్లు తుడవాలి. మెట్ట చేలను సస్యశ్యామలం చేయాలనే సంకల్పంతో ఫేజ్‌-1 కింద మాల్యాల నుంచి అనంతపురం జిల్లా జీడిపల్లి జలాశయం వరకు 216.30 కి.మీలు ప్రధాన కాలువ, 8 లిఫ్టులు నిర్మించారు. 12 పంపులు (ఒక్కో పంపు సామర్థ్యం 330 క్యూసెక్కులు) ద్వారా 3,850 క్యూసెక్కులు ఎత్తిపోయాల్సి ఉంటుంది.

రూ.285.77 కోట్లు ఖర్చు చేసిన చంద్రబాబు

హంద్రీనీవా ద్వారా రెండు వేల క్యూసెక్కులకు మించి లిఫ్ట్‌ చేయలేని పరిస్థితి ఉంది. దీంతో 2014లో బాధ్యతలు చేపట్టిన సీఎం చంద్రబాబు 3,850 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా కాల్వ విస్తరణ పనులు చేపట్టాలని ఇంజనీర్లను ఆదేశించారు. క్షేత్రస్థాయిలో సర్వే, డీపీఆర్‌ తయారీ తరువాత టెక్నికల్‌ అప్రూవల్‌ తీసుకుని కాల్వ విస్తరణకు రూ.1,030 కోట్ల నిధులు మంజూరు చేశారు. నాలుగు ప్యాకేజీలుగా విభజించి 2017-18లో పనులు మొదలు పెట్టారు. దాదాపు రూ.285.77 కోట్లు నిధులు ఖర్చు చేశారు. ఆ తరువాత 2019 మేలో వచ్చిన జగన్‌ ప్రభుత్వం విస్తరణ పనులు కొనసాగించి ఉంటే.. 3,850 క్యూసెక్కులు కృష్ణా జలాలు ఎత్తిపోసుకోవడానికి అవకాశం ఉండేది. అయితే ఆ పనుల్లో అవినీతి జరిగిందని విచారణ పేరుతో అటకెక్కించారు. ఇప్పటికే ఖర్చు చేసిన రూ.285.77 కోట్లు ప్రజా ధనం బూడిదలో పోసిన పన్నీరుగా మారింది. పత్తికొండ రిజర్వాయర్‌, కుడి, ఎడమ కాలువ అసంపూర్తి పనులకు నిధులు ఇవ్వకపోవడంతో పత్తికొండ, ఆలూరు నియోజకవర్గాల్లో 65 వేల ఎకరాలకు సాగునీరు ప్రశ్నార్థకంగా మారింది.

గంపెడు మట్టి కూడా తీయలేదు

చంద్రబాబు ప్రభుత్వంలో చేపట్టిన హంద్రీనీవా పనులు అటకెక్కించిన జగన్‌ రైతుల దృష్టి మళ్లించేందుకు రాయలసీమ దుర్భిక్ష నివారణ మిషన్‌ (ఆర్‌డీఎంపీ)లో భాగంగా 10 వేల క్యూసెక్కుల సామర్థ్యంలో హంద్రీనీవాకు సమాంతర కాలువ నిర్మిస్తామని కోతలు కోశారు. అది కుదరని తేలిపోయింది. టీడీపీ ప్రభుత్వం చేపట్టిన విస్తరణ పనులు కొనసాగిస్తే చంద్రబాబుకు మంచి పేరు వస్తుంది. అది సీఎం జగన్‌కు ఏ మాత్రం ఇష్టం లేదు. దీంతో రెట్టింపు సామర్థ్యం 6,500 క్యూసెక్కులు ప్రవాహానికి వీలుగా.. అప్రోచ్‌ కెనాల్‌ 4.806 కిలో మీటర్లతో పాటు మాల్యాల నుంచి జీడిపల్లి జలాశయం వరకు 216.300 కిలోమీటర్లు ప్రధాన కాలువ, 8 పంపింగ్‌ స్టేషన్లలో అదనపు పంపులు ఏర్పాటు కోసం 2021 సెప్టెంబరు 15న రూ.6,182.19 కోట్లు మంజూరు చేసి టెండర్ల పిలిచారు. ప్యాకేజీ-1 పనులకు హైదరాబాదుకు చెందిన మెగా ఇంజనీరింగ్‌ అండ్‌ ఇన్‌ఫ్రా లిమిటెడ్‌ కంపెనీ 0.112 శాతం లెస్‌కు, ప్యాకేజీ-2 పనులు హైదరాబాదుకు చెందిన డీఎస్‌ఆర్‌-వీపీఆర్‌ జాయింట్‌ వెంచర్‌ 0.107 శాతం లెస్‌కు దక్కించుకున్నాయి. 2021 డిసెంబరు 31న అగ్రిమెంట్‌ చేసుకున్నారు. 36 నెలల్లో పూర్తి చేయాలని ఒప్పందం కాగా.. రెండేళ్ల నాలుగు నెలలు (28 నెలలు) గడిచినా గంపెడు మట్టి కూడా తీయలేదు. రీసర్వే, డ్రాయింగ్‌ అప్రూవల్‌ పేరుతో కాలయాపన చేస్తున్నారు. నిధులు ఇవ్వలేకనే డ్రాయింగ్‌ పేరుతో జగన్‌ ప్రభుత్వం డ్రామా ఆడుతోందని రాయలసీమ సాగునీటి నిపుణులు అందోళన వ్యక్తం చేస్తున్నారు. చంద్రబాబు చేపట్టిన విస్తరణ పనులు అవినీతి ముద్ర వేసి రద్దు చేసిన జగన్‌.. తన ప్రభుత్వంలో టెండర్లు పూర్తి చేసి 28 నెలలు గడిచినా పనులు మొదలు పెట్టకపోవడం విమర్శలకు తావిస్తోంది. రాయలసీమ రైతు బిడ్డని అంటూ చెప్పుకుంటున్న జగన్‌కు సీమ సాగునీటి ప్రాజెక్టులపై ఇదేనా చిత్తశుద్ధి..? అని రైతులు ప్రశ్నిస్తున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:28 AM