Share News

‘నెలలోపు పిన్నాపురం రైతులకు నష్ట పరిహారం’

ABN , Publish Date - May 02 , 2024 | 12:40 AM

మండలంలోని పిన్నాపురం రైతుల భూములకు నెలలోపల నష్టపరిహారం అందిస్తామని గ్రీన్‌కో యాజమాన్యం నిర్వాహకులు నాయుడు హామీ ఇచ్చారు.

‘నెలలోపు పిన్నాపురం రైతులకు నష్ట పరిహారం’

పాణ్యం, మే 1: మండలంలోని పిన్నాపురం రైతుల భూములకు నెలలోపల నష్టపరిహారం అందిస్తామని గ్రీన్‌కో యాజమాన్యం నిర్వాహకులు నాయుడు హామీ ఇచ్చారు. గత మూడు రోజులుగా పిన్నాపురం రైతులు సోలార్‌ పరిశ్రమలో కోల్పోయిన భూములకు నష్టపరిహారం ఇవ్వాలని గ్రీన్‌కో సంస్థపై ఆందోళనలు చేపట్టారు. ఇందులో భాగంగా బుధవారం రైతులు గ్రీన్‌ కో నిర్మాణ పనులకు వెళ్లే రహదారులను కంపచెట్లు, రాళ్లు వేసి అడ్డగించారు. పోలీసుల చొరవతో రైతులను గ్రీన్‌కో యాజమాన్యంతో సమావేశం నిర్వహించారు. గ్రీన్‌కో నిర్వాహకులు నాయుడు ఈ సందర్బంగా మాట్లాడుతూ జూన్‌ చివరి లోగా రైతులకు అందాల్సిన పరిహారంపై రెవెన్యూ, తదతర అధికారులతో చర్చించి, ఇప్పటి వరకు అందించిన పరిహార వివరాలు పరిశీలించి పరిహారం అందిస్తామన్నారు. పరిహారం ఇవ్వని పక్షంలో రైతులు తమ భూములు స్వాధీనం చేసుకోవచ్చన్నారు. పరిహారం ఇచ్చిన తర్వాతే భూములు ఇవ్వాలన్నారు. అంత వరకు సోలార్‌ పనులకు ఎటువంటి ఆటంకం కలిగించరాదని రైతులను కోరారు. గ్రామంలో ఏలాంటి అవాంచనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా సీఐ నల్లప్ప ఆద్వర్యంలో పాణ్యం, గడివేముల ఎస్‌ఐలు అశోక్‌, వెంకట సుబ్బయ్య, పోలీసు సిబ్బంది బందోబస్తు నిర్వహించారు. గ్రీన్‌కో సిబ్బంది, గ్రామ ప్రజలు, రైతులు పాల్గొన్నారు.

Updated Date - May 02 , 2024 | 12:40 AM