Share News

బ్యాలెట్‌ పేపర్ల ‘కర్నూలు’

ABN , Publish Date - May 02 , 2024 | 06:27 AM

మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయినపుడు మన ముద్రణాలయం కర్నూలులో ఏర్పాటయింది. 1954 మే 4న నాటి విద్యాశాఖ మంత్రి ఎస్‌బీపీ పట్టాభిరామా రావు ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ భవనాన్ని ప్రారంభించారు

బ్యాలెట్‌ పేపర్ల ‘కర్నూలు’

స్థానిక ప్రభుత్వ ముద్రణాలయానికి 70 వసంతాలు

రేషన్‌ కార్డులు, పట్టాదారు

పాసుపుస్తకాలు, రిజిస్ట్రేషన్‌ పత్రాలూ ఇక్కడే

ఇప్పటికీ ‘ఎన్‌ఆర్‌ పేట’ నుంచే ఎన్నికలకు

అవసరమైన కాగితాలు

మద్రాస్‌ రాష్ట్రం నుంచి విడివడి ఆంధ్ర రాష్ట్రం ఏర్పాటయినపుడు మన ముద్రణాలయం కర్నూలులో ఏర్పాటయింది. 1954 మే 4న నాటి విద్యాశాఖ మంత్రి ఎస్‌బీపీ పట్టాభిరామా రావు ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌ భవనాన్ని ప్రారంభించారు.

మరో మూడు రోజుల్లో 70 ఏళ్లు పూర్తి చేసుకోబోతున్న కర్నూలు ఎన్‌ఆర్‌ పేటలోని ఆ ప్రెస్‌ది ఓ ప్రత్యేక చరిత్ర. రెండేళ్లపాటు ఆంధ్ర రాష్ట్ర ప్రధాన ముద్రణాలయంగా కొనసాగిన ఆ ప్రెస్‌... ఆ తరువాత హైద్రాబాద్‌ రాష్ట్రం విలీనం కావడంతో అక్కడికి తరలిపోయింది. తరువాత కర్నూలులోని ప్రింటింగ్‌ ప్రెస్‌ను ప్రాంతీయ ముద్రణాలయంగా మార్చి, విజయవాడలోనూ మరో ప్రాంతీయ ముద్రణాలయం ఏర్పాటు చేశారు.

2014లో రాష్ట్ర విభజన తరువాత విజయవాడలోని ప్రెస్‌ ప్రధాన ముద్రణాలయంగా మారింది. ప్రస్తుతం 200 మంది పనిచేస్తున్న కర్నూలు ప్రెస్‌లో అప్పట్లో 900 మంది పనిచేసేవారు. 1954లో లిథోగ్రా్‌ఫతో మొదలయిన ఈ ప్రింటింగ్‌ ప్రస్థానం... నేడు మారిన సాంకేతికతకు అనుగుణంగా ఆఫ్‌సెట్‌ మెషీన్‌తో సాగుతోంది.

మాజీ సీఎం కోట్ల విజయభాస్కర్‌ రెడ్డి హయాంలో కర్నూలు నగరంలోని సీతారామ్‌నగర్‌లో మూడు ఎకరాల విస్తీర్ణంలో ఈ ప్రింటింగ్‌ ప్రెస్‌కు పరిపాలనా కార్యాలయం ఏర్పాటయింది. ఇక్కడి ప్రెస్‌లో బ్యాలెట్‌ పేపర్లు, ఎన్నికలకు అవసరమైన ఇతర పత్రాలు, రిజిస్ర్టేషన్‌, ట్రెజరీ, రెవెన్యూ, హాస్పిటల్‌, పట్టాదారు పాసుపుస్తకాలు, భూమిశిస్తు రసీదులు, ఎన్టీఆర్‌ సీఎంగా ఉన్న సమయంలో రేషన్‌ కార్డులు, సమగ్ర శిక్ష సమాధాన పత్రాలు అచ్చు అయ్యేవి.

2024, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికలకు అవసరమైన ఎన్నికల పత్రాలను, పోస్టల్‌ బ్యాలెట్‌ వంటి కీలక పేపర్లనూ ఇక్కడే ప్రింటింగ్‌ చేయనున్నారు. నామినేషన్ల ఉపసంహరణ గడువు పూర్తయిన నేపథ్యంలో అన్ని జిల్లాల నుంచి ఫైనల్‌ అయిన అభ్యర్థుల పేర్లు, గుర్తుల జాబితా అందిన వెంటనే ప్రింటింగ్‌ ప్రక్రియ పూర్తి చేసి అన్ని జిల్లాలకూ అవసరమైన పత్రాలను పంపిణీ చేయనున్నారు.

- కర్నూలు(కలెక్టరేట్‌)

కర్నూలు నగరంలో ప్రాంతీయ ముద్రణాలయం 1954 మే 4న ప్రారంభమైనట్లు చూపుతున్న శిలాఫలకం

Updated Date - May 02 , 2024 | 06:27 AM