Share News

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు

ABN , Publish Date - May 01 , 2024 | 01:22 AM

జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. ఎన్నికల పరిశీలకులతో కలిసి కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు.

స్వేచ్ఛాయుత వాతావరణంలో ఎన్నికలు
సమావేశంలో మాట్లాడుతున్న కలెక్టర్‌ బాలాజీ

మచిలీపట్నం, ఏప్రిల్‌ 30 (ఆంధ్రజ్యోతి) : జిల్లాలో ఎన్నికలు స్వేచ్ఛగా, సజావుగా, నిష్పక్షపాతంగా నిర్వహించేందుకు అన్నిచర్యలు తీసుకుంటున్నామని, ప్రతి ఒక్కరు తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని కృష్ణాజిల్లా కలెక్టర్‌ బాలాజీ తెలిపారు. ఎన్నికల పరిశీలకులతో కలిసి కలెక్టర్‌ మంగళవారం కలెక్టరేట్‌లో పాత్రికేయుల సమావేశం నిర్వహించారు. సమావేశంలో కలెక్టర్‌ మాట్లాడుతూ, జిల్లాలో నామినేషన్ల ప్రక్రియ పూర్తయిందన్నారు. మచిలీపట్నం పార్లమెంటు స్థానానికి 15మంది, గన్నవరం అసెంబ్లీ నియోజకవర్గంలో 12, గుడివాడ 12, పెడన 10, మచిలీపట్నం 14, అవనిగడ్డ 12, పామర్రు 8, పెనమలూరు నియోజకవర్గంలో 11 మంది అభ్యర్ధులు పోటీలో ఉన్నట్టు తెలిపారు. జిల్లాలో ఈనెల 25వ తేదీ నాటికి మొత్తం ఓటర్లు 15,39,460 కాగా, వీరిలో 7,46,071 మంది పురుష ఓటర్లు, 7,93,332 మంది మహిళా ఓటర్లు, 57 మంది ఇతర ఓటర్లు ఉన్నట్టు తెలిపారు. పోలింగ్‌ విధుల్లో ఉన్న ఉద్యోగులతోపాటు సర్వీస్‌ ఓటర్లు, 85 సంవత్సరాలకు పైబడిన, దివ్యాంగ ఓటర్లు, ఎసెన్షియల్‌ సర్వీస్‌ కింద గుర్తించిన వివిధ శాఖల ఉద్యోగులకు కేంద్ర ఎన్నికలసంఘం పోస్టల్‌ బ్యాలెట్‌ సౌకర్యం కల్పించిందన్నారు. వీరి నుంచి ఇప్పటికే దరఖాస్తులు స్వీకరించినట్టు తెలిపారు. ఆయా నియోజకవర్గ కేంద్రాల్లో పోస్టల్‌ ఓటింగ్‌కు ఫెసిలిటేషన్‌ సెంటర్ల ఏర్పాటు చేస్తున్నట్టు తెలిపారు. ఓటు ఏ నియోజకవర్గంలో ఉందో అక్కడే పోస్టల్‌ ఓటింగ్‌ వినియోగించుకోవాలని తెలిపారు. ఇంటి వద్దనే ఓటింగ్‌ కొరకు బృందాలను నియమించామని, మే నెల2వ తేదీ నుంచీ 8వ తేదీ వరకు ఈ బృందాలు ఇంటింటికీ వెళ్లి హోం ఓటింగ్‌ నిర్వహిస్తాయని, ఇంకా ఎవరైనా హోం ఓటింగ్‌ వినియోగించుకోని వారుంటే మే 9, 10 తేదీల్లో ఓటు హక్కును వినియోగించుకునేందుకు అవకాశం కల్పిస్తామన్నారు. జిల్లా ఎస్పీ అద్నాన్‌ నయీమ్‌ అస్మి మాట్లాడుతూ, ఎన్నికలలో శాంతి భద్రతల ఏర్పాట్లు వివరించారు. ఇప్పటివరకు రూ.10.50కోట్ల వరకు నగదు మద్యం ప్రలోభాలకు సంబంధించి వస్తువులను సీజ్‌ చేసినట్టు తెలిపారు. సమావేశంలో ఎన్నికల సాధారణ పరిశీలకులు జాన్‌ కింగ్స్‌ లే, నరహరి సింగ్‌ బంగేర్‌, వ్యయపరిశీలకులు మనీష్‌కుమార్‌ చావ్డ, చవాన్‌ ప్రవీణ్‌ మోహన్‌దాస్‌, వికాస్‌ చంద్ర కరోల్‌, పోలీస్‌ పరిశీలకులు ప్రసాద్‌ ప్రలాద్‌ అక్కనోరు, డిఆర్వో కె.చంద్రశేఖరరావు, కలెక్టరేట్‌ ఎన్నికల విభాగం అధికారులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 01:22 AM