Share News

ఇనాం.. హామీ మాయం..?

ABN , Publish Date - May 01 , 2024 | 01:15 AM

ఇనాం భూముల సమస్య.. ఏళ్ల తరబడి బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రధాన సమస్య. టీడీపీ హయాంలో ఆర్డినెన్స్‌ అనే అస్త్రంతో ఇనాంకు పరిష్కార మార్గం చూపగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని తొక్కిపెట్టింది. ఫలితంగా రెండు జిల్లాల్లో 3,511 ఎకరాల ఇనాం భూములు, వాటి బాధితులు తమ సమస్య పరిష్కారానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు.

ఇనాం.. హామీ మాయం..?

ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఇనాం భూముల సమస్య

అధికారంలోకి వచ్చాక పరిష్కరిస్తానన్న జగన్‌

పరిష్కరించకపోగా, టీడీపీ తెచ్చిన ఆర్డినెన్స్‌కు బ్రేక్‌

ఇనాం భూముల సమస్య.. ఏళ్ల తరబడి బాధితులను ముప్పుతిప్పలు పెడుతున్న ప్రధాన సమస్య. టీడీపీ హయాంలో ఆర్డినెన్స్‌ అనే అస్త్రంతో ఇనాంకు పరిష్కార మార్గం చూపగా, వైసీపీ ప్రభుత్వం వచ్చాక దానిని తొక్కిపెట్టింది. ఫలితంగా రెండు జిల్లాల్లో 3,511 ఎకరాల ఇనాం భూములు, వాటి బాధితులు తమ సమస్య పరిష్కారానికి ఏళ్ల తరబడి ఎదురుచూస్తూనే ఉన్నారు.

కంచికచర్ల : ఉమ్మడి కృష్ణాజిల్లాలో 3,511.88 ఎకరాల ఇనాం భూములున్నాయి. నందిగామలో 650 ఎకరాలు, జగ్గయ్యపేటలో 400 ఎకరాలు ఉన్నాయి. ఈ రెండు పట్టణాల్లో 16 వేలమంది బాధితులు ఉన్నారు. పుష్కరకాలం నుంచి వీరంతా నరకం అనుభవిస్తున్నారు. పిల్లల చదువులకు, పెళ్లిళ్లకు, వైద్యానికి, ఇతరత్రా కుటుంబ అవసరాలకు బాధితులు పడుతున్న అవస్థలు అన్నీ ఇన్నీ కావు. ఈ భూములపై బ్యాంకులు రుణాలు ఇవ్వటం లేదు. ఏదో ఒక ధరకు అమ్ముదామనుకున్నా కొనే నాథుడు లేడు. వైసీపీ ప్రభుత్వ ఐదేళ్ల మొద్దునిద్ర వల్ల ఈ ఇనాం భూముల సమస్య అలాగే ఉండిపోయింది.

టీడీపీ తెచ్చిన ఆర్డినెన్స్‌

పూర్వం రాజులు, జమిందారులు.. దేవాలయాలకు సేవలందించే వారికి జీవనోపాధి నిమిత్తం సాగు భూములను ఇనాంగా ఇచ్చారు. స్వాతంత్య్రం వచ్చాక 1956లో ప్రభుత్వం ఇనాం చట్టాన్ని తీసుకొచ్చింది. అర్హులైన వారికి అధికారులు రైత్వారీ పట్టాలు ఇచ్చారు. కొంతమంది అనర్హులు కూడా పట్టాలు పొందారు. కాలక్రమేణా గ్రామాలు పట్టణాలుగా విస్తరించటంతో ఎక్కువ శాతం భూములు స్థలాలుగా మారాయి. ఎక్కడికెక్కడ విలువైన భవనాలు వెలిశాయి. ఇనాం భూములపై సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు నేపథ్యంలో 2013లో సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ప్రభుత్వం ఇనాం ల్యాండ్‌ ఎబాలిషన్‌ చట్టానికి చేసిన సవరణలో చిన్న తప్పిదం జరిగింది. ఇది 1956 నుంచి జరిగిన లావాదేవీలకు వర్తింపజేయటంతో ఈ భూము లన్నీ నిషేధిత జాబితాలోకి వెళ్లాయి. రిజిస్ట్రేషన్లు లేకపోవటం వల్ల బాధితులు పలుమార్లు ఆందోళనకు దిగారు. సమస్య తీవ్రతను ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లారు. ఆ తరువాత సీఎం చంద్రబాబు స్పందించి ఆంధ్రప్రదేశ్‌ ఇనాం (ఎబాలిషన్‌ అండ్‌ కన్వర్షన్‌ ఇన్‌ టూ రైత్వారీ) అమెండ్‌మెంట్‌ ఆర్డినెన్స్‌-2019 పేరుతో 2019, ఫిబ్రవరిలో ఆర్డినెన్స్‌ తెచ్చారు. దీనిప్రకారం 2013కు ముందు ఇచ్చిన పట్టాలు చెల్లుబాటు అవుతాయి. ఇనాం సర్వీసు భూముల అంశం కేంద్ర, రాష్ట్రాలకు సంబంధించిన ఉమ్మడి జాబి తాలో ఉన్నందున అప్పటి రాష్ట్రపతి రామ్‌నాథ్‌ కోవింద్‌ ఆర్డినెన్స్‌కు ఆమోదం తెలిపారు. ఇక దీనికి చట్టబద్ధత కల్పించాల్సి ఉండగా, వైసీపీ ప్రభుత్వం వచ్చింది.

వైసీపీ వచ్చాక మోకాలడ్డు

ఇనాం సమస్యను పరిష్కరించి, బాధితుల కళ్లల్లో ఆనందం నింపుతానని గత ఎన్నికలకు ముందు జగన్‌ హామీ ఇచ్చారు. అధికారం చేపట్టాక ఆ హామీని మరిచిపోయారు. బాధితులకు న్యాయం జరిగేలా 2019 ప్రారంభంలో టీడీపీ ప్రభుత్వం తీసుకొచ్చిన ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించకుండా మోకాలడ్డారు. ఆర్డినెన్స్‌కు రాష్ట్రపతి ఆమోదముద్ర వేసినప్పటికీ, చంద్రబాబుకు పేరొస్తుందన్న దురుద్దేశంతో కావాలనే నీరుగార్చారు.

ఆగిన అమ్మకాలు.. నిలిచిన రిజిస్ట్రేషన్లు

2013లో తీసుకొచ్చిన చట్ట సవరణ వల్ల వేలాది మంది పలు ఇబ్బందులు పడుతున్నారు. అప్పటి నుంచి రిజిస్ట్రేష న్లు చేయకపోవటంతో ఈ భూముల క్రయవిక్రయాలు నిలిచిపోయాయి. అయితే, కొందరు తమ అవసరాలకు అమ్ముకున్నారు. కాలగమనంలో ఈ భూములు చేతులు మారాయి. 2013లో సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పు వల్ల సర్వీస్‌ ఇనాం భూముల రిజిస్ట్రేషన్‌ నిలిపివేస్తూ, రాష్ట్ర ప్రభుత్వం చట్ట సవరణ చేయాల్సి వచ్చింది. సవరణలో అక్షరం తేడాతో అంతా తారుమారైంది. సవరణలో విత్‌ ప్రాస్పెక్టివ్‌ ఎఫెక్ట్‌ అని ఉండాల్సి ఉండగా, విత్‌ రెప్రాస్పెక్టివ్‌ అని ఇవ్వటంతో 1956 ఇనాం ఎబాలిష్‌ యాక్ట్‌ దగ్గర నుంచి కొనుగోళ్లు జరిగిన వాటిన్నింటినీ ప్రభుత్వం నిషేధిత జాబితాలో పెట్టింది. వాస్తవానికి 2013 వరకు సర్వీసుదారులుగా ఉన్నవారికి ఇనాం భూములు చెందాలని, 2013 తర్వాత కొత్తగా ఇవ్వరాదని చట్ట సవరణ చేశారు. సవరణలో అక్షరం తేడా వల్ల అప్పటికే రాష్ట్రంలో ఇనాం భూములు కొన్న వేలాది మంది చిన్న, మధ్యతరగతి కుటుంబాల వారు బాధితులయ్యారు.

నరకం చూస్తున్నాం..

12 ఏళ్ల నుంచి అష్టకష్టాలు పడుతున్నాం. ఇప్పటికే ఒకటికి పదిసార్లు రిజిస్ట్రేషన్లు జరిగిన స్థలాలు కూడా నిషేధిత జాబితాలో ఉన్నాయి. జగన్‌ హామీలను నమ్మి ఓట్లేసిన మాకు తీరని అన్యాయం చేశారు. సమస్యను పరిష్కరించకుండా కావాలని కాలయాపన చేశారు. ఆర్డినెన్స్‌కు చట్టబద్ధత కల్పించకపోవటం దుర్మార్గం. మమ్మల్ని అగాధంలోకి నెట్టిన జగన్‌కు ఈ ఎన్నికల్లో బుద్ధి చెబుతాం.

- రాటకొండ రామకోటేశ్వరరావు, ఇనాం భూముల బాధితుల సంఘం రాష్ట్ర నాయకుడు

Updated Date - May 01 , 2024 | 01:15 AM