Share News

హజ్‌ యాత్రకు సర్వం సిద్ధం చేయండి

ABN , Publish Date - May 01 , 2024 | 01:15 AM

హజ్‌ యాత్ర విజయవంతానికి కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ అన్నారు. హజ్‌-2024 యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో సన్నద్ధత సమావేశం మంగళవారం వన్‌టౌన్‌లోని షాదీఖానాలో జరిగింది.

హజ్‌ యాత్రకు సర్వం సిద్ధం చేయండి

వన్‌టౌన్‌, ఏప్రిల్‌ 30 : హజ్‌ యాత్ర విజయవంతానికి కేంద్ర, రాష్ట్ర శాఖల అధికారులు, సిబ్బంది సమన్వయంతో పనిచేయాలని మైనార్టీ సంక్షేమ శాఖ కార్యదర్శి హర్షవర్థన్‌ అన్నారు. హజ్‌-2024 యాత్రలో భాగంగా ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో సన్నద్ధత సమావేశం మంగళవారం వన్‌టౌన్‌లోని షాదీఖానాలో జరిగింది. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, హజ్‌ యాత్రకు ఈ ఏడాది కోటా 2,902 మందికి గాను ఇప్పటివరకు 2,580 మంది నమోదు చేసుకున్నారన్నారు. విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 720 మంది, హైదరాబాద్‌ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 1118 మంది, బెంగుళూరు ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 720 మంది, చెన్నై ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి 9 మంది యాత్రకు బయలుదేరనున్నట్టు వివరించారు. హజ్‌ యాత్రీకులు ఆయా ఎంబార్కేషన్‌ పాయింట్‌ల నుంచి మే 26 నుంచి జూన్‌ 9వ తేదీ మధ్య బయలుదేరతారని తెలిపారు. సుమారు 38 నుంచి 42 రోజుల యాత్ర ముగించుకుని జూలై 1 నుంచి 21వ తేదీ లోగా తిరిగి విజయవాడ చేరుకుంటారని తెలిపారు. విజయవాడ ఎంబార్కేషన్‌ పాయింట్‌ నుంచి యాత్రీకుల ప్రయాణానికి స్పైస్‌జెట్‌ సేవలు అందించడానికి ముందుకు వచ్చినట్టు తెలిపారు. హజ్‌ యాత్రీకుల సౌకర్యార్థం గన్నవరం ఎయిర్‌పోర్ట్‌ సమీపంలోని మదర్సాలో బస ఏర్పాటు చేయనున్నట్టు తెలిపారు. హజ్‌ యాత్రికులకు సుమారు 40 రోజుల పర్యటనకు మాత్రమే అనుమతి ఉందని అంతకంటే ఎక్కువ రోజులకు అనుమతి లేదని ఆయన వివరించారు. హ్యాండ్‌బ్యాగ్‌ లగేజీ కింద 8 కేజీల బ్యాగు, చెక్‌ ఇన్‌ లగేజీ కింద 20 కేజీల బరువున్న రెండు బ్యాగులకు అనుమతి ఉందని తెలిపారు. ఎస్‌బీఐ బ్యాంకు తమ శాఖ తాత్కాలిక సెంటర్‌ ఏర్పాటు చేయడం జరుగుతుందన్నారు. ఒక్కొక్క యాత్రీకునికి సుమారు రూ.4లక్షల వరకు ఫారీన్‌ ఎక్స్‌ఛేంజ్‌ అందిస్తున్నట్టు తెలిపారు. సీఆర్‌డీఏ అడిషనల్‌ కమిషనర్‌ షేక్‌ హాలీం బాషా, ఎయిర్‌పోర్ట్‌ అథిరిటీ అధికారి లక్ష్మీకాంతరెడ్డి, హజ్‌ కమిటీ స్టేట్‌ సభ్యులు, ఏపీ హజ్‌ కమిటీ ఎగ్జిక్యూటివ్‌ అధికారి ఎల్‌.అబ్దుల్‌ ఖాదర్‌, ఎస్‌బీఐ బ్యాంక్‌ అసిస్టెంట్‌ జనరల్‌ మేనేజర్‌ ఎం.నాగవేణి, డిప్యూటీ జనరల్‌ మేనేజర్‌ మనీష్‌ కుమార్‌, ఆయా విభాగాల అధికారులు తదితరులు పాల్గొన్నారు.

Updated Date - May 01 , 2024 | 01:15 AM