Share News

అప్పు రూ.5 కోట్లు

ABN , Publish Date - May 02 , 2024 | 12:58 AM

శ్రీజ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రుణం రూ.3 కోట్లు. ఇదికాకుండా ఇతర అప్పులు కలిపి మొత్తం రూ.5 కోట్ల అప్పు. పటమటలోని ఫన్‌టైమ్స్‌ క్లబ్‌ వెనుక భార్య, తల్లి, పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ దారావత్‌ శ్రీనివాస నాయక్‌ కేసులో తేలిన అంశాలివి. ఘటన జరిగిన తర్వాత పోలీసులు శ్రీనివాస నాయక్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించినప్పుడు ఈ లెక్కలు తేలాయి.

అప్పు రూ.5 కోట్లు

శ్రీజ ఆసుపత్రి ఏర్పాటుకు రూ.3 కోట్ల రుణం

మరో రూ.2 కోట్ల అదనపు అప్పు

ఇవికాక ఇద్దరు పిల్లల ఆరోగ్య పరిస్థితి

మానసిక ఒత్తిడితో సతమతమైన డాక్టర్‌ శ్రీనివాస నాయక్‌

ఐదుగురి మృతదేహాలకు పోస్టుమార్టం పూర్తి

శ్రీజ ఆసుపత్రిలో పోలీసుల విచారణ

(ఆంధ్రజ్యోతి-విజయవాడ) : శ్రీజ ఆసుపత్రి ఏర్పాటు చేయడానికి ఎస్‌బీఐ నుంచి తీసుకున్న రుణం రూ.3 కోట్లు. ఇదికాకుండా ఇతర అప్పులు కలిపి మొత్తం రూ.5 కోట్ల అప్పు. పటమటలోని ఫన్‌టైమ్స్‌ క్లబ్‌ వెనుక భార్య, తల్లి, పిల్లలను హత్య చేసి, ఆత్మహత్య చేసుకున్న ఆర్థోపెడిక్‌ డాక్టర్‌ దారావత్‌ శ్రీనివాస నాయక్‌ కేసులో తేలిన అంశాలివి. ఘటన జరిగిన తర్వాత పోలీసులు శ్రీనివాస నాయక్‌ స్నేహితులు, కుటుంబ సభ్యులను విచారించినప్పుడు ఈ లెక్కలు తేలాయి. డోర్నకల్‌ రోడ్డులో శ్రీజ ఆసుపత్రిని ఏడాది క్రితం 15 పడకలతో ఏర్పాటు చేశారు. దీనికి పెట్టుబడి పెరుగుతున్నా రాబడి లేదు. అప్పులకు తోడు కుటుంబంలో పిల్లలిద్దరి పరిస్థితిపై ఆయన నిత్యం మానసిక ఒత్తిడితో ఉండేవాడని తెలిసింది. ఆర్థిక, ఆసుపత్రి వ్యవహారాలతో పాటు కుటుంబ పరిస్థితుల గురించి పోలీసులు ఆరా తీశారు. కూతురు శైలజకు ఆటిజం, కొడుకు శ్రీహాన్‌ హైపర్‌ యాక్టివ్‌. వీరికోసం ఉషారాణి తన సాఫ్ట్‌వేర్‌ ఉద్యోగం వదిలేశారు.

అన్నయ్యకు ఐదు సందేశాలు

భార్య ఉషారాణి, తల్లి రమణమ్మ, పిల్లలు శైలజ, శ్రీహాన్‌ను హత్య చేయడానికి ముందు శ్రీనివాస నాయక్‌ ఐదు వాయుస్‌ సందేశాలను వాట్సాప్‌ ద్వారా పంపినట్టు తెలిసింది. కారులో ఒక బ్యాగ్‌ పెట్టానని, అందులో బంగారం, డబ్బు ఉంచానని, వాటితో ఇంటి అప్పులు తీర్చాలని ఒక సందేశం, తనకు ఆరోగ్యం సహకరించడం లేదని, తీవ్రమైన ఒత్తిడిలో ఉన్నానని, తాను ఏమైనా చేసుకుంటే తనను ఇష్టపడేవారు ఇబ్బందిపడతారనే ఈ పని చేస్తున్నానని మరో సందేశం, తాను ఫైనాన్షియల్‌ మేనేజ్‌మెంట్‌ చేయలేకపోయానని, ఈ పని చేసినందుకు సారీ అని చెప్పి మరో సందేశం పెట్టారు. అయితే, ఈ మెసేజ్‌లు మాత్రం అన్నయ్య దుర్గాప్రసాద్‌కు చేరలేదు. డాక్టర్‌ ఫోన్‌ను ఫ్లైట్‌మోడ్‌లో పెట్టుకుని పంపడంతో ఈ సందేశాలు ఆయనకు చేరలేదు. కాగా, నాయక్‌ కుటుంబ సభ్యులకు విజయవాడ ప్రభుత్వాసుపత్రి మార్చురీలో బుధవారం పోస్టుమార్టం పూర్తిచేశారు. శ్రీనివాస నాయక్‌, తల్లి రమణమ్మ మృతదేహాలను అన్నయ్య దుర్గాప్రసాద్‌కు అప్పగించారు. భార్య ఉషారాణి, పిల్లలు శైలజ, శ్రీహాన్‌ మృతదేహాలను ఆమె తండ్రి రామాంజీకి అప్పగించారు.

శ్రీజ పత్రాల పరిశీలన

డోర్నకల్‌ రోడ్డులోని శ్రీజ ఆసుపత్రిలో పోలీసులు బుధవారం విచారణ చేపట్టారు. ఆసుపత్రిని ముగ్గురు వైద్యులు తీసుకున్నారు. బ్యాంక్‌ రుణం రూ.3 కోట్లు, ఆసుపత్రి నిర్వహణను వారు తీసుకుని, పదిశాతం వాటాను నాయక్‌కు ఇచ్చినట్టు అగ్రిమెంట్‌ రాసుకున్నారని స్నేహితులు తెలిపారు. పత్రాలను పోలీసులు పరిశీలిం చారు. అప్పులు తీర్చడానికి ఆస్తులు విక్రయించాలని చూసినా, రాబడి లేని ఆసుపత్రి కోసం వద్దని మావయ్య రామాంజీ అభ్యంతరం వ్యక్తం చేసినట్టు తెలిసింది.

వేగస్‌ కోయడం వల్లే..

నాయక్‌ ముందుగా భార్య, తల్లి, పిల్లలను మెడ వద్ద కోసి హత్య చేశారు. భార్య, కుమార్తెకు కుడివైపున, తల్లి, కుమారుడికి ఎడమ వైపున మెడపై ఉన్న నరం కోశారు. వైద్య పరిభాషలో ఈ నరాన్ని వేగస్‌ అని వ్యవహరిస్తారు. దీనిద్వారా మెదడుకు రక్త సరఫరా అవుతుంది. ఈ నరాన్ని కోసేస్తే మొత్తం రక్త సరఫరా ఆగిపోతుంది. మూడు, నాలుగు నిమిషాలకే అపస్మారక స్థితిలోకి వెళ్లిపోతారు. వైద్యుడిగా ఉన్న నాయక్‌ దీనిపై పూర్తి అవగాహన ఉండడంతోనే ఇలా చేశాడని అతడి స్నేహితులు చెబుతున్నారు.

Updated Date - May 02 , 2024 | 12:58 AM